Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో మరో సీఎం అభ్యర్థి...కేసీఆర్ సీటుకే ఎసరు ?

బీఆర్ఎస్ అంటేనే ఒక ప్రాంతీయ పార్టీ. దానికి సర్వ సత్తాక నాయకుడు కేసీఆర్. ఆయనతో పాటు అగ్ర నేతలుగా కుమారుడు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావు కొనసాగుతున్నారు.

By:  Satya P   |   15 Sept 2026 1:00 AM IST
బీఆర్ఎస్ లో మరో సీఎం అభ్యర్థి...కేసీఆర్ సీటుకే ఎసరు ?
X

బీఆర్ఎస్ అంటేనే ఒక ప్రాంతీయ పార్టీ. దానికి సర్వ సత్తాక నాయకుడు కేసీఆర్. ఆయనతో పాటు అగ్ర నేతలుగా కుమారుడు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావు కొనసాగుతున్నారు. హరీష్ రావు అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్షాన ఉప నాయకుడు అయితే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ ముగ్గురుతోనే గులాబీ పార్టీ వ్యూహాలు అన్నీ సాగుతాయి. మిగిలిన నాయకులు అంతా ఉన్నా కూడా బీఆర్ఎస్ అంటేనే వీరి చుట్టూనే తిరుగుతుంది. ఇక కేసీఆర్ రెండు సార్లు ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. 2023లో అధికారంలోకి కనుక పార్టీ వస్తే కేటీఆర్ అయ్యేవారు అన్న ప్రచారం ఉంది. అయితే హ్యాట్రిక్ విక్టరీ చేజారింది. 2028లో మళ్లీ బీఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ లేదా కేటీఆర్ లలో ఎవరో ఒకరు సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ లోనే కాదు తెలంగాణా రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇపుడు ఈ రెండు పేర్లూ కాకుండా మరో పేరు సీఎం క్యాండిడేట్ కోసం చర్చకు వస్తోందా అన్నది అయితే ఉందని అంటున్నారు.

సీఎం గా తలసాని :

ఇదిలా ఉంటే సీఎం గా తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగా ఉందా అన్నదే చర్చగా ఉంది. ఇలా ఎందుకు కొత్త ప్రచారం అంటే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా తెలంగాణా భవన్ లో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. అదే సమయంలో సభలో హరీష్ రావు కేటీఆర్ ఉన్నా కూడా వారు ఎమ్మెల్యేలుగానే కనిపించారు. ఈ మాక్ అసెంబ్లీ అంతా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సాగింది. అచ్చం రేవంత్ రెడ్డి హావ భావాలను అనుకరిస్తూ తలసాని మాక్ అసెంబ్లీలో సెటైర్లు పేల్చారు. తనకు నచ్చని వారిని ఎలా తొక్కుతానో కొండా సురేఖ ఇష్యూతో అర్ధమైంది కదా అని ఆయన కామెంట్స్ చేసినది కూడా మాక్ అసెంబ్లీలో రక్తి కట్టించిన ఒక సన్నివేశం. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అసెంబ్లీలో అలజడి సృష్టించి చర్చ జరగనీయకుండా అడ్డుపడిన వారు మాక్ అసెంబ్లీ పేరుతో హంగామా చేస్తున్నారు అని కాంగ్రెస్ మంత్రులు సీనియర్ నేతలు విమర్శించారు.

తలసానికి పదవి ఇవ్వండి ;

ఇక దీని మీద తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి కాస్తా ముందుకు వెళ్ళి తలసానిని ఎలాగూ సీఎం గా బీఆర్ఎస్ నాయకులు అంగీకరించారు కదా అని సెటైర్లు పేల్చారు. అందువల్ల ఆయనకు ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్న కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎటూ అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి తలసానిని ప్రతిపక్ష నాయకుడిని చేసుకోండి అని గులాబీ పార్టీని సలహా ఇచ్చారు. మాక్ అసెంబ్లీలో బీసీ నేతకు సీఎం పదవి ఇవ్వడం కాదని నిజంగా అది చేసి చూపించాలని అన్నట్లుగా మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

కార్నర్ అయిన బీఆర్ఎస్ :

బీసీలు ఎక్కువ మంది ఉన్న తెలంగాణాలో ఇప్పటిదాకా బీసీ సీఎం అయ్యేది అయితే ఎవరూ లేరు అన్నది నిజం. కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ ఉన్నా అగ్ర వర్ణాలే అవుతున్నారు. ఇపుడు తలసానిని బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ అయినా సీఎం గా చేసింది, మరి రేపటి రోజున బీసీలకు పెద్ద పీట వేస్తూ ఆయనకు మంచి అవకాశం ఇస్తుందా అన్న ప్రశ్నను ఒక కొత్త చర్చను పీసీసీ చీఫ్ లేవనెత్తారు. కాంగ్రెస్ లో అయితే ఎంతో మంది బీసీ నేతలు పీసీసీ చీఫ్ లుగా అయిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ స్ మాక్ అసెంబ్లీ కాదు కానీ కాంగ్రెస్ గట్టిగానే కార్నర్ చేస్తోంది. బీసీ సీఎం అన్నది బీఆర్ఎస్ లో డిమాండ్ గా వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే రాజకీయంగా సవాల్ మాత్రం కాంగ్రెస్ చేసింది అని అంటున్నారు. దీని మీద బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ముందు కేసీఆర్ పదవికే ఎసరు పెట్టేలా పీసీసీ చీఫ్ కామెంట్స్ ని ఎలా అర్ధం చేసుకుంటుందో కూడా గమనించాలి.