Begin typing your search above and press return to search.

మల్లారెడ్డికి రక్తంతో లేఖ.. తీవ్ర కలకలం

కాగా ఈ రక్తపు లేఖ ఘటనతో బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నేతలు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

By:  A.N.Kumar   |   22 July 2026 9:04 PM IST
మల్లారెడ్డికి రక్తంతో లేఖ.. తీవ్ర కలకలం
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ పార్టీ కార్యకర్త తన సొంత రక్తంతో లేఖ రాయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో.. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ పట్ల తనకున్న ఆవేదనను వ్యక్తం చేస్తూ సదరు కార్యకర్త రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది.

లేఖలో కార్యకర్త ఆవేదన.. ఆరోపణలు

పార్టీ కోసం రక్తం చిందించే కార్యకర్తలను విస్మరిస్తున్నారంటూ సదరు కార్యకర్త ఈ లేఖ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఎంతో చురుగ్గా వ్యవహరించిన మల్లారెడ్డి, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న క్లిష్ట సమయంలో మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీల నేతల వేదికలపై కనిపించడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల్లో తప్పు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్తలను తన విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగుల మాదిరిగా చూస్తున్నారని.. ధన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని సదరు కార్యకర్త ఆరోపించారు. నాయకులు కార్యకర్తలకు అండగా నిలవాల్సింది పోయి, ఇలా వ్యవహరించడం వల్ల పార్టీ తీవ్రంగా బలహీనపడుతుందని లేఖలో పేర్కొన్నారు. "బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తలను మరచిపోయిన ఏ నాయకుడైనా కాలక్రమేణా చరిత్రలో కనుమరుగైపోవడం ఖాయం" అని తీవ్రంగా హెచ్చరించారు. "ఈ లేఖను నా రక్తంతో రాయడం వెనుక ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కేవలం పార్టీపై ఉన్న ప్రేమ, ఒక కార్యకర్తగా నా మనసులోని బాధ, ఆవేదన మాత్రమే కారణం." అని బీఆర్ఎస్ కార్యకర్త లేఖ రాశారు.

నెట్టింట వైరల్.. ఇంకా మౌనంలోనే మల్లారెడ్డి

తెలంగాణ కోసం, పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తల భావోద్వేగాలను బీఆర్ఎస్ అధిష్టానం మరియు సీనియర్ నాయకులు గౌరవించాలని, పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని కార్యకర్త విజ్ఞప్తి చేశారు.

కాగా ఈ రక్తపు లేఖ ఘటనతో బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నేతలు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ లేఖపై ఇప్పటివరకు మాజీ మంత్రి మల్లారెడ్డి గానీ, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.