సొంతంగా అసెంబ్లీ.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఇలా షాకిస్తుందనుకోలేదు
శాసనసభలో మైకులు కట్ చేశారు.. సస్పెన్షన్ ఆర్డర్లు చేతిలో పెట్టారు.. ‘పో పోయి బయట కూర్చో’ అని పంపేశారు.
By: A.N.Kumar | 12 Sept 2026 12:12 PM ISTశాసనసభలో మైకులు కట్ చేశారు.. సస్పెన్షన్ ఆర్డర్లు చేతిలో పెట్టారు.. ‘పో పోయి బయట కూర్చో’ అని పంపేశారు. మరి దానికి బిఆర్‌ఎస్ ఊరుకుంటుందా? "మీరు అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే ఏంది భాయ్ మేమే ఓ సీరియల్ సెట్టింగ్ వేసి సొంతంగా అసెంబ్లీ నడిపిస్తాం" అంటూ తెలంగాణ భవన్‌లో ఏకంగా ‘మాక్ అసెంబ్లీ’ షురూ చేశారు.
ఒకవైపు కాంగ్రెస్ దెబ్బకు నిజమైన అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఇంకోవైపు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు కౌంటర్ సినిమా లెవల్లో సెట్టింగ్స్ వేసేశారు. అసెంబ్లీ స్టైల్‌లోనే స్పీకర్ చైర్, మైకులు, బెంచీలు.. చివరికి మనుషులకు కారెక్టర్లు కూడా ఇచ్చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావును తెచ్చి స్పీకర్ కుర్చీలో కూర్చోబెడితే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఏకంగా 'ముఖ్యమంత్రి' ప్రమోషన్ ఇచ్చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ తమకు ఎప్పటినుంచో అలవాటైన 'మంత్రి' పాత్రల్లో జీవించేస్తున్నారు.
అయితే అసలైన ట్విస్ట్ ఏంటంటే.. అసెంబ్లీలో ప్రశ్నించేందుకు సమయం దొరక్క బయటపడ్డ ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. తమ సొంత మాక్ అసెంబ్లీలో 'ప్రతిపక్ష నేత' పాత్రను ఎవరికి ఇస్తుందోనని పాతబస్తీ నుంచి వరంగల్ దాకా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు తమ నిజమైన విపక్ష క్యారెక్టర్లను ఇక్కడ రీ-క్రియేట్ చేస్తూ రేవంత్ సర్కార్ ఆరు గ్యారెంటీలపై సెటైర్ల వర్షం కురిపించేందుకు రెడీ అయ్యారు.
రైతు భరోసా ఎటుపోయింది? రుణమాఫీ ఏమైంది? మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుంది? అంటూ అసలు అసెంబ్లీలో అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ ఈ 'తెలంగాణ భవన్ అసెంబ్లీ'లో స్క్రిప్ట్ రాసుకుని మరీ రిహార్సల్స్ చేస్తున్నారు. సెక్షన్ 22A నుంచి నిరుద్యోగ భృతి దాకా కాంగ్రెస్‌ను పిండి పిప్పి చేసేందుకు రోల్-ప్లే డ్రామా అదిరిపోయేలా ప్లాన్ చేశారు.
ఏది ఏమైనా "మీరు మైకులు బంద్ చేస్తే.. మేము కొత్త మైకులు కొనుక్కుని మరీ సెట్ వేస్తాం" అని బీఆర్‌ఎస్ చూపించిన ఈ క్రియేటివిటీకి పొలిటికల్ సర్కిల్స్‌లో కామెంట్లు బాగానే పేలుతున్నాయి. ఈ డ్రామా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే సెగ తగిలిస్తుందో లేక కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడానికి పరిమితమవుతుందో చూడాలి.
