Begin typing your search above and press return to search.

న‌న్ను చంపేస్తారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కుమారుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నేత‌, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తొల‌కంటి ప్ర‌కాష్‌గౌడ్‌పై ఆయ‌న కుమారుడు.. సంతోష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By:  Garuda Media   |   7 Aug 2026 12:43 AM IST
న‌న్ను చంపేస్తారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కుమారుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నేత‌, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తొల‌కంటి ప్ర‌కాష్‌గౌడ్‌పై ఆయ‌న కుమారుడు.. సంతోష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు,త‌న కాబోయే భార్య‌కు త‌న తండ్రి నుంచి ప్రాణ హాని ఉంద‌ని తెలిపారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. త‌మ‌పై ఇప్ప‌టికే 40 మందితో దాడి చేయించేందుకు త‌న తండ్రి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఆరోపించారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపింది.

ఏంటి కేసు?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు.. సంతోష్ గౌడ్‌, అదే పార్టీకి చెందిన మ‌ణికొండ నాయ‌కురాలు రూపారెడ్డి కుమార్తెను ప్రేమించాడు. ఇరువురు ఇష్ట‌ప‌డ్డారు. పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. అయితే.. ఇది కులాంత‌ర వివాహం కావ‌డంతో ప్ర‌కాష్ గౌడ్ ఆది నుంచి విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు కుమారుడు ఆరోపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. తాము ఒక‌రిని విడిచి ఒక‌రం ఉండ‌లేనంత‌గా ప్రేమించుకున్నామ‌ని.. చెప్ప‌డంతో `మీఇష్టం` అని చెప్పార‌ని తెలిపారు.

తీరా.. నిశ్చితార్థం అయిపోయిన త‌ర్వాత‌.. త‌న కాబోయే అత్త‌, బీఆర్ ఎస్ నాయ‌కురాలు.. రూపారెడ్డి ఇంటి పై 40 మంది దుండ‌గులు బుధ‌వారం దాడి చేశార‌ని సంతోష్ వ్యాఖ్యానించారు. ఈ వ్య‌వ‌హారం వెనుక త‌న తండ్రి ప్ర‌కాష్ గౌడ్ ఉన్నాడ‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న అధికార బ‌లంతో త‌మ‌ను విడ‌దీసేందుకే కాకుండా.. త‌మ‌ను చంపేందుకు కూడా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సంతోష్ ఆరోపిస్తున్నారు. దీనిపై తాము పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ల‌గా.. వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు.

మాపైనే కేసులు

తాము ఇచ్చిన ఫిర్యాదును తీసుకోని పోలీసులు ఎదురు త‌మ‌పైనే కేసులు పెడుతున్నార‌ని సంతోష్ గౌడ్ పేర్కొన్నారు. త‌మ ప్రాణాల‌కు ఎలాంటి హాని జ‌రిగినా.. త‌మ తండ్రిదే బాధ్య‌త‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే..ఈ వ్య‌వ‌హారంపై అటు పోలీసులు, ఇటు ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ కూడా మౌనంగా ఉన్నారు. నిజానికి బుధ‌వారం రూపారెడ్డి ఇంట్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఘ‌ర్ష‌ణ ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇది త‌ప్ప‌ని.. త‌న తండ్రి చేయించిన దాడేన‌ని సంతోష్ ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు.. ఎమ్మెల్యే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.