డాలర్ల రోజులు పోయాయా? టెక్సాస్‌లో చెల్లుబాటవుతున్న బంగారం, వెండి నాణాలు
అబ్బెబ్బే అదేం లేదు.. ఈ చట్టం పూర్తిగా స్వచ్ఛంద విధానం. అంటే మీరు బంగారం ఇస్తానంటే ఎదురుగా ఉన్న వ్యాపారి “నాకొద్దు నీ బంగారం, డాలర్ ఉంటే ఇవ్వు” అని నిర్దాక్షిణ్యంగా మొహం మీదే చెప్పొచ్చు.
By: A.N.Kumar | 4 Sept 2026 5:00 AM ISTఅమెరికా అనగానే మనకి గుర్తొచ్చేది మెరిసిపోయే డాలర్లు. కానీ టెక్సాస్ మహాశయులు మాత్రం “మాకు ఈ కాగితాల మీద నమ్మకం పోయింది బాస్.. మేం మళ్లీ ఆరో శతాబ్దానికి వెళ్తాం” అంటూ ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 1, 2026 నుంచి అక్కడ బంగారం, వెండిని కూడా ‘లీగల్ టెండర్’ చెల్లుబాటయ్యే కరెన్సీ గా గుర్తించే చట్టం (హెచ్బీ 1056) అమల్లోకి వచ్చేసింది. ఇకపై మీరు సూపర్ మార్కెట్‌లో అరకిలో టమోటాలు కొని, మీ జేబులో ఉన్న చిన్న బంగారు బిస్కట్ లేదా వెండి నాణెం తీసి క్యాషియర్ ముఖాన కొట్టొచ్చన్నమాట. అయితే ఆగు బాస్.. అంత తొందరపడి బంగారు గాజులతో వాల్‌మార్ట్‌కి వెళ్తే పప్పులో కాలేసినట్లే.. ఈ చట్టంలో ఒక పెద్ద 'ట్విస్ట్' ఉంది.
బంగారం తీసుకోకపోతే కేసు పెడతారా?
అబ్బెబ్బే అదేం లేదు.. ఈ చట్టం పూర్తిగా స్వచ్ఛంద విధానం. అంటే మీరు బంగారం ఇస్తానంటే ఎదురుగా ఉన్న వ్యాపారి “నాకొద్దు నీ బంగారం, డాలర్ ఉంటే ఇవ్వు” అని నిర్దాక్షిణ్యంగా మొహం మీదే చెప్పొచ్చు. పాపం గవర్నర్ గ్రెగ్ అబాట్ గారు చట్టం అయితే చేశారు కానీ వ్యాపారులను బలవంత పెట్టే ధైర్యం చేయలేదు. ఇక మనవాళ్ళు చెల్లించే బంగారంపై బరువు, స్వచ్ఛత , రిఫైనరీ ముద్రలు కంపల్సరీ ఉండాలి. ఇంట్లో పెళ్ళికి చేయించిన డిజైన్ గాజులు, పాత చైన్లు పట్టుకెళ్తే అక్కడ అస్సలు నడవవు.
మన డాలర్ మామ పరిస్థితి ఏంటి?
ఫెడరల్ రిజర్వ్ నోట్లకు ఎలాంటి ముప్పూ లేదు. డాలర్ ఎప్పటిలాగే టెక్సాస్ మహారాజుగా ఏలుతుంది. బంగారం కేవలం ఒక ఎక్స్‌ట్రా ఆప్షన్ మాత్రమే. భవిష్యత్తులో అంటే 2027 మే నుంచి "డిజిటల్ గోల్డ్" పేమెంట్స్ కూడా తెస్తారట. అంటే డిజిటల్ వ్యాలెట్‌లో ఉన్న బంగారం బ్యాలెన్స్‌తో స్కాన్ చేసి కాఫీ కొనుక్కోవచ్చన్నమాట.
మన తెలుగు వారికి పండగేనా?
టెక్సాస్‌లో ఉన్న మన భారతీయ, తెలుగు కుటుంబాలకి బంగారం అంటే ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఇకపై మనవాళ్ళు ఫంక్షన్లలో “నా దగ్గర పది డాలర్లు ఉన్నాయి” అని కాకుండా “నా దగ్గర రెండు తులాల లీగల్ టెండర్ ఉంది” అని బిల్డప్ ఇచ్చే అవకాశం దక్కింది.
మొత్తానికి టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చూడటానికి రాతి యుగం నాటి 'వస్తు మార్పిడి పద్ధతి' కి హైటెక్ మెరుగులు దిద్దినట్లు ఉంది తప్ప రోజూవారీ లావాదేవీల్లో ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ దేవుడికే తెలియాలి. బంగారం కొనేటప్పుడే దిగులుపడే జనాలు ఇక దాంతో బిల్లులు కట్టే రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి.
