Begin typing your search above and press return to search.

జైహింద్ అనని మహిళా ఐపీఎస్.. సస్పెన్షన్ వేటు?

బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వారు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి.

By:  Garuda Media   |   15 Sept 2026 3:44 PM IST
జైహింద్ అనని మహిళా ఐపీఎస్.. సస్పెన్షన్ వేటు?
X

బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వారు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. ఆ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. అందునా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు.. వీడియోలు అప్ లోడ్ చేసేటప్పుడు అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. నాకు నచ్చిందే చేస్తాను.. ఎవరేం అనుకుంటే నాకేం ఫర్లేదన్నట్లుగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కోవకు చెందిందే.

సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోలో జైహింద్ అనని కారణంగా ఒక మహిళా ఐపీఎస్ పై చర్యలు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమబెంగాల్ క్యాడర్ కు చెందిన ఈ మహిళా ఐపీఎస్.. జైహింద్ అనలేదా? అయినా.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసే వీడియోలో జైహింద్.. వందేమాతరం లాంటి పదాల్ని వినియోగించాల్సిన అవసరం లేదు కదా? అంటే.. అవుననే చెప్పాలి. మరి.. అలాంటప్పుడు ఐపీఎస్ పై చర్యలు ఎందుకు? అంటూ.. విషయాన్ని మొదట్నించి తెలుసుకుంటే.. అసలేం జరిగిందో అర్థమవుతుంది. అదే సమయంలో ఆమె చేసిన తప్పేమిటో తెలుస్తుంది.

పశ్చిమ బెంగాల్ లో ఐపీఎస్ గా పని చేస్తున్నారు బుష్రా బానో. 2021 బ్యాచ్ కు చెందిన ఆమె ఖరగ్ పూర్ అదనపు ఎస్పీగా పని చేస్తున్నారు. అయితే.. ఆమెను సోమవారం రాష్ట్ర సాయుధ పోలీసు దళం డిప్యూటీ కమాండెంట్ కు బదిలీ చేశారు. అయితే.. ఆమెపై వచ్చిన ఫిర్యాదుతోనే ఆగమేఘాల మీద ఈ చర్య తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకు ఇలాంటి పరిస్థితికి కారణంలోకి వెళితే.. సెప్టెంబరు 13న యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఆమె ఒక వీడియోను అప్ లోడ్ చేశారు.

అందులో తాను సివిల్ సర్వీసెస్ కు ఎలా సిద్దమయ్యానో వివరించారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీలో రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ తన సివిల్స్ ప్రిపరేషన్ లో ఎంతో సాయం చేసిందని.. తనకు అవసరమైన స్టడీ మెటీరియల్.. తదితరాలు తనకు సాయంగా నిలిచాయని చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా.. వీడియో ఆరంభంలో అస్సలామువాలైకుమ్ మధ్యలో ఇన్ షా అల్లా.. చివర్లో జజాకల్లా లాంటి పదాలు ఉపయోగించటం విమర్శలకు ప్రధాన కారణం. ఆమె వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మత సంబంధమైన పదాల్ని వినియోగించిన ఆమె.. జైహింద్.. వందేమాతరం లాంటి పదాల్ని ఎందుకు వాడలేదన్న ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతంపై హిందూ లీగల్ ఫండ్ అనే సంస్థ బెంగాల్ హోం సెక్రటరీకి కంప్లైంట్ చేయటం.. ఈ ఉదంతంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరటంతో.. తాజా వేటుకు కారణంగా చెబుతున్నారు. ఈ సంస్థ వాదన ఏమంటే.. భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే సర్వీసింగ్ అధికారి న్యూట్రల్ గా ఉండాలే తప్పించి.. ఇతర అంశాల్ని ప్రస్తావించకూడదని వారి వాదన.

ఇదిలా ఉండగా బుష్రా బానో లైఫ్ జర్నీని ప్రత్యేకంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. యూపీలోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్ ముస్లిం వర్సిటీలో మేనేజ్ మెంట్ స్టడీస్ లో పీహెచ్ డీ చేయటమే కాదు.. నెట్ లోనూ అర్హత సాధించారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో భాగంగా కొంతకాలం సౌదీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసి.. తిరిగి భారత్ కు వచ్చి సివిల్స్ ను సాధించారు. 2018లో 277 ర్యాంక్.. 2019లో 234 ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. బెంగాల్ క్యాడర్ ను ఆమె కోరుకున్నారు. తాజాగా వీడియో ఆమెపై చర్యలకు కారణంగా చెబుతున్నారు.