బాపు అస్సలు మాట్లాడరు.. చిన్నసారు అతిగా మాట్లాడేస్తారు?
గులాబీ పార్టీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. పార్టీ అధినేత తీరు ఒకలా.. చిన్నబాసు తీరు మరోలా ఉండటం ఒక ఎత్తు అయితే.. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కవిత ఇప్పుడు పార్టీ నుంచి పంపించేయటం తెలిసిందే.
By: Garuda Media | 18 Sept 2025 6:00 PM ISTగులాబీ పార్టీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. పార్టీ అధినేత తీరు ఒకలా.. చిన్నబాసు తీరు మరోలా ఉండటం ఒక ఎత్తు అయితే.. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కవిత ఇప్పుడు పార్టీ నుంచి పంపించేయటం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వెళ్లే వేళలో.. పార్టీకీ ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు మీదా.. కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ.. బాపు మంచి చెడ్డలు చూసుకునే ఎంపీ సంతోష్ మీదా ఆమె చేసిన విమర్శలు ఆ పార్టీలో పెద్ద తుపానే రేపాయి.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలై దాదాపు 22 నెలలు కావొస్తున్నా.. ప్రజా సమస్యల్ని టేకప్ చేసే ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాం కూడా పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టకపోవటం ఒక సమస్యగా మారింది. ఎన్నికల్లో పార్టీ ఓడేందుకు కారణమైన ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి ఇప్పటికి బయటకు రాకుండా.. పరిమితమైన పార్టీ నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న బాపు తీరుపై పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు
ఓవైపు అధికారపక్ష అదే పనిగా అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్ కు సవాలు మీద సవాలు విసురుతున్నా.. ఎలాంటి స్పందన లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కానీ అసెంబ్లీలోకి అడుగు పెడితే. రేవంత్ సర్కారుకు ముచ్చమటలు ఖాయమన్న మాట మొదట్లో వినిపించినా.. కాల క్రమంలో విషయం అర్థమైన పరిస్థితి. ఎవరెన్ని అన్నా.. ఎంతలా పిలిచినా.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశమే తనకు లేనట్లుగా కేసీఆర్ ఉండటం.. ఆ పార్టీ నేతలు నిరాశను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకటి కాకుంటే ఒక అంశం మీదా అయినా కేసీఆర్ స్పందించకపోవటం.. ప్రభుత్వ విధానాల్ని తప్పు పట్టే విషయాన్ని పట్టించుకోని తీరును తప్పు పడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీ చేసే తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉండటమే ఏమిటన్నది ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ నేతలు బాపు అంటూ పిలుచుకునే కేసీఆర్ నోటి నుంచి మాట రాని పరిస్థితి. పలుకే బంగారమాయె అన్న చందంగా.. రేవంత్ సర్కారు తీరుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం ఏమిటి? అన్నది పార్టీ వర్గాలకు ఒక పట్టాన అర్థం కావట్లేదు.
ఇలా గులాబీ బాస్ తీరు ఉంటే.. అందుకు భిన్నంగా చిన్న బాసు కేటీఆర్ తీరు ఉందంటున్నారు. అవసరం ఉన్నా.. అవసరం లేకున్నా.. అదే పనిగా మాట్లాడటం.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు రాజకీయ ప్రత్యర్థులు కౌంటర్ వేస్తూ.. సోషల్ మీడియాలో ఉతికిఆరేసేలా పోస్టులు పెడుతున్న పరిస్థితి. దీనికి తోడు.. ఆయన టేకప్ చేసే అంశాలు.. స్పందించే ఉదంతాల్లో గులాబీ పార్టీ అధికారంలో ఉన్న వేళలో.. పాటించిన వాటినే.. ఇప్పుడు తప్పు పట్టటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ పెద్దాయన నోటి నుంచి మాటే రాకుండా వ్యవహరిస్తుంటే.. చిన్నాయన నోటి నుంచి అవసరం ఉన్నా లేకున్నా డైలీ బేసిస్ లో వస్తున్న మాటలతో పార్టీకి ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువగా ఉందంటున్నారు. గులాబీ పార్టీ తండ్రికొడుకుల వ్యవహారాన్ని లోగుట్టుగా ఒక సీనియర్ నేత ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ‘‘పెద్దాయన అనావృష్టి..చిన్నాయన అతివృష్టి. ఈ ఇద్దరి వేరియేషన్స్ తో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది’ అంటూ చెప్పిన మాటలు అక్షర సత్యంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
