Begin typing your search above and press return to search.

బైజూస్‌ రవీంద్రన్‌కు 1 బిలియన్‌ డాలర్ల ఫైన్.. భారత ఎడ్‌టెక్‌ రంగానికి పాఠం

విద్యా సాంకేతిక రంగంలో ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన భారతీయ సంస్థ బైజూస్‌ మళ్లీ వార్తల్లో నిలిచింది..

By:  A.N.Kumar   |   22 Nov 2025 10:04 PM IST
బైజూస్‌ రవీంద్రన్‌కు 1 బిలియన్‌ డాలర్ల ఫైన్.. భారత ఎడ్‌టెక్‌ రంగానికి పాఠం
X

విద్యా సాంకేతిక రంగంలో ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన భారతీయ సంస్థ బైజూస్‌ మళ్లీ వార్తల్లో నిలిచింది.. అమెరికా డెలావేర్‌ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ సంస్థ వ్యవస్థాపకుడు బైజూస్‌ రవీంద్రన్‌కు తీవ్ర ఆర్థిక, న్యాయపరమైన దెబ్బగా మారింది.

1 బిలియన్ డాలర్ల చెల్లింపుకు కోర్టు ఆదేశం

అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్‌ట్రస్ట్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన డెలావేర్‌ దివాలా పరిష్కార కోర్టు, నవంబర్‌ 20, 2025న డిఫాల్ట్‌ తీర్పు ఇచ్చింది.ఈ తీర్పు ప్రకారం, బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ వ్యక్తిగతంగా 1 బిలియన్ డాలర్లు (సుమారు ₹8,400 కోట్లు) చెల్లించాలని సూచించింది.

'బైజూస్‌ ఆల్ఫా' – అప్పుల మూలం

2021లో బైజూస్‌ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లలో నిధులు సమీకరించడానికి ‘బైజూస్‌ ఆల్ఫా’ పేరుతో అమెరికాలో ఓ ప్రత్యేక యూనిట్‌ను స్థాపించింది. ఈ యూనిట్‌ ద్వారా సంస్థ టర్మ్‌ లోన్‌-B రూపంలో 1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకుంది. అయితే రుణ దాతలు ఈ నిధుల వినియోగం, లావాదేవీల పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు.

కోర్టులో అవినీతి, ఉల్లంఘనల ఆరోపణలు

రుణదాతల ప్రధాన ఆరోపణల ప్రకారం..బైజూస్‌ ఆల్ఫా రుణ నిబంధనలను ఉల్లంఘించింది. సంస్థ సుమారు $533 మిలియన్‌ డాలర్లు అమెరికా వెలుపలకి చట్టవిరుద్ధంగా తరలించింది. ఆ లావాదేవీలపై వివరాలు ఇవ్వకూ తప్పించుకుంది. దీని నేపథ్యంలో గ్లాస్‌ట్రస్ట్‌ కోర్టును ఆశ్రయించగా, కోర్టు బైజూస్‌ ఆల్ఫా ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బైజూస్‌ రవీంద్రన్‌కు డిస్కవరీ ఆదేశాలు ఉన్న విషయం తెలిసినా, ఆయన కోర్టుకు కావాల్సిన ఆర్థిక వివరాలు సమర్పించలేదని, “సహకరించని ధోరణి”తో వ్యవహరించాడని కోర్టు గమనించింది. ఈ కారణాలతోనే చివరికి కోర్టు డిఫాల్ట్‌ జడ్జిమెంట్‌ ఇచ్చి, వ్యక్తిగతంగా 1 బిలియన్ డాలర్ల బాధ్యతను రవీంద్రన్‌పైనే మోపింది.

తీర్పులో పేర్కొన్న మొత్తం వివరాలు

టర్మ్‌ లోన్‌-B కింద రుణంగా తీసుకున్న మొత్తం: $533 మిలియన్‌ లు. క్యామ్‌షాఫ్ట్‌ హెడ్జ్‌ ఫండ్‌ ఇంట్రెస్ట్‌ కింద అదనపు మొత్తం $540.6 మిలియన్‌ మొత్తం కలిపి సుమారు $1.07 బిలియన్‌ డాలర్లు బకాయి పెరిగింది.

బైజూస్‌ స్పందన: మాకు వాదనకు అవకాశం ఇవ్వలేదు

తీర్పుపై స్పందించిన బైజూస్‌ ప్రతినిధులు, కోర్టు తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. “మేము ఈ తీర్పుపై అప్పీల్‌ దాఖలు చేస్తాం” అని బైజూస్‌ లీగల్‌ టీమ్‌ స్పష్టం చేసింది. ఈ అంతర్జాతీయ సమస్య పరిష్కారానికి కంపెనీ కొత్త చట్టపరమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తుందనే సమాచారం కూడా వస్తోంది.

ఆర్థిక ఒత్తిడిలో బైజూస్‌

గత రెండు సంవత్సరాలుగా బైజూస్‌ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉంది,వేలాది ఉద్యోగులను తొలగించడం, వ్యాపార విభాగాల పునర్వ్యవస్థీకరణ, పెట్టుబడిదారుల నమ్మకానికి భారీ దెబ్బ.. ఇవన్నీ సంస్థను బలహీన పరుస్తున్నాయి. 2020ల ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్‌ స్టార్ట్‌ప్‌గా నిలిచిన బైజూస్‌ ఇప్పుడు బతుకు పోరాటంలో పడింది.

భారత ఎడ్‌టెక్‌ రంగానికి పాఠం

ఈ తీర్పు కేవలం బైజూస్‌కే కాదు, భారత ఎడ్‌టెక్‌ రంగానికి కూడా ఒక హెచ్చరికగా మారింది. విద్యా సాంకేతిక సంస్థలు పెద్ద మొత్తంలో అంతర్జాతీయ నిధులను సమీకరిస్తున్న సమయంలో పారదర్శకత, చట్టపరమైన అనుసరణల ప్రాముఖ్యత ఈ కేసు ద్వారా స్పష్టమవుతోంది.