Begin typing your search above and press return to search.

మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని లాగొద్దు..కవితకు రేవంత్ కౌంటర్

కవిత కేవలం తన వ్యక్తిగత అసంతృప్తిని మాత్రమే వెలిబుచ్చలేదు. ఆమె ప్రశ్నల వెనుక పార్టీ అధిష్ఠానం, ముఖ్యంగా కేటీఆర్‌, హరీశ్‌రావుల తీరుపై తీవ్రమైన అసహనం ఉంది.

By:  A.N.Kumar   |   3 Sept 2025 5:59 PM IST
మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని లాగొద్దు..కవితకు రేవంత్ కౌంటర్
X

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవల ఒక క్లిష్టమైన దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ కవిత పార్టీపై చేసిన తీవ్రమైన ఆరోపణలు, ఆమె బహిరంగంగా వ్యక్తం చేసిన అసంతృప్తి పార్టీ అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. చివరికి ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేసింది. ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై, తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే కవిత తాజాగా హరీష్ రావుకు, సీఎం రేవంత్ కు సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లిద్దరూ కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా సీఎం రేవంత్ స్పందించారు. గట్టి కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహం

రేవంత్ రెడ్డి తాజాగా ఓ సభలో మాట్లాడుతూ.. ‘చేసిన పాపాలు ఎక్కడికీ పోవూ.. ఆనాడు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారు.. ఈరోజు దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో గొడవలు వచ్చి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. నేను ఆ చెత్త గాళ్ల వెనక ఎందుకు ఉంటాను? నేను నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం నాయకుడిగా ముందుంటా’’ అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యంగ్యం మాత్రమే కాదు. దాని వెనుక రెండు ప్రధాన వ్యూహాలు ఉన్నాయి. మొదటిది, బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న ఈ అంతర్గత విభేదాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం. బీఆర్‌ఎస్‌ నాయకులు కుటుంబ పోరాటాల్లో మునిగి ఉన్నారని ప్రజలకు చూపించడం ద్వారా కాంగ్రెస్‌కు మరింత మైలేజీ తెచ్చుకోవడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రెండవది ఈ గొడవలకు కాంగ్రెస్ కు, రేవంత్ కు సంబంధం లేదని ఆరోపించారు. ఈ గొడవను ప్రజల దృష్టి కోణం నుంచి వివరించడం. ఒక కుటుంబం లోపల జరుగుతున్న కలహాల వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, ఈ భావనను రేవంత్ తన వ్యాఖ్యలతో బలపరుస్తున్నారు.

- కవిత ప్రశ్నల అంతరార్థం

కవిత కేవలం తన వ్యక్తిగత అసంతృప్తిని మాత్రమే వెలిబుచ్చలేదు. ఆమె ప్రశ్నల వెనుక పార్టీ అధిష్ఠానం, ముఖ్యంగా కేటీఆర్‌, హరీశ్‌రావుల తీరుపై తీవ్రమైన అసహనం ఉంది. ఆమె అడిగిన కీలక ప్రశ్నలు చూస్తే.. పార్టీలో అవినీతి, కుట్రలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? హరీశ్‌రావు పాత్రపై ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు పార్టీ నాయకత్వ లోపాన్ని, నిర్ణయాధికారంలో ఉన్న అస్పష్టతను సూచిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు బీఆర్‌ఎస్‌ నుంచి సరైన సమాధానం రాకపోతే, ప్రజల విశ్వాసం కోల్పోవడం ఖాయం.

- రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం

పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడడం, ముఖ్యంగా ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య పోరాటం బీఆర్‌ఎస్‌ రాజకీయ స్థిరత్వానికి ప్రమాదకరమని చెప్పవచ్చు. పార్టీ అంతర్గత సమస్యలను ప్రజా వేదికపైకి తీసుకురావడం వల్ల ప్రజలలో "ఈ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కంటే సొంత గొడవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది" అనే అభిప్రాయం బలపడుతుంది. బీఆర్‌ఎస్‌లో నెలకొన్న ఈ సంక్షోభం కాంగ్రెస్‌కు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తుంది. రేవంత్ ఇప్పటికే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, బీఆర్‌ఎస్‌ను "కుటుంబ పార్టీ"గా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కవిత వర్గం పార్టీ నుంచి పూర్తిగా దూరమైతే, బీఆర్‌ఎస్‌ మరింత బలహీనపడుతుంది. కేటీఆర్‌, హరీశ్‌రావు కలిసి పార్టీని నడిపినా, ఈ సంక్షోభం సృష్టించిన అనుమానాలు, అవిశ్వాసం పార్టీ శ్రేణుల్లో సులభంగా తొలగిపోవు. ఇది రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం ప్రజల విశ్వాసం కంటే కుటుంబ పోరాటాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కేవలం ఆమెను బహిష్కరించడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని చూస్తే, అది పార్టీకి మరింత నష్టం కలిగిస్తుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ అంతర్గత విభేదాలను ఎగదోయడమే కాకుండా, తెలంగాణ ప్రజల ప్రస్తుత మనోభావాలను కూడా ప్రతిబింబిస్తున్నాయి.