Begin typing your search above and press return to search.

ఓడినప్పుడల్లా చంద్రబాబుపై ఏడుపేనా? కేసీఆర్ పై ఎమ్మెల్యే గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య,చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

By:  Tupaki Political Desk   |   31 Dec 2025 5:07 PM IST
ఓడినప్పుడల్లా చంద్రబాబుపై ఏడుపేనా? కేసీఆర్ పై ఎమ్మెల్యే గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు
X

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య,చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయనను బనకచర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మండిపడ్డారు. రాజకీయాల్లో కేసీఆర్ తమ కంటే చాలా జూనియర్ అని, మంత్రి పదవి రాలేదని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన కేసీఆర్.. ఎప్పుడూ చంద్రబాబుపై పడి ఏడుస్తుంటారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేతపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి.

‘‘కేసీఆర్ ఎక్కడ పెరిగాడు? మా అందరి కంటే జూనియర్, తెలుగుదేశంలోనే పెరిగాడు. మంత్రి పదవి లేదని ఉద్యమాలు చేశాడు. అప్పుడు విజయరామారావుకు మంత్రి ఇచ్చారని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పై విచారణలు జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టులు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుంది. వాటి వల్ల ఏడలేక మద్దల ఓడు అన్నట్లు చంద్రబాబుపై పడి ఏడుస్తున్నారు ఏంటయ్యా? ఎస్.. దిగువ రాష్ట్రంగా గోదావరి జలాలను వాడుకుంటే తప్పేంటి? సముద్రంలో వృథాగా కలుస్తున్న జలాలను వాడుకుంటే తప్పేంటి?’’అంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవరైనా అడిగారా? అంటూ నిలదీశారు. నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని తెలంగాణలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, తమకు ఏం సంబంధం అంటూ వ్యాఖ్యానించారు. గోదావరిలో 3 వేల టీఎంసీలు వృథాగా పోతుంటే, 200 టీఎంసీలు వాడుకుంటే తప్పేంటో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ కలిసి రాలేదని ధ్వజమెత్తారు.

అదే సమయంలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపైనా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోమని తాను గతంలో వారికి చెప్పానని, కానీ వారు వినిపించుకోలేదన్నారు. పెద్దరికంతో చెప్పానని నోరు అదుపులో పెట్టుకోమని పేర్ని నాని, కన్నబాబుకు కూడా చెప్పానని, వారంతా వినక చెడ్డారన్నారు. దోషులు, పాపాలు చేసేవారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. వైసీపీ కూడా కత్తులతో నరకండి చంపండి అంటూ పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.