Begin typing your search above and press return to search.

అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కొత్త కష్టాలు?

అమెరికాలో విదేశీయుల వీసా, ఉద్యోగ సంబంధిత నిబంధనలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో మరో పెద్ద నిర్ణయం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   13 Nov 2025 5:00 PM IST
అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కొత్త కష్టాలు?
X

అమెరికాలో విదేశీయుల వీసా, ఉద్యోగ సంబంధిత నిబంధనలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో మరో పెద్ద నిర్ణయం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియా రాష్ట్రం కమర్షియల్ వాహనాలు నడిపే ప్రవాస డ్రైవర్లకు జారీ చేసిన సుమారు 17,000 లైసెన్స్‌లను రద్దు చేయాలని పరిశీలిస్తోంది. సెమీ-ట్రక్‌లు, బస్సులు వంటి భారీ వాహనాలను నడిపే డ్రైవర్లకు ఈ కమర్షియల్ లైసెన్స్‌లు (CDL) అత్యంత కీలకం.

* కాలిఫోర్నియా చర్యకు కారణాలు: వలస సమస్య కాదు, గడువు ముగింపు!

ట్రంప్ ప్రభుత్వం కాలిఫోర్నియాపై అక్రమ వలసలకు అడ్డాగా మారుస్తోందని ఆరోపణలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర గవర్నర్ గవిన్‌ న్యూసమ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ఈ లైసెన్స్‌ల రద్దు సన్నాహాలకు వలస సమస్య కారణం కాదని, ప్రధానంగా లైసెన్స్‌ల గడువు ముగియడమే కారణమని వెల్లడించారు. అధికారుల సమగ్ర పరిశీలనలో అనేక కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు చెల్లుబాటు కాలక్రమాన్ని దాటినట్లు తేలింది. దీంతో రాష్ట్ర రవాణా విభాగం (DMV) వాటిపై లోతైన సమీక్షను ప్రారంభించింది.

* జాతీయస్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్‌ల ఆడిట్: ప్రమాదాల నేపథ్యంలో సమీక్ష

గత కొద్ది నెలలుగా అమెరికాలో జరిగిన పలు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు కమర్షియల్ డ్రైవర్ల అర్హతలు, లైసెన్స్ జారీ విధానాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తాయి. ఫ్లోరిడాలో యూటర్న్‌ తప్పిదం కారణంగా ముగ్గురు మరణించడం, టెక్సాస్‌, అలబామాలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఇలాంటి సంఘటనలు, కాలిఫోర్నియాలో ఓ ప్రవాస డ్రైవర్ మద్యం మత్తులో చేసిన ఘోర ప్రమాదం... ఈ ఘటనల పరంపర కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ డ్రైవర్ల నైపుణ్యాలు .. లైసెన్స్ జారీ విధానంపై జాతీయస్థాయిలో ఆడిట్ ప్రారంభమైంది.

* అమెరికా రవాణా శాఖ విమర్శలు, ట్రంప్ ప్రభుత్వ ఆందోళన

గతంలో తమ లైసెన్స్ జారీ విధానాలు సరైనవేనని వాదించిన కాలిఫోర్నియా… ఇప్పుడు పెద్ద సంఖ్యలో లైసెన్స్‌ల రద్దుకు సిద్ధపడటం, తమ వైఫల్యాలను పరోక్షంగా అంగీకరించడమే అని అమెరికా రవాణా శాఖ మంత్రి విమర్శించారు. మరోవైపు ఆగస్టులోనే ట్రంప్ ప్రభుత్వం కమర్షియల్ ట్రక్కులు నడిపే విదేశీయులపై ఆంక్షలు పెంచాలని సంకేతాలిచ్చింది. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ "అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీయుల సంఖ్య పెరుగుతోంది. వీరి నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలకు ప్రమాదకరం. అంతేకాక, అమెరికన్ ట్రక్కర్ల ఉద్యోగాలకు కూడా ముప్పు" అని వ్యాఖ్యానించారు.

* భవిష్యత్తులో తప్పనిసరి కానున్న నిబంధనలు

ప్రమాదాలు పెరగడానికి రోడ్డు సూచికలు అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక కారణమని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడుతోంది. భవిష్యత్తులో విదేశీ డ్రైవర్లు తప్పనిసరిగా అనుసరించాల్సిన నిబంధనల్లో ఇవి ముఖ్యమైనవి.. డ్రైవర్లు ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి... వర్కర్ వీసాల జారీపై కూడా మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.

*భారతీయ డ్రైవర్లకు ఆందోళన

కాలిఫోర్నియాలో భారీ ఎత్తున కమర్షియల్ లైసెన్స్‌ల రద్దు నిర్ణయం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ప్రవాస డ్రైవర్లు సహా అనేక మందికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో జాతీయ ఆడిట్ నివేదికలు.. ట్రంప్ ప్రభుత్వ విధానాలు విదేశీ డ్రైవర్ల భవిష్యత్తును, వారి ఉద్యోగ భద్రతను నిర్ణయించనున్నాయి.