బెజవాడ పాలిటిక్స్: బుద్దాకు సరిజోడీ ఉన్నారా.. ?
బెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఇటీవల సీఎం చంద్రబాబు నామినేట్ చేశారు.
By: Garuda Media | 13 Aug 2026 1:07 PM ISTబెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఇటీవల సీఎం చంద్రబాబు నామినేట్ చేశారు. ఆయన బాధ్యత స్వీకార ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. దీనిని బట్టి..వచ్చే ఎన్నికలకు ఆయనను రెడీ చేస్తున్నారా? అనే సందేహాలు, చర్చ కూడా తెరమీదికి వచ్చాయి. కానీ, అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. నియోజక వర్గంలో బాధ్యత వేరు.. టికెట్ వేరన్నది గత ఎన్నికల్లోనూ స్పష్టమైంది.
ఇక, తాజాగా బుద్ధాకు ఈ పదవి ఇవ్వడం వెనుక.. కీలక వ్యూహమే ఉందని అంటున్నారు. త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలకమైన పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్పొరేషన్‌లో తమ సత్తా చాటుకునేందుకు బలమైన వాయిస్ ఉన్న నాయకుడి అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలోనే బుద్దాకు పదవి ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు.. వైసీపీ తరఫున ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్, పోతిన వెంకట మహేష్ వంటివారు కార్పొరేషన్‌పై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
దీనికి చెక్ పెట్టడంతోపాటు బెజవాడలో టీడీపీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కూడా.. టీడీపీ అడుగులు వేసిం ది. ఈ క్రమంలోనే బుద్ధాకు నియోజకవర్గాన్నిఅప్పగించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇటు పశ్చిమలో అయినా.. అటు తూర్పులో అయినా.. బుద్దా కు తిరుగున్న నాయకుడు పెద్దగాలేరనే చెప్పాలి. పక్కా మాస్ ఇమేజ్‌తో పాటు.. స్పాంటేనియస్ పాలిటిక్స్ చేయడంలో బుద్ధా తనకు తానే సాటి అనగల స్థాయిలో ఉన్నారు. పైగా ఈ తరహా వాయిస్ ఉన్న నాయకుడు వైసీపీలో కనిపించడం లేదు.
అదే సమయంలో జగన్ సహా.. సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారిపై బలమైన దూకుడుగా వ్యవహరించే బుద్ధాను ప్రోత్సహించే క్రమంలోనే టీడీపీ ఇప్పుడు ఆయన కు పదవిని ఇచ్చింది. తద్వారా రెండు రకాలుగా బుద్ధా ఇప్పుడు పార్టీ కి దన్నుగా నిలవనున్నారు. వైసీపీ కి చెక్ పెట్టడం ఒక పార్ట్ అయితే.. అదే సమయంలో టీడీపీని బలోపేతం చేయడం.. బీసీ సామాజిక వర్గాన్ని మరింత చేరువ చేయడం.. తద్వారా కార్పొరేషన్‌లో పాగా వేయడం అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. బుద్దాకు సాటిరాగల నాయకులు లేకపోవడం.. వైసీపీకి పెద్ద మైనస్‌గా మారింది.
