మూడేళ్ల ముందే టికెట్ల వేట.. వైసీపీలో రచ్చ రచ్చ.. !
తాజాగా జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసిపి విభేదాలు రచ్చగా మారాయి.
By: Garuda Media | 17 Dec 2025 7:00 PM ISTఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసిపి రాజకీయాలు తీవ్రస్థాయిలో విభేదాల మధ్య కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక మరోవైపు యువ నాయకుడు రాజీవ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారు బల ప్రదర్శనలు చేయడం, పార్టీ లైనుకు భిన్నంగా వ్యవహరించడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసిపి విభేదాలు రచ్చగా మారాయి.
బుట్టా రేణుక వర్గం ఒకరకంగా, రాజీవ్ రెడ్డి వర్గం మరోరకంగా వ్యవహరించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. వాస్తవానికి అందరూ కలిసి కలివిడిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వైసిపి అధినేత జగన్ భావించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలోనూ చెప్పుకొచ్చారు. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. ఎమ్మిగనూరులో మాత్రం బుట్టా రేణుక వర్సెస్ రాజీవ్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.
బలమైన రెడ్డి సామాజిక వర్గం అంతా తనవైపే ఉందని రాజీవ్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా జగన్ చెప్పిందే తాను చేస్తున్నానని బుట్టా రేణుక వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే స్థానికంగా వీరిద్దరూ విభేదాలు పెట్టుకొని పార్టీలో చీలికలు తీసుకువచ్చి ఒక రకంగా పార్టీని ఇబ్బందికర పరిణామాల దిశగా నడిపిస్తున్నారు అన్నది స్థానిక నాయకులు చెబుతున్న మాట. ఎవరి పక్షాన మాట్లాడితే ఎవరికీ కోపం వస్తుందో అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఇరువర్గాలు ఆర్థికంగా బలంగా ఉండడం, ఇరువర్గాలు ప్రజలకు చెరువ అవుతుండడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి పార్టీ అధిష్టానానికి కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం ఇదే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఎమ్మిగనూరు రాజకీయాలు వైసీపీకి ఇరకాటంగా మారాయి. వర్గ విభేదాలు, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి వారుగా వెళ్లడం ఎవరికి వారిగా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఏ మేరకు లాభిస్తాయి, ఏ మేరకు పార్టీ అధిష్టానం వీరికి అవకాశం కల్పిస్తుంది అనేది చూడాలి. మొత్తంగా ఎన్నికలకు మూడేళ్ల ముందే ఇలా పెద్ద ఎత్తున వివాదాలకు దిగడం అనేది సరికాదు అన్నది సీనియర్లు చెబుతున్న మాట.
