127 ఏళ్లకు మన నుంచి తీసుకెళ్లిన బుద్ధుని అవశేషాలు భారత్ కు
ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం ద్వారా ఈ విషయం అందరికి తెలిసింది.
By: Garuda Media | 31 July 2025 9:40 AM ISTవందల ఏళ్లు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు మనకు చెందిన విలువైన ఆస్తుల్ని ఎన్నింటినో కొల్లగొట్టారు. వెల కట్టలేని కోహినూర్ వజ్రం.. నెమలి సింహానం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటిల్లో కొన్ని మూల్యం చెప్పే వీలుంటే.. మరికొన్నింటి విలువ అమూల్యం. ఆకోవలోకే చెందుతాయి బుద్ధుని అవశేషాలు. దాదాపు 127 ఏళ్ల తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాల్ని తాజాగా భారత్ కు తిరిగి ఇచ్చేస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవటం.. తాజాగా ఆ అవశేషాలు భారత్ కు వచ్చేయటం తెలిసిందే.
ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం ద్వారా ఈ విషయం అందరికి తెలిసింది. శతాబ్దం తర్వాత బుద్ధుని అవశేషాలు స్వదేశానికి తిరిగి రావటం నిజంగా దేశ సంస్క్రాతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. 1898లో యూపీలోని పిస్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు ముమ్మరంగా సాగాయి. ఆ తవ్వకాల్లోనే బుద్ధుని పవిత్ర అవశేషాలు బయటపడ్డాయి.వాటిని నాటి బ్రిటన్ పాలకులు భారత్ నుంచి యూకేకు తరలించారు.
ఈ అవశేషాలు ఈ ఏడాది ప్రారంభంలో ఒక అంతర్జాతీయ సంస్థ చేపట్టిన వేలంపాటలో తొలిసారి బయటకు వచ్చాయి.వీటిని ఎలా అయినా భారత్ కు రప్పించేందుకు మోడీ సర్కారు ప్రయత్నించింది. అందులో విజయం సాధించి.. తాజాగా భారత్ కు బుద్ధుని పవిత్ర అవశేషాలు భారత్ కు చేరుకున్నాయి. ఈ ప్రయత్నంలో సహకారం అందించిన వారందరికి ప్రధానమంత్రి మోడీ థ్యాంక్స్ చెప్పారు.
బుద్ధుని నిర్యాణం తర్వాత ఆయన అవశేషాల్ని అనాటి రాజ్యాల రాజులు పంపిణీ చేసేందుకు కొన్ని భాగాలుగా విభజించారు. అందులో కొంత భాగాన్ని నేటి థాయిలాండ్ లోని సియామ్ ప్రాంతంలోని రాజుకు అప్పజెప్పారు. అప్పట్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన సున్నపురాయి మ్రతపేటిక ప్రస్తుతం కోల్ కతాలోని ఇండియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇంతకూ అవశేషాలు బయటపడిన పిస్రాహ్వా గ్రామం యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లా కేంద్రంలో ఉంది. ఇది బుద్ధుడు పుట్టిన లుంబినీకి కేవలం తొమ్మిది మైళ్ల దూరంలో ఉంటుంది.నేపాల్ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతంలోనే అప్పటి బ్రిటీష్ పాలకులు తవ్వకాలు జరిపి.. పవిత్రమైన అవశేషాలతో పాటు.. బంగారు ఆభరణాలు.. రత్నాలు లాంటివి వెలికితీశారు.
