Begin typing your search above and press return to search.

ఆదిలోనే అర‌మ‌రిక‌.. విజ‌య్ హామీల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం!

త‌మిళ‌నాట కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆదిలో నే విమ‌ర్శ‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

By:  Garuda Media   |   11 May 2026 11:20 AM IST
ఆదిలోనే అర‌మ‌రిక‌.. విజ‌య్ హామీల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం!
X

త‌మిళ‌నాట కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆదిలో నే విమ‌ర్శ‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన కీల‌క హామీల‌ను ఆయ‌న అమ‌లు చేస్తారా? లేదా? అనే సందేహాలు తొలిరోజునే త‌మిళ‌నాట పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. విజ‌య్ చేసిన రెండు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు.

1) రాష్ట్ర అప్పుల ఊబిలో ఉంది: రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంద‌ని విజ‌య్ అన్నారు. గ‌త‌డీఎంకే ప్ర‌భు త్వం 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్పులు చేసింద‌ని.. ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని చెప్పారు.

2) 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సంత‌కం చేసినా.. దీనిని అమ‌లు చేసే విధానంపై ఇచ్చిన జీవో కూడా వివాదానికి దారి తీసిం ది. ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌తి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని విజ‌య్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎంగా ప్ర‌మాణం చేసిన వెంట‌నే తొలి సంత‌కం దీనికి సంబంధించిన ఫైలుపైనే చేశారు. అయితే.. జీవోలో మాత్రం మెలిక పెట్టా రు. ఇదే వివాదానికి.. త‌దుప‌రి ఎన్నిక‌ల హామీల అమ‌లుపై సందేహాల‌ మేఘాలు క‌మ్ముకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. రెండు నెల‌ల పాటు 500 యూనిట్లు వినియోగించిన కుటుంబాల‌కు మాత్ర‌మే 200 యూనిట్ల‌ను ఉచితంగా ఇస్తామ‌ని జీవో లో పేర్కొన్నారు. దీంతో ఇటు ప్ర‌ధాన మీడియాలోను... అటు సోష‌ల్ మీడియాలోనూ .. విమ‌ర్శ‌లు, వ్యంగ్యాస్త్రాలు వ‌చ్చాయి.

అంతేకాదు..ఇత‌ర ఫ‌థ‌కాల అమ‌లుపైనా అప్పుడే చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఖ‌జానా ఖాళీ అంటున్న విజ‌య్‌.. అవేం అమ‌లు చేయ‌గ‌ల‌ర‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ ప్రారంభ‌మైంది. నిజానికి తొలిరోజు ప్ర‌సంగాన్ని విజ‌య్ దంచి కొట్టినా.. ఆ ప్ర‌సంగంలో చేసిన `ఖ‌జానా ఖాళీ`.. `ప‌ది ల‌క్ష‌ల కోట్ల అప్పులు` వంటివి ఉద్దేశ పూర్వ‌కంగానే విజ‌య్ చేసిన ప్ర‌క‌ట‌న‌లుగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకే ప్ర‌చారం చేస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే ఉద్దేశం లేద‌ని మాజీ సీఎం స్టాలిన్ త‌న ఎక్స్ ఖాతాలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. తాము ప‌రిమితికి లోబ‌డి అప్పులు చేశామ‌ని.. ఆసొమ్ముల‌ను వివిధ రూపాల్లో ప్ర‌జ‌ల‌కు పథ‌కాల కింద పంచేశామ‌ని ఆయన తెలిపారు.

విజ‌య్ ఇచ్చిన హామీలు ఇవీ..

+ పార్టీ మేనిఫెస్టోలో విజయ్ ఇచ్చిన హామీలలో 60 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, వివాహానికి 8 గ్రాముల బంగారం (22 క్యారెట్లు, దీని విలువ సుమారు రూ. 1.13 లక్షలు), ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.

+ అంతేకాకుండా, 'తై మామన్ తంగ మోతిరం తిట్టం' (మేనమామ బంగారు ఉంగరం పథకం) కింద తమిళనాడులో పుట్టే ప్రతి బిడ్డకు ప్రభుత్వ ఆశీర్వాదంగా ఒక బంగారు ఉంగరాన్ని, "బేబీ వెల్కమ్ కిట్"ను కూడా అందిస్తామని ఆయన వాగ్దానం చేశారు.

+ పేద వధువులకు బంగారంతో పాటు నాణ్యమైన పట్టు చీర, మహిళలు నడిపే స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

+ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లులు లేదా సంరక్షకులకు ఏటా రూ. 15,000 అందజేయనున్నారు.(ఏపీలో త‌ల్లికి వంద‌నం పథ‌కం మాదిరిగా)

+ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన కె. కామరాజ్ పేరు మీద 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను, అలాగే రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ విశ్వవిద్యాలయం మరియు ఏఐ నగరాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

+ ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పంట రుణాల పూర్తి మాఫీ. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి 50 శాతం మాఫీ హామీ ఇచ్చారు. వరికి క్వింటాల్‌కు రూ. 3,500, చెరకుకు టన్నుకు రూ. 4,500 కనీస మద్దతు ధర ఇస్తామన్నారు.

+ ఐదు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 4,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తామ‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం, నర్సులతో సహా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించడం వంటి అంశాలను పరిశీలిస్తామన్నారు.