రాహుల్ కేసు అడ్డం: రిమాండ్ తప్పించుకున్న ఎమ్మెల్సీలు
బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల చుట్టూ తిరిగిన రాజకీయ ఉత్కంఠకు.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత కేసు ఆధారంగా తెరపడింది.
By: Garuda Media | 8 Sept 2026 11:09 PM ISTబీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల చుట్టూ తిరిగిన రాజకీయ ఉత్కంఠకు.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత కేసు ఆధారంగా తెరపడింది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను దూషించారంటూ.. నమోదైన కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే వారిని రిమాండ్‌కు పంపేందుకు వీలుగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వీటిలో అట్రాసిటీ కేసు కూడా ఉంది. ముఖ్యంగా స్పీకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. ఆయనపై దూషణలు చేశారని ఎమ్మెల్సీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మధు, నవీన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయమే వారిని అరెస్టు చేసి.. నాంపల్లిలోని కోర్టుకు తరలించారు. ఈ కేసు పూర్వాపరాలు.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను పరిశీలించిన న్యాయమూర్తి.. రిమాండ్‌ను తిరస్కరించారు. రాజకీయాల్లో దూషించినంత మాత్రాన అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని గతంలో రాహుల్ గాందీ కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ పోలీసుల వైఖరిని తప్పుబట్టింది. అలానే మహారాష్ట్ర పోలీసులు కూడా నమోదు చేసిన ఇలాంటి కేసులను కొట్టి వేసింది. విచారణ వరకు పరిమితం కావాలని పేర్కొంది.
అచ్చంగా అలాంటి ఘటనే ఇక్కడ కూడా జరిగిందని అభిప్రాయపడిన నాంపల్లికోర్టు.. ఇరువురు ఎమ్మెల్సీలకు రిమాండ్ విధించలేమని స్పష్టం చేసింది. అయితే, వారి నుంచి పూచీకత్తులు(హామీ) తీసుకోవాలని ఆదేశించింది. అలానే.. విచారణకు సహకరిం చాలని కూడా ఎమ్మెల్సీలకు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా.. రాజకీయాల్లో దూషణలు కొత్తకాదని.. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదు చేసుకుంటూ పోయి.. జైళ్లలో పెడితే.. కొత్తగా జైళ్లు కట్టాల్సి వస్తుందని ఎమ్మెల్సీల తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కులం పెట్టి దూషించారంటూ.. నవీన్ రెడ్డిపై నమోదైన కేసులో తీవ్రతనుకూడా కోర్టు ప్రశ్నించింది.
అసెంబ్లీలో తీర్మానం..
మరోవైపు ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ పక్షం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం గమనార్హం. మంగళవారం సాయంత్రం ఈ తీర్మానాన్ని మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహ ప్రవేశ పెట్టారు. స్పీకర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉందని, అలాంటి పొజిషన్‌ను సైతం వీరు అవమానించారని తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ తీర్మానంసై సభ్యులు చర్చించిన తర్వాత.. నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేయనున్నారు. అయితే.. ఇద్దరినీ ప్రస్తుతం జరుగుతున్న సభల నుంచి సస్పెండ్ చేస్తారా? లేక.. పదవీ కాలం పాటు వేటు వేస్తారా? అనేది చూడాలి. అయితే.. కోర్టు తాజా ఆదేశాలు సైతం ఈ తీర్మానంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
