విశాఖలో వైసీపీ 'ఇమేజ్' నిలబెట్టేదెవరు.. ?
2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ పాగా వేసింది. అప్పట్లో పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్నవి.
By: Garuda Media | 26 Aug 2026 7:00 AM IST2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ పాగా వేసింది. అప్పట్లో పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్నవి. విజయసాయిరెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సంద ర్భంలో ఆయన పాదయాత్ర కూడా చేశారు. నిజానికి 2019లో వైసీపీ హవా కొనసాగినప్పటికీ.. విశాఖ పరిధి లోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీనే విజయం దక్కించుకుంది. దీంతో ఆ ప్రభావం కార్పొరే షన్ ఎన్నికలపై పడుతుందన్న భావనతో సాయిరెడ్డి సుమారు నాలుగు మాసాల ముందే ఇక్కడ రాజకీయాలు చేశారు.
విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ పాగా వేసేలా.. సాయిరెడ్డి అన్నీతానై వ్యవహరించారు. కార్పొరేషన్‌లో వార్డు అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు సాయిరెడ్డి చూసుకున్నారు. దీనికితోడు ఆయన చేసిన పాద యాత్ర కూడా పార్టీకి కలిసి వచ్చింది. మొత్తంగా ఆయన దూకుడుతో వైసీపీ తొలిసారి విశాఖపై పట్టు దక్కించుకుని కార్పొరేషన్‌ను చేజిక్కించుకుంది. కట్ చేస్తే.. మరో రెండు మాసాల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి మాదిరిగా దూకుడుగా వ్యవహరించే వారు ఎవరన్నది ప్రశ్న.
ప్రస్తుతం సాయిరెడ్డి రాజకీయంగా వైసీపీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ప్లేస్‌ను కొన్నాళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి అప్పగించారు. ఆయనపై విమర్శలు రావడంతోపాటు అంతర్గత అసంతృప్తి కూడా పెరిగిపో యిన నేపథ్యంలో తప్పించారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు బాధ్య తలు అప్పగించారు. అయితే.. ఆయన ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. అంతేకాదు.. నాయకుల మధ్యకలివిడి తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో సాయిరెడ్డి తీసుకువచ్చిన ఇమేజ్ ఏమేరకు దక్కుతుందన్నది ప్రశ్నగా మారింది.
టీడీపీ అష్టదిగ్బంధం..!
టీడీపీ విశాఖను అష్టదిగ్బంధం చేసిందనే టాక్ వినిపిస్తోంది. డేటా కేంద్రం సహా.. ఐటీ పరిశ్రమలు, ఆర్సె లార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ సహా.. అనేక పెట్టుబడులు విశాఖకు వస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ గ్రాఫ్‌ను పెంచాయి. దీనికితోడు ఎంపీ భరత్, ఎమ్మెల్యేల మధ్య సానుకూల రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గం కూడా ఇక్కడే ఉన్న దరిమిలా.. నాయకులు ఒకే తాటిపై నడుస్తున్నారు. సో.. 2021లో ఉన్న టీడీపీ రాజకీయాలతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింత బలం పుంజుకుని బాహుబలి మాదిరిగా విజృంభిస్తోంది. దీంతో వైసీపీ ఏం చేస్తుంది? అనేది చూడాలి.
