Begin typing your search above and press return to search.

కెనడాలో కెనడియన్ గా ఉండాలి.. ఇండియన్స్ లా ఉంటే ఇదిగో ఈ మహిళ పరిస్థితిలా మారుతుంది

ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఎదుటివారిని భయపెట్టే ఉద్దేశంతో సదరు మహిళే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసింది.

By:  A.N.Kumar   |   12 Sept 2026 12:59 PM IST
కెనడాలో కెనడియన్ గా ఉండాలి.. ఇండియన్స్ లా ఉంటే ఇదిగో ఈ మహిళ పరిస్థితిలా మారుతుంది
X

విదేశాలకు వెళ్లి స్థిరపడిన తర్వాత కూడా మన వ్యక్తిగత భావజాలాలు.. ఆహార నియమాలను ఇతరులపై బలవంతంగా రుద్దాలని చూస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చాటిచెప్పే ఘటనా ఇది. కెనడాలోని సర్రే నగరంలో భారతీయ మూలాలున్న ఒక మహిళ ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ఆవరణలో అద్దెకు ఉంటున్నవారు బీఫ్ బార్బెక్యూ వండుతున్నారని అక్కడకు వెళ్లి తప్పుబడుతూ ఆమె చేసిన రచ్చ చివరకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ జోక్యంతో అరెస్టు వరకు దారితీసింది.

కెనడాలోని సర్రే నగరంలో భారతీయ మూలాలున్న ఒక మహిళ, తన ఇంటి ఆవరణలో అద్దెకు ఉంటున్నవారు బీఫ్ బార్బెక్యూ చేసుకుంటున్నారనే కారణంతో చేసిన రగడ తీవ్ర వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల ప్రకారం.. ఇంటి వెనుక భాగంలో అద్దెదారులు తమ స్నేహితులతో కలిసి సరదాగా బార్బెక్యూ చేసుకుంటుండగా యజమానురాలైన సదరు మహిళ తీవ్ర ఆగ్రహంతో అక్కడికి చేరుకుంది. పొగ వల్ల గోడలు మరకలవుతున్నాయని పైకి చెబుతున్నప్పటికీ వండుతున్నది గోమాంసం కావడమే ఆమె ఆగ్రహానికి అసలు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. వివాదం ముదిరిన క్రమంలో ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా చేతిలో ఉన్న కర్రతో ఆహారాన్ని పడదోసేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా రాయి, మస్కిటో బ్యాట్ వంటి వస్తువులతో అక్కడున్న వారిపై దాడికి యత్నిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఎదుటివారిని భయపెట్టే ఉద్దేశంతో సదరు మహిళే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసింది. అయితే సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న కెనడా పోలీసులు అక్కడ పరిస్థితిని పరిశీలించి ప్రత్యక్షంగా రికార్డైన వీడియో ఆధారాలను సేకరించారు. బాధితుల వాదనలు విన్న తర్వాత చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇతరులను బెదిరించిన సదరు మహిళనే దోషిగా నిర్ధారిస్తూ ఆమెకు హ్యాండ్‌కఫ్స్ వేసి స్టేషన్‌కు తరలించారు. ఆమెపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కెనడా వంటి దేశాల్లో చట్టబద్ధమైన పరిధిలో నచ్చిన ఆహారాన్ని తినే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ఇతరుల హక్కులకు భంగం కలిగించడం సరికాదని పలువురు స్పష్టం చేస్తున్నారు. పొరుగువారితో ఏవైనా సమస్యలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప.. ఇలా రచ్చ చేసి భౌతిక దాడులకు దిగడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు స్థానిక చట్టాలు, ఇతర సంస్కృతులను గౌరవించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరొకసారి గట్టిగా గుర్తుచేస్తోంది.