అసెంబ్లీలో "బాంబుల" కలకలం: కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాళేశ్వరంలోని మేడిగడ్డను బాంబులతో పేల్చినట్టే తన నియోజకవర్గంలోని బ్యారేజ్ ను పేల్చేశారంటూ కాంగ్రెస్ పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని కుదిపేశాయి.
By: A.N.Kumar | 29 Dec 2025 3:55 PM ISTఅసెంబ్లీలో ‘బాంబులు’ పేలాయి.అయితే అవి నిజమైన బాంబులు కావు.. మాటల బాంబులు.. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ బాంబులను అంటించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో మరోసారి భగ్గుమన్నది. కాళేశ్వరంలోని మేడిగడ్డను బాంబులతో పేల్చినట్టే తన నియోజకవర్గంలోని బ్యారేజ్ ను పేల్చేశారంటూ కాంగ్రెస్ పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని కుదిపేశాయి.
తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ వెళ్లిపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తన నియోజకవర్గంలోని ఒక చెక్ డ్యామ్‌ను బాంబులతో పేల్చివేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు సభలో గందరగోళానికి దారితీశాయి.
తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చినట్టుగానే ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తణుగుల గ్రామ పరిధిలోని చెక్ డ్యామ్‌ను బాంబులు పెట్టి పేల్చివేశారని కౌశిక్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ చెక్ డ్యామ్‌ను ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన 'రాఘవ కన్స్ట్రక్షన్స్' నిర్మించిందని దానిని కావాలనే ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు.గతంలో ఎన్నికల లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై బాంబులు వేశారని విమర్శించిన కౌశిక్ రెడ్డి.. ఇప్పుడు అదే తరహాలో చెక్ డ్యామ్‌లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు.
తణుగుల చెక్ డ్యామ్ ధ్వంసం కావడం వల్ల హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయకట్టు దెబ్బతిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెక్ డ్యామ్ కు రిపేర్లు చేస్తే దాదాపు 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. ధ్వంసమైన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పేలుడు వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన స్పీకర్ ను డిమాండ్ చేశారు.
కౌశిక్ రెడ్డి బాంబులు.. పేలుళ్లు అనే పదాలను వాడటంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో సభలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు.
అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని విపక్షాలు కోరుతున్నాయి. మరి కౌశిక్ రెడ్డి చేసిన ఈ "బాంబు" ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
