అది కాంగ్రెస్ జెండానా?: 'ఫిరాయింపు'ల వింత సమాధానం
కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్.. ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలను విచారణకు పిలుస్తున్నారు.
By: Garuda Media | 4 Oct 2025 11:15 PM ISTబీఆర్ ఎస్ పార్టీ టికెట్‌పై విజయం దక్కించుకుని.. తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ఆ పార్టీలో టెన్షన్ నెలకొంది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్‌రావు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఈ క్రమంలో అటు బీఆర్ ఎస్ తరఫున న్యాయవాదులు, ఇటు స్పీకర్ కూడా.. ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యేలు మాత్రం తక్కువ తిన్నారా.. వారి వ్యూహాలు వారికి ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు వరుసగా శనివారం సాయంత్రం వరకు వీరి విచారణ జరిగింది.
కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్.. ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలను విచారణకు పిలుస్తున్నారు. వారికి భోజనం, కాఫీ, టీలు కూడా అందించి.. విచారిస్తున్నారు. ఈ క్రమంలో వారు చెబుతున్న సమాధానాలు కూడా చిత్రంగా ఉంటున్నారు. సీఎం రేవంత్ ను ఎందుకు కలిశారంటే..నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు అడిగేందుకు కలిశామని.. ఈ సందర్భంగా ఆయన తమను సత్కరించారని సమాధానం చెప్పారు. ఈ సత్కారంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు ఉందన్న బీఆర్ ఎస్ తరఫు న్యాయవాదికి చుక్కలు చూపించారు.
``అది కాంగ్రెస్ పార్టీ జెండనా? కాదే.. అది జాతీయ జెండా అనుకున్నం.`` అని కాలే యాదయ్య ఇచ్చిన సమాధానం లాయర్ కు షాక్ తగిలేలా చేసింది. అంతేకాదు.. మరొకరు.. ``సోషల్ మీడియా అంటే ఏంటి?`` అని ప్రశ్నించడంతో న్యాయవాది విస్మ యం వ్యక్తం చేశారు. ``మీరు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని.. పార్టీలో చేరారని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. తెలుసా?`` అన్న ప్రశ్నకు.. ``ఔనా.. ఇంతకీ సోషల్ మీడియా అంటే ఏంటి?. నేనెప్పుడు చూడలే. నాకు తెల్వదు. నీకు తెలిస్తే చెప్పు.`` అని వింత సమాధానం చెప్పడంతో న్యాయవాది అవాక్కయ్యారు.
అంతేకాదు.. పార్టీ మారుతున్నారా? అని ప్రశ్నించినప్పుడు.. కూడా ఎమ్మెల్యేలు చిత్రమైన సమాధానం చెప్పారు. ``ఆ అవసరం మాకెందుకు. మేం చెప్పినమా? కేసీఆర్ సార్ మాకు టికెట్ ఇచ్చిండు. మేం గెలిచినం. అంతే. దీనిలో తేడాలేదు. పార్టీ మా రేందుకు మా ఆలోచన ఎవరితోనైనా పంచుకున్నమా?`` అని ఎదురు ప్రశ్నించారు. ఇక, బీఆర్ ఎస్ పార్టీ కార్యాలనికి ఎందుకు రావట్లేదన్న విషయంపైనా ఆసక్తికర సమాధానాలే ఇచ్చారు. ``స్కూలుకు పిల్లగాళ్లు రోజూ పోతరా? అప్పుడప్పుడు ఎగ్గొట్టరా? నేను కూడా అంతే. రోజు పార్టీ కార్యాలయంలో ఏం పని ఉంటది. నియోజకవర్గంలో తిరగాలి. అక్కడే తిరుగుతున్నా.` అని చెప్పడం గమనార్హం. మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో మూడుమాసాల్లో ఈ విషయాన్ని తేల్చాలని భావిస్తూ.. చేస్తున్న విచారణ పసలేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. చివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
