బీఆర్ఎస్ చేయగలుగుతోంది...వైసీపీ చేయలేకపోతోంది !
రెండూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే. రెండూ అధికారాన్ని నిండుగా అనుభవించి విపక్షంలోకి వచ్చిన పార్టీలే.
By: Satya P | 22 July 2026 9:35 AM ISTరెండూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే. రెండూ అధికారాన్ని నిండుగా అనుభవించి విపక్షంలోకి వచ్చిన పార్టీలే. రెండింటికీ అధినాయకత్వం గ్లామర్ ఇమేజ్ శ్రీరామరక్షగా ఉంది. ఆ రెండు పార్టీలే బీఆర్ఎస్ వైసీపీ. తెలుగునాట ఈ రెండు పార్టీలకు అనేక సారూప్యతలు కనిపిస్తాయి. కేసీఆర్ ఉద్యమ నేతగా పట్టుదల కలిగిన నాయకుడిగా తెలంగాణా రాజకీయ చరిత్రలో కనిపిస్తారు. ఆయన తన సారధ్యంలో బీఆర్ఎస్ ని రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు. ఇక ఏపీలో వైసీపీ అధినేత జగన్ కి కూడా పొలిటికల్ గ్లామర్ నిండుగా ఉంది. ఒకసారి వైసీపీని ఆయన బంపర్ మెజారిటీతో తీసుకుని వచ్చారు. ఇక ఆరు నెలల తేడాలో రెండు పార్టీలూ ఓటమి పాలు అయ్యాయి. అయితే తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి ఏపీలో వైసీపీ ప్రతిపక్ష పాత్రకు మధ్య పోలికలను చాలా మంది చూస్తున్నారు.
అసెంబ్లీ లోపలా బయటా :
బీఆర్ స్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రకు సరిపడా బలం ఉంది. దాంతో అసెంబ్లీ జరిగినపుడు అక్కడ బీఆర్ఎస్ బలంగా తమ వాదనను వినిపిస్తోంది. కేసీఆర్ సభకు దూరంగా ఉన్నా కూడా కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎంతో మంది సీనియర్ నేతలు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. బయట కూడా ప్రతీ రోజూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం జనంలో ఉంటోంది. ఆ తరువాత మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ద్వితీయ శ్రేణి నాయకులు అంతా ప్రజా సమస్యల మీద పోరాట బాటను ఎంచుకుంటున్నారు. కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు ప్రతీ చోటా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. హరీష్ రావు సైతం అంతే దూకుడుగా ఉంటున్నారు. మీడియా ముఖంగానూ ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ సర్కార్ ని ఢీ కొంటున్నారు.
జాతీయ అంశాల మీద :
ఇక బీఆర్ఎస్ జాతీయ అంశాల మీద కూడా ఒక స్పష్టతతో ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాల మీద బీఆర్ ఎస్ గట్టిగానే తన అభిప్రాయాన్ని చెబుతోంది. డీలిమిటేషన్ ఇష్యూ అయినా సర్ ప్రక్రియ వంటి అంశాలు అయినా లేదా విద్యార్ధుల ఆందోళనలు అయినా కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ మీద అయినా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక బిల్లులను వ్యతిరేకించడంలోనూ తన స్టాండ్ ఏంటో చెబుతోంది. తాజాగా ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీ చార్జి చర్యలను కేటీఆర్ గట్టిగా ఖండించారు. మోడీ ప్రభుత్వ విధానాల మీద కూడా విమర్శించారు.
వైసీపీ వైపు చూస్తే :
ఇక ఏపీలో వైసీపీ విషయం తీసుకుంటే ఇపుడిపుడే పార్టీ యాక్టివ్ అవుతోంది. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంతా జనంలోకి వస్తున్నారు. ప్రజా సమస్యల మీద వారు ఎలుగెత్తుతున్నారు. రెండేళ్ళ కూటమి పాలన మీద నిర్వహించిన నిరసనలు కూడా జనానికి దగ్గర చేశాయి. జగన్ కూడా వివిధ వర్గాల సమస్యల మీద చర్చిస్తున్నారు. అయితే వైసీపీకి ఇబ్బంది చూస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానానికి సరిపడా సంఖ్యాబలం లేకపోవడం. దాంతో సభకు వైసీపీ తొలి రోజు నుంచి గైర్ హాజర్ అవుతోంది. ఆ విధంగా అసెంబ్లీ వేదికగా వైసీపీ వాయిస్ వినిపించే చాన్స్ ని ఆ పార్టీ లేకుండా చేసుకుంది. ఇక జగన్ కూడా గతంలో మాదిరిగా జిల్లాల పర్యటనలు చేయడం లేదు. అపుడపుడు మాత్రమే బయటకు వస్తున్నారు. పార్టీలో జగన్ తరువాత రెండవ శ్రేణి నాయకత్వం లేకపోవడం కూడా వైసీపీకి సమస్యగా మారుతోంది అని అంటున్నారు.
జాతీయ అయోమయం :
ఇక జాతీయ స్థాయిలో చూస్తే వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు, రాజ్యసభలో మరో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఒక విధంగా చెప్పుకోదగిన బలం ఉంది. అయినా జాతీయ అంశాల మీద వైసీపీ ఒక స్పష్టతను కనబరచలేకపోతోంది అన్న విమర్శ ఉంది. ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ విరిగితే వైసీపీ నుంచి సరైన స్పందన లేకుండా పోయింది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సహా అనేక పార్టీలు దేశంలోని ఇతర పార్టీలు కూడా దీని మీద తమ అభిప్రాయం చెప్పాయి. తెలంగాణాలో కాంగ్రెస్ మీదనే నిత్యం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కూడా ఈ ఇష్యూలో మోడీకి వ్యతిరేకంగా గళం విప్పింది. అంతే కాదు సర్ ప్రక్రియ కానీ డీలిమిటేషన్ వంటి వాటి విషయంలో వైసీపీ ఎన్డీయే పక్షాన ఉంటున్నట్లుగానే మౌన ముద్ర దాలుస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతీ అంశం మీద ప్రతీ రోజూ రియాక్ట్ కావాలి. అంతే కాదు జనంతో మమేకం కావాలి. విపక్షంగా తమ సత్తా ఆ విధంగా చాటుకోవాల్సి ఉంది. వైసీపీ అయితే ఏపీలో కొన్ని పరిమితులకు లోబడి విపక్ష పాత్ర పోషిస్తోంది అని అంటున్నారు.
