Begin typing your search above and press return to search.

స్పీకర్ కు సెగ పెట్టిన బీఆర్ఎస్!

గతంలో అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ, ఆ గడువు పూర్తయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ పేర్కొంది.

By:  A.N.Kumar   |   10 Nov 2025 6:00 PM IST
స్పీకర్ కు సెగ పెట్టిన బీఆర్ఎస్!
X

తెలంగాణ రాజకీయాలు మళ్లీ సుప్రీంకోర్టు దాకా చేరాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టింది.. ఈ అంశంలో బీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు.

బీఆర్‌ఎస్ వాదనలు: గడువు ముగిసినా చర్యలేవి?

గతంలో అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ, ఆ గడువు పూర్తయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ పేర్కొంది. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. ఈ నెల 23న చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ రిటైర్ కానున్నారు. కొత్త సీజేఐ వస్తే విచారణ మళ్లీ మొదటికొస్తుందని, అందుకే అత్యవసరంగా విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్ న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు విన్నవించారు. "స్పీకర్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తే, అది కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణించవచ్చు" అని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు. మరోవైపు స్పీకర్ కార్యాలయం సైతం సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తిచేయడానికి మరింత గడువు కావాలని ఆ పిటిషన్‌లో కోరింది.

సుప్రీంకోర్టు స్పందన: వాయిదా వేయం.. వచ్చే సోమవారం విచారణ

ఈ వాదనలపై స్పందించిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను నవంబర్ 23న పదవీ విరమణ చేస్తున్నాను. ఆ తర్వాత నవంబర్ 24 నుంచి కోర్టుకు సెలవులు మొదలవుతాయి. అయినప్పటికీ కేసు విచారణను వాయిదా వేయం" అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పైనా వచ్చే సోమవారం (నవంబర్ 17) విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ ఇదీ..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను మూడు నెలల వ్యవధిలో తేల్చాలని సుప్రీంకోర్టు జులై 31న స్పీకర్‌ను ఆదేశించింది. ఈ గడువు ముగిసినా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున ఈ ధిక్కార పిటిషన్ దాఖలైంది. స్పీకర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని, ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేసేంత వరకు ఈ ప్రక్రియను సాగదీయాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్ని పిటిషన్లపై స్పీకర్ కనీసం ప్రొసీడింగ్స్ కూడా ప్రారంభించలేదని, మరికొన్ని సాక్ష్యాల దశలోనే నిలిచిపోయాయని తెలిపారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ రాజకీయాలకు కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.