బుద్ధా వెంకన్న యాక్టివ్: విజయవాడ రాజకీయాలు సెగలే.. !
విజయవాడకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మళ్లీ లైన్ లోకి వచ్చారు.
By: Garuda Media | 6 Oct 2025 11:40 PM ISTవిజయవాడకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మళ్లీ లైన్ లోకి వచ్చారు. గత ఆరేడు నెలలుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడా స్పందించడం లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. దీంతో ఇక టిడిపి నుంచి ఆయన సెలవు తీసుకుంటున్నారు అన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది. వాస్తవానికి వైసీపీ హయాంలో బలమైన గళం వినిపించారు. అదేవిధంగా జగన్‌ను, సజ్జల రామకృష్ణారెడ్డిని అప్పటి రాజ్యసభ సభ్యుడు అప్పటి వైసిపి నాయకుడు విజయసాయి రెడ్డిని కూడా బలంగా ఎదుర్కొన్న నాయకుడుగా బుద్దా వెంకన్నకు పేరు ఉంది.
ఇక సీఎం చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కూడా బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విజయవాడలో నిరసనలు వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. దీనిని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలుస్తామని కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా బుద్ధ వెంకన్న కీలక పాత్ర పోషించారు. కానీ, ఎన్నికల సమయానికి వచ్చేసరికి తనకు టికెట్ విషయంలో చేసిన యాగీ ఆయనను మైనస్ చేసిందనే వాదన ఉంది.
ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు స్థానం, అలాగే విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం విషయంలో వెంకన్న పట్టుబట్టారన్నది అందరికీ తెలిసిందే. ఈ రెండు స్థానాలు కూడా టిడిపికి కాకుండా బిజెపికి కేటాయించారు. దీంతో ఆయన అలిగి ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఇక ఆ పరిణామాల తర్వాత కొన్నాళ్లు యాక్టివ్గానే కనిపించినప్పటికీ పార్టీ వైపు నుంచి ఆయనకు సహకారం లభించకపోవడంతో బుద్దా వెంకన్న మౌనం వహించారు. ఇంటికి పరిమితమయ్యారు. కానీ, తాజాగా దసరా సందర్భంగా సీఎం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో బుద్దా వెంకన్న ఆశాంతం పాల్గొనడం పార్టీలో మరోసారి ఆయన యాక్టివ్ అవుతున్నారని చెప్పడానికి నిదర్శనంగా మారిందని అంటున్నారు.
వచ్చే ఏడాది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆయనకు ఇచ్చే అవకాశం ఉండి ఉంటుందని అందుకే బుద్ధ వెంకన్నను స్వయంగా సీఎం చంద్రబాబు ఆహ్వానించి ఉంటారన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ ఇప్పటివరకు మౌనంగా ఉన్న బుద్ధా వెంకన్న తిరిగి యాక్టివ్ అయితే మాత్రం విజయవాడలో టిడిపి రాజకీయాలు జోరుగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో బుద్ధా వంటి బలమైన నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందన్నది వాస్తవం.
