Begin typing your search above and press return to search.

గెట్ రెడీ.. రేపు కేంద్రం నుంచి కీలక ప్రకటన?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   12 May 2026 6:26 PM IST
గెట్ రెడీ.. రేపు కేంద్రం నుంచి కీలక ప్రకటన?
X

కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకటన పెట్రో ధరల పెంపునకు సంబంధించినదా? లేక ఇంకేమైనా ఉంటుందా? అనే చర్చ ఎక్కువగా సాగుతోంది. గల్ఫ్ లో యుద్ధ వాతావరణం ఇంకా సర్దుమణకపోవడం, అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొనడంపై ప్రధాని మోదీ గత రెండు రోజులుగా పొదుపు చర్యలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి సంచలన ప్రకటనలు చేశారు. ఆ రెండు సందర్భాల్లో ప్రధాని ప్రకటన తర్వాత దేశం తీవ్ర ఒడిదుడుకులకు లోనైనట్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా చమురు సంక్షోభం నివారించే విషయంలో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో కేబినెట్ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయమై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో మరింత ఆందోళన పెరుగుతోందని అంటున్నారు.

గత రెండు రోజులుగా ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గ సహచరులు పొదుపు చర్యలపై వరుస ప్రకటనలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెల వాడకాన్ని తగ్గించాలని ప్రజలను కోరుతున్నారు. ఐటీతోపాటు అవకాశం ఉన్న ఇతర రంగాల వారు వర్క్ ఫ్రం హోంకి మారాలని సూచిస్తున్నారు. అదేవిధంగా బంగారం కొనుగోలు ఆలోచనను కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆందోళన ఎక్కువవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో పెట్రోల్ ధరల పెంపు ఉంటుందని జరుగుతున్న ప్రచారం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోందని చెబుతున్నారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై కనీసం రూ.5 పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అదేవిధంగా వంట గ్యాస్ సిలెండర్ ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 15లోగా పెంపు ప్రకటన వస్తుందని జాతీయ మీడియా చెబుతున్న నేపథ్యంలో బుధవారం కేబినెట్ సమావేశం కానుండటం, ఈ సమావేశంలో ధరల పెంపుపై చర్చ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.