Begin typing your search above and press return to search.

కేసీఆర్ సూదంటు రాయి...మరి జగన్ ?

కేసీఆర్ రాజకీయ అనుభవం దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలు. ఆయన 1983లో టీడీపీ నుంచి తొలిసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని అందుకున్నా 1985లో గెలిచి నిలిచారు.

By:  Satya P   |   2 May 2026 6:00 AM IST
కేసీఆర్ సూదంటు రాయి...మరి జగన్ ?
X

కేసీఆర్ రాజకీయ అనుభవం దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలు. ఆయన 1983లో టీడీపీ నుంచి తొలిసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని అందుకున్నా 1985లో గెలిచి నిలిచారు. అలా తన మార్క్ ని చాటుకుంటూ ఈ రోజున తెలంగాణా సాధకుడిగా మాజీ సీఎం గా వ్యూహకర్తగా అపర చాణక్యుడిగా ఉన్నారు. ఇక పడినా కూడా కడలి తరంగం మాదిరిగా లేస్తేనే సిసలైన రాజకీయం. అంతే కాదు పోయిన చోటనే వెతుక్కోవాలి అన్నది అక్కడ నీతి. ఈ విషయాలు అన్నీ కేసీఆర్ కి పూర్తిగా తెలుసు. అందుకే ఆయన తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ని సంసిద్ధం చేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో గెలిచే పార్టీగా జనం భావించేలా రాజకీయ జనం ఇటు వైపు చూసేలా ఏమి చేయాలో అన్నీ చేస్తున్నారు.

బిగ్ షాట్ తో స్టార్ట్ :

సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ని గేమ్ చేంజర్ గా మార్చేందుకు కేసీఆర్ చూస్తున్నారు. ఓటమి అన్నది నిన్నటి మాట. బీఆర్ఎస్ తోనే గెలుపు అన్నది రేపటి మాట అన్న సందేశం తెలంగాణా రాజకీయాల్లో గట్టిగా చేరేలా కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఊపులో మరింత మందిని తమ పార్టీలో చేర్చుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ మీదనే గురి పెట్టారు అని అంటున్నారు. రానున్న రోజులలో అనుకున్న తీరున వచ్చే వారు కూడా ఉన్నారని అంటున్నారు. ఆ విధంగా బీఆర్ఎస్ అయితే 2028 ఎన్నికలకు అవసరమైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ ని ఒక రాజకీయ ఆకర్షణ శక్తిగా కూడా మార్చుతున్నారు.

వైసీపీలో చూస్తే :

ఇక ఏపీలో కూడా అచ్చం బీఆర్ఎస్ మాదిరిగానే వైసీపీ చతికిలపడింది. ఆ పార్టీ కోలుకుంది అనేందుకు పార్టీ నేతలు చెబుతున్న మాటలు చేస్తున్న ప్రకటనలు ఎంత మాత్రం సరిపోవు. ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరితేనే వైసీపీకి మంచి రోజులు వస్తున్నట్లుగా లెక్క అని అంటున్నారు. మరీ ముఖ్యంగా అధికార కూటమి వైపు నుంచి నేతలు వచ్చి చేరితే వైసీపీకి ఒక సానుకూలత వస్తుందని రేపటి ఎన్నికల్లో వైసీపీ నిలిచి గెలుస్తుందన్న టాక్ కూడా వస్తుందని అంటున్నారు. అయితే రెండేళ్ళు పూర్తి అవుతున్నా కూటమి కసికందకుండా ఉంది. మూడు పార్టీలు ముచ్చటగా కలిసి ఉంటున్నాయి. ఐక్యతకు మారు పేరుగా మనుగడ సాగిస్తున్నాయి.

వికెట్లు పడకపోతే :

రాజకీయాల్లో సక్సెస్ కొట్టాలంటే ఎదుటి పక్షం వికెట్లు పడాలి. వాటిని తీసేందుకు ప్రతిపక్షం అను క్షణం ప్రయత్నం చేయాలి. ఇదే రాజనీతి. తమకు జనాలు అవసరం లేదు, కావాల్సినంత మంది ఉన్నారు అనుకోవడం వేరు. ఎదుటి పక్షం నుంచి అందునా అధికారం వైపు నుంచి తమ వైపునకు తీసుకోగలిగితే సూదంటు రాయిగా ఆకర్షించగలిగితే అది కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనం చూపు ఆలోచనలు కూడా మారుతాయి. కానీ వైసీపీ నుంచి ఈ రోజుకీ వెళ్ళాలనుకునే వారే కనిపిస్తున్నారు అని అంటున్నారు. కానీ కూటమి వైపు నుంచి ఎవరూ వచ్చేది కనిపించడం లేదని కూడా చర్చ ఉంది. బీఆర్ఎస్ తెలంగాణాలో చేస్తున్నది ఏపీలో వైసీపీ ఎందుకు చేయలేకపోతోంది అన్నది పెద్ద ప్రశ్న. తెలంగాణాలో బీఆర్ఎస్ కి పోటీగా బీజేపీ ఉంది. ఏపీలో అయితే మరో పార్టీ ప్రతిపక్షంలో వైసీపీకి లేనే లేదు. పైగా కూటమి కిక్కిరిసిపోయి ఉంది. అయినా ఆ వైపు వారిని ఈ వైపుగా ఆకట్టుకోవడం లేదంటే కూటమి సేఫ్ జోన్ అన్నది రాజకీయ జీవులకు అర్ధం అయి ఉండాలి. వైసీపీ ఇంకా కోలుకోలేదు అన్న భావన కూడా ఉండి ఉండాలి. మరి దానిని పోగొట్టుకోవాలి అంటే వైసీపీ ఏమి చేయాలన్నదే ఆలోచించాలని అంటున్నారు.