Begin typing your search above and press return to search.

''మేం బీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలిచాం.. కాద‌న్న‌మా?''

అలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు.

By:  Garuda Media   |   8 Sept 2025 4:38 PM IST
మేం బీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలిచాం.. కాద‌న్న‌మా?
X

బీఆర్ ఎస్ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వారిలో కొంద‌రు ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. వీరిపై అన‌ర్హ‌త క‌త్తి వేలాడుతోంది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు పేషీలో పెండింగులో ఉంది. ఒక‌వైపు సుప్రీంకోర్టు కూడా ఈ వ్య‌వ‌హారాన్ని మూడు మాసాల్లోనే తేల్చాల‌ని చెప్పింది. అయినా.. ఎలాంటి చ‌ర్య‌లు లేక‌పోగా.. వేచి చూస్తున్న ధోర‌ణి క‌నిపిస్తోంది. అలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు.

వీరిలో దానం నాగేంద‌ర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావు, గాంధీ, కాలె యాదయ్య, సంజయ్, మహిపాల్‌రెడ్డి ఉన్నారు. వీరంతా గత 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కారు గుర్తుపై విజయం ద‌క్కించుకున్నారు. అయితే.. పార్టీ మారింది కేవ‌లం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి కోస‌మేన‌ని.. రాజకీయంగా కాద‌ని వీరు మీడియాకు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ''మేం బీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలిచాం. కాద‌న్న‌మా.? ఇప్ప‌టికీ ఆ పార్టీలోనే ఉన్నం. అభివృద్ధి కోసం.. అధికార పార్టీకి మ‌ద్ద‌తు తెలిపాం అంతే!.'' అని దానం వ్యాఖ్యానించారు.

ఇక‌, వీరు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధినిధులు ఇవ్వాల‌ని.. అనేక ప‌నులు పెండింగులో ఉన్నా య‌ని చెప్పుకొచ్చారు. నిధులు ఇవ్వ‌క‌పోతే.. త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. అయితే.. దీనిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి స్పందిస్తూ.. మీరే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే నిధులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నాం.. క‌దా.. వాటిపై ప్ర‌చారం చేయండి అని సూచించారు.

ఇక‌, అన‌ర్హ‌త వేటు విష‌యంపై కూడా వీరు మంత్రుల‌తోను, సీఎం రేవంత్‌రెడ్డితోనూ చ‌ర్చించారు. త‌మ‌పై చ‌ర్య‌లు ఎలా తీసుకుంటార‌ని వారు ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. తాము బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామ‌ని.. కేవ‌లం అభివృద్ధి ప్రాతిప‌దిక‌న‌.. తాము కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. దీనిని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం ఈ విష‌యం త‌మ ప‌రిధిలో లేద‌ని.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు ప‌రిధిలో ఉంద‌ని.. మంత్రులు చెప్పుకొచ్చారు.