కలకత్తా హైకోర్టు తీర్పు... తెలంగాణ `జంపింగు`లకు లింకు!
ఇదిలావుంటే.. కలకత్తా హైకోర్టు గురువారం వెలువరించిన ఈ తీర్పును తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ జోరుగా వైరల్ చేయడం గమనార్హం.
By: Garuda Media | 14 Nov 2025 2:30 PM ISTకార్యాకారణ సంబంధం ఉన్నట్టుగా.. పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా హైకోర్టు తాజాగా ఇచ్చిన ఓ సంచలన తీర్పు తెలంగాణలోని జంపింగ్ ఎమ్మెల్యేలకు కూడా లింకు ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. అక్కడ హైకోర్టు తాజాగా ఓ ఎమ్మెల్యేపై అనర్హత వేటువేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్(2021 ఎన్నిక్లలో బెంగాల్‌లోని కృష్ణనగర్ నార్త్ నుంచి గెలిచారు).. తర్వాత అధికార పార్టీ టీఎంసీలోకి దూకారు.
అప్పటి నుంచి ఆయనపై వేటు వేయాలని బీజేపీ పోరాటం చేస్తూనే ఉంది. అయితే.. అసెంబ్లీ స్పీకర్ ఈ విషయాన్ని విచారణ పేరుతో నాన్చుతూ వచ్చారన్న వాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా సుదీర్ఘ విచారణ అనంతరం కలకత్తా హైకోర్టు ముకుల్ రాయ్‌ను అనర్హుడిగా పేర్కొంటూ.. తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం.. ఆయన ఆరు సంవత్సరాల పాటు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇదిలావుంటే.. కలకత్తా హైకోర్టు గురువారం వెలువరించిన ఈ తీర్పును తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ జోరుగా వైరల్ చేయడం గమనార్హం. ఎందుకంటే.. గత 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి విజ యం దక్కించుకున్న 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే .. దీనిని సీరియస్గా తీసుకున్న బీఆర్ ఎస్ వారిపై వేటు వేయాలని పట్టుబడుతోంది. కానీ.. విచారణలు.. పరిధుల పేరుతో ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోలేదని బీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు.
ఈ పరిస్తితిలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ ఎస్ నాయకులు ఉటంకిస్తూ.. న్యాయ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పులను పరిగణన లోకి తీసుకునే సంప్రదాయంతోపాటు.. విషయం అక్కడా-ఇక్కడా ఒక్కటే కావడంతో బీఆర్ ఎస్ నాయకు లు ఈ విషయాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లొచ్చని తెలుస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారమే.. కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దానిని ఇక్కడ కూడా అమలు చేయాలన్న డిమాండ్‌ను కూడా బీఆర్ ఎస్ అందుకునేందుకు అవకాశం ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ప్రస్తుతం స్పీకర్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. కలకత్తా హైకోర్టు తీర్పుపై అనేక సందేహాలు ఉన్నాయి. ఒక శాసన సభ్యుడికి సంబంధించిన నిర్ణయాన్ని అసెంబ్లీ స్పీకరే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు మహారాష్ట్ర విషయంలో తీర్పు చెప్పింది. అంటే.. కోర్టులు కేవలం సూచనలు, సలహాలు, సమయం పెట్టడం వరకే పరిమితం కావాలి. మరి కలకత్తా హైకోర్టు తీర్పు ఏమేరకు నిలుస్తుందన్నది కూడా సందేహాలకు తావిస్తోంది.
