జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గుర్తుల చిత్రాలు.. ఎవరెవరెవరికి ఏ గుర్తు ఇచ్చారంటే..?
పార్టీ గుర్తు అనేది ఓటరుకు కేవలం గుర్తు కాదు.. అది విశ్వాసం, గుర్తింపు, భావోద్వేగం, మానసిక సంకేతం.
By: Tupaki Political Desk | 26 Oct 2025 2:00 PM ISTపార్టీ గుర్తు అనేది ఓటరుకు కేవలం గుర్తు కాదు.. అది విశ్వాసం, గుర్తింపు, భావోద్వేగం, మానసిక సంకేతం. అలాంటి చిహ్నమే బీఆర్ఎస్‌కి (BRS) ఇప్పుడు తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండగా, ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తుల జాబితా పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నికల సంఘం ఈసారి బీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు కారు గుర్తును పోలిన చిహ్నాలను కేటాయించింది. రోడ్ రోలర్, చపాతీ రోలర్, టీవీ, సోప్ డిష్, ఫ్రిజ్ వంటి గుర్తులు. వీటిలో చాలా గుర్తులు ఒకే రకమైన ఆకృతిలో ఉండడంతో, సాధారణ ఓటరు కళ్లకు తేడా పెద్దగా కనిపించదు. కారు చిహ్నంతో దశాబ్దాలుగా గెలుపు చవిచూసిన బీఆర్ఎస్‌కి ఇవి కొత్త తలనొప్పి.
గత ఎన్నికల్లో కూడా ఇదే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైన సంగతి మరవలేం. హుస్నాబాద్, పటాన్‌చెరు, నాగర్‌కర్నూల్ వంటి నియోజకవర్గాల్లో ‘టీవీ’, ‘ప్రెషర్ కుక్కర్’, ‘గడియారం’ వంటి గుర్తులు కారు గుర్తుతో కన్ఫ్యూజ్ అయ్యి, పార్టీ ఓటు బ్యాంకుకు దెబ్బ కొట్టింది. ఆ అనుభవమే ఇప్పుడు మళ్లీ తలెత్తుతుందేమోనని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. పార్టీ నాయకులు ఇప్పటికే ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ఈ గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈసారి ఓ చిన్న ఊరటనిచ్చే అంశం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లో అభ్యర్థుల ఫొటోలు కనిపించనున్నాయి. దీంతో ఓటర్లు అభ్యర్థిని గుర్తించడంలో కొంత సౌలభ్యం ఉంటుంది. కానీ రాజకీయ వ్యూహకర్తల మాటలో, ‘సగం సమస్యే తగ్గుతుంది, మొత్తం కాదు.’ ఎందుకంటే గ్రామీణ, వృద్ధ ఓటర్లలో చాలా మంది ఇప్పటికీ ఫొటో కంటే గుర్తునే ఆధారంగా ఓటు వేస్తారు.
విద్యా వంతుల నియోజకవర్గం కాబట్టి తగ్గనున్న సమస్య..
జూబ్లీహిల్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది సంప్రదాయ బీసీ, మైనారిటీ, మధ్య తరగతి ఓటర్లతో పాటు అధిక విద్యావంతుల ప్రాంతం. ఇక్కడ గుర్తుల గందరగోళం కంటే ఎక్కువగా ప్రభావం చూపేది ప్రతీకాత్మక విశ్వాసం. బీఆర్ఎస్‌కు కారు గుర్తు అనేది కేవలం ఓ చిహ్నం కాదు.. అది ‘తెలంగాణ ఉద్యమం’ని గుర్తు చేసే భావోద్వేగం. ఆ గుర్తును పోలిన చిహ్నాల గందరగోళం చేసే ప్రమాదం ఉందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
కేటాయింపులు సబబు గానే జరిగిందంటున్న ఈసీ..
ఎన్నికల సంఘం తరఫున అధికారులు మాత్రం తాము ఇచ్చిన చిహ్నాలన్నీ ‘స్వతంత్ర అభ్యర్థుల స్థాయికి తగినవే’ అని చెబుతున్నారు. ‘ప్రతి అభ్యర్థికి చిహ్నాల కేటాయింపులో నియమావళి ప్రకారం వ్యవహరించాం. పోలికలుంటే అవి యాదృచ్ఛికం మాత్రమే’ అని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పర్యవేక్షకుల అభిప్రాయం వేరుగా ఉంది. బీఆర్ఎస్‌కి ఇది ఒక సైకాలజికల్ టెస్ట్. ఎందుకంటే గత ఎన్నికల తర్వాత పార్టీ అనూహ్యంగా పడిపోయింది. ఇప్పుడు తిరిగి నిలబెట్టుకునేందుకు ఆరాట పడుతుంది.
దశాబ్దాల పాటు గుర్తు..
ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ తమ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ప్రచారంలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి చురుకైన పబ్లిక్ అవుట్‌రిచ్ ప్రోగ్రాములు కొనసాగుతున్నాయి. ప్రజల మధ్య ఉన్న అసంతృప్తిని పునరుద్ధరించుకునేందుకు బీఆర్ఎస్‌కి ఈ ఉపఎన్నిక కీలకం. ఈ నేపథ్యంలో కారు గుర్తుతో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థికి ఇది సాధారణ పోటీ కాదు.. ఒకప్పుడు కారు గుర్తు రాష్ట్ర రాజకీయాలపై పట్టు చూపించింది. ఇప్పుడు అదే గుర్తును పోలిన చిహ్నాల మధ్య తన మానసిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్‌కి అతిపెద్ద సవాలుగా మారబోతోంది.
ఎన్నికల సీజన్‌లో ఓటర్లకు ఈ గుర్తుల గందరగోళం హాస్యంగా కనిపించొచ్చు.. కానీ రాజకీయ పర్యవేక్షకులకు ఇది ప్రజాస్వామ్యంలోని లోతైన సమస్య.. ఒక పార్టీ చిహ్నం అంటే ఓటరుతో ఉన్న ఆలోచనాత్మక బంధం. ఆ బంధం గందరగోళంలో కలిసిపోతే, ఆ పార్టీకి అది సాంకేతిక పరాజయమే కాక, మానసిక పతనానికి మొదటి మెట్టుగా మారుతుంది. జూబ్లీహిల్స్ పోరు కేవలం ఓ సీటు గెలుచుకోవడమా.. లేదా ఓ గుర్తు నిలబెట్టుకోవడమా? దీనికి సమాధానం రాబోయే ఓట్ల లెక్కల రోజే చెబుతుంది.
