Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు కవితే దిక్కు కానుందా?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంతకూ తన పట్టును పెంచుకుంటూ పోతోంది.

By:  Garuda Media   |   5 Aug 2025 9:45 AM IST
Kavitha as BRS Chief? Leadership Crisis Talks Heat Up Amid
X

తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ హాట్ హాట్ గా నడుస్తోంది. రాష్ట్ర సాథనలో కీలకభూమిక పోషించినట్లుగా ప్రచారం చేసుకోవటం.. రాష్ట్రం ఏర్పడిన మొదటి పదేళ్లలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ బాస్.. రాష్ట్రాన్ని ఎంతలా కంట్రోల్ చేశారో తెలిసిందే. ఇదే.. ఆయనకు ఇప్పుడు తలనొప్పిగా మారిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. సమస్త తెలంగాణకు తాను తప్పించి మరెవరో ఉండరు.. రారన్న భావనలో కేసీఆర్ ఉండి ఉంటారన్న విషయాన్ని ఆయన్ను సన్నిహితంగా ఉన్నోళ్లు చెప్పటం తెలిసిందే. ఈ అతి విశ్వాసమే.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేతికి అందకుండా చేసిందని.. హ్యాట్రిక్ రికార్డును దూరం చేసిందని చెబుతుంటారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంతకూ తన పట్టును పెంచుకుంటూ పోతోంది. పాలనపై రేవంత్ కు ఇప్పడిప్పుడే పట్టు వస్తున్నట్లుగా చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు అవుతున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకంతకూ చిక్కుముడిగా మారుతుంటే.. ఈ ఉదంతంలో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రి హరీశ్ రావులు అడ్డంగా బుక్ కానున్నారన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మిగిలిన ప్రభుత్వాల మాదిరి.. తానేదో టార్గెట్ చేసి కేసీఆర్ అండ్ కో మీద రాజకీయ పగ తీర్చుకుంటున్న భావన రాకుండా చూసుకోవటంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత తీవ్రమైనది అయినప్పటికి అధికారులు తప్పించి.. రాజకీయ నాయకులు.. బీఆర్ఎస్ లోని ఏ స్థాయి వారు ఇప్పటివరకు అరెస్టు కావటం తెలిసిందే.

అదే సమయంలో కాళేశ్వరం ఇష్యూను చూస్తే.. ఈ ప్రాజెక్టులో నిర్మాణంలో లోపాలు జరిగినట్లుగా పేర్కొంటూ జస్టిస్ ఘోష్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇందులోనూ పలు కీలకాంశాల్ని ప్రస్తావించటం.. వేళ్లు అన్నీ కేసీఆర్ వైపు చూపేలా ఉండటం తెలిసిందే. అయినప్పటికీ చర్యల కోసం రేవంత్ సర్కారు పెద్దగా ఆసక్తి చూపటం లేదనే చెప్పాలి. కేసీఆర్ ను అరెస్టు ప్రయత్నం దిశగా అడుగులు పడటం లేదు. అయితే.. వీరిపై చేపట్టే చర్యలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయటంతో పాటు.. పార్టీ పగ్గాలకు కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసేలా పరిస్థితులు ఏర్పడినట్లుగా చెబుతున్నారు

దీనికి తోడు.. కేసీఆర్ కుమార్తె కం ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే.. త్వరలోనే తనకు గులాబీ పగ్గాలు తన చేతికి ఖాయమన్నట్లుగా మాట్లాడటం.. ఆమె తప్పించి మరో దిక్కు లేదన్నట్లుగా కవిత సన్నిహితులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనంగా ఉండాలన్న యోచలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి గులాబీ పార్టీకి కవిత తప్పించి మరో దిక్కు లేని పరిస్థితి నిజంగా వస్తుందా?

ఒకవేళ వస్తే.. అంతటి బాధ్యతను కవిత సరైన రీతిలో డీల్ చేయగలదా? అన్న ప్రశ్నలు జోరుగా సాగుతున్నాయి. కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు చేయటం.. బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే. దీంతో.. ఈ కేసులో కవిత పాత్ర కనుమరుగు అవుతుందన్న వాదన వినిపిస్తోంది. తాజా పరిణామాల్లో కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావులపై కేసుల చిక్కులు పడితే కవితే ప్రత్యామ్నాయం కానున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ తరహా పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా తక్కువన్న వాదన వినిపిసతోంది. ఎందుకంటే.. కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయరని.. కోర్టు కేసులు వెంటాడినా.. రేవంత్ సర్కారు దిగే వరకు అదే కోట్లాట సాగుతూ ఉంటుందే తప్పించి.. గులాబీ తోటకు కవితను హెడ్ గా మార్చే యోచనే లేదంటున్నారు. అంతేకాదు.. మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులను సైతం అరెస్టు చేస్తే.. తదనంతర పరిణామాలు రేవంత్ సర్కారుకు నూకలు చెల్లేలా చూస్తాయన్న వాదనను బలంగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి కారణం.. గులాబీ పార్టీకి అత్యంత కీలకమైన ఈ ముగ్గురు ముఖ్యనేతల విషయంలో కేసుల్లో చర్యలు ఉండవని స్పష్టం చేస్తున్నారు.

అదే జరిగినప్పుడు గులాబీ పగ్గాలు ఎవరికి? అన్న దానిపై చర్చకు అవకాశం లేదంటున్నారు. కవిత టీంలోని వారి అంచనాలన్నీ అసహజనంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఏదో హడావుడికి పోయి.. తమ ఉనికిని గుర్తించాలన్న తపన వారికి ఉన్నప్పటికీ.. అదేదీ గులాబీ అధినేత.. పార్టీ ముఖ్యనేతలకు ఇబ్బంది కలగదంటున్నారు. కవిత అండ్ కో చేసే ప్రయత్నాలు వారికే తిరుగు టపాలో ఇబ్బందికి గురి చేసే అవకాశమే ఎక్కువంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ తోటకు కవిత దిక్కు కానున్నారన్న వాదనలో ఎలాంటి అర్థం లేదన్న మాటను బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు గులాబీ పార్టీ నాయకత్వానికి వచ్చిన సమస్య ఏమీ లేనప్పటికీ.. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని చెప్పక తప్పదు.