క్యాంపస్ టు కార్పొరేట్: 'ఆఫర్ లెటర్' నమ్మకాన్ని కోల్పోతున్న నేటి తరం విద్యార్థులు!
ఉన్నత చదువులు చదివే ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం ఏదైనా ఉందంటే... అది కాలేజీ చివరి సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రావడం.
By: Madhu Reddy | 25 Jun 2026 11:12 AM ISTఉన్నత చదువులు చదివే ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం ఏదైనా ఉందంటే... అది కాలేజీ చివరి సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రావడం. చేతిలో 'ఆఫర్ లెటర్' పట్టుకుని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలుగంటారు. కానీ, ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు ఆ నమ్మకాన్ని, సంతోషాన్ని నీరుగారుస్తున్నాయి. కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్ లెటర్లను జాయినింగ్ డేట్ కంటే ముందే అర్ధాంతరంగా రద్దు చేయడం అనే కొత్త ట్రెండ్ నేడు యువతను తీవ్రమైన అభద్రతా భావంలోకి నెట్టేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
లాభాల్లో ఉన్నా... లేఆఫ్స్ ఊచకోత:
ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు మానవ వనరులను తగ్గించుకుంటూ సాగుతుండటంతో దాని తీవ్రత ఇప్పుడు బయట గట్టిగా కనిపిస్తోంది. ఇక దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణే ఐటీ దిగ్గజం 'ఒరాకిల్' వ్యవహారం. మే 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒరాకిల్ సంస్థ ఏకంగా 67 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి, తన హిస్టరీలోనే అత్యంత భారీ లాభాలను నమోదు చేసింది. కానీ ఆశ్చర్యకరంగా, లాభాలు అంతగా వచ్చినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల గడిచిన 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 మంది ఉద్యోగులను ఈ సంస్థ తొలగించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉండటం గమనార్హం.
ఆశల పల్లకీ నుంచి అగాధంలోకి:
కేవలం పాత ఉద్యోగులను తీసేయడమే కాదు, భారతదేశంలోని పలు టాప్ కాలేజీల్లో విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను సైతం ఒరాకిల్ రద్దు చేస్తోంది. ఇది కొత్త ఉద్యోగాల సృష్టిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకప్పుడు ఆఫర్ లెటర్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే అనుకుని చాలా మంది విద్యార్థులు వేరే కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్ళడం మానేసేవారు. తీరా డిగ్రీ పూర్తి చేసుకుని ఆఫీస్‌లో అడుగుపెట్టే సమయానికి, "మార్కెట్ పరిస్థితుల వల్ల మీ ఆఫర్‌ను రద్దు చేస్తున్నాం" అంటూ కంపెనీల నుండి వచ్చే ఒకే ఒక్క ఈమెయిల్ వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక ఇది యువత మానసికంగా కుంగిపోవడానికి, యాంగ్జైటీకి గురికావడానికి కారణమవుతోంది.
మారిన కార్పొరేట్ సమీకరణాలు:
ఆధునిక వ్యాపార ప్రపంచంలో సాంకేతిక మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. AI మరియు అంతర్గత ఆటోమేషన్ లేదా వ్యూహాత్మక మార్పుల వల్ల కంపెనీలు కొత్త రిక్రూట్‌మెంట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. ఇక లాభాల్లో ఉన్న సంస్థలు కూడా భవిష్యత్తు అంచనాలను బేరీజు వేసుకుంటూ 'ఫ్రెషర్స్' సంఖ్యను నియంత్రిస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా విద్యాసంస్థలు మరియు విద్యార్థులపై పడుతోంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు కేవలం ఒకే ఒక్క ఆఫర్ లెటర్ నమ్ముకుని రిలాక్స్ అయిపోయే రోజులు పోయాయి.
ఉపాధి మార్కెట్‌లో వస్తున్న ఈ ఆకస్మిక మార్పులు విద్యార్థులకు ఒక పెద్ద హెచ్చరిక లాంటివి. ఆఫర్ లెటర్ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కానీ జీవితం కాదు. కార్పొరేట్ సంస్థల నిర్ణయాలు ఎలా ఉన్నా, టెక్నాలజీ ఎంతగా మారినా... తమ స్వయం శక్తినే పెట్టుబడిగా మార్చుకుని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా యువత తమ మైండ్‌సెట్‌ను రీ-డిజైన్ చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన సమయం ఆసన్నమైంది అంటున్నారు నిపుణులు.
