Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ధీమా చాలానే సుమా !

బీఆర్ఎస్ తప్పుడు వార్తలను వండి వారుస్తోందని వాటిని ఎవరూ నమ్మరాదని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు.

By:  Satya P   |   27 Oct 2025 2:00 AM IST
బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ధీమా చాలానే సుమా !
X

రాజకీయాల్లో ఫలానా పార్టీని క్లోజ్ చేస్తాం, వారి రాజకీయానికి ఇదే చివరి అంకం. ఇక కధ సరి, ఆ చాప్టర్ ఇక ఎండ్ ఇలా చాలా అంటూంటారు, జనాలు వింటూంటారు. అనేది ప్రత్యర్ధులు, అయితే ఎవరికి అంతం చేయాలో ఓటర్లు అనబడే జనాల చేతిలో ఉంటుంది. ప్రజలు కూడా నచ్చని పార్టీలకు ఒక అయిదేళ్ళకూ పదేళ్ళలో పక్కన పెట్టారు అనుకుందాం. అంత మాత్రం చేత క్లోజ్ అయినట్లేనా. కానే కాదని చరిత్ర చెబుతోంది. 14 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే కానీ 10 ఏళ్ళు విపక్షంలో ఉన్న టీడీపీ స్టోరీ కానీ అదే చెబుతోంది. మరి ఇవన్నీ తెలిసి బీఆర్ఎస్ క్లోజ్ అని అంటున్నారు అంటే అది కేవలం ఎన్నికల ప్రచారంలో వ్యూహంలో భాగమే అనుకోవాలా అంటే ముందు ఎవరు అన్నారూ ఏమా మ్యాటర్ అన్నది తెలుసుకోవాలి కదా.

జూబ్లీ తీర్పుతో అలా :

జూబ్లీ హిల్స్ సీటుకు ఉప ఎన్నిక ప్రస్తుతం జరుగుతోంది. అటూ ఇటూ మాటలు తూటాలుగా దూసుకుని వస్తున్నాయి. అధికార కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ మీద గట్టిగానే విమర్శలు చేస్తోంది. తాజాగా సీనియర్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ తీర్పుతో బీఆర్ఎస్ ఇక ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ తీర్పు గులాబీ పార్టీకి గట్టి దెబ్బ అవుతుందని అన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ క్యాడర్ పనిచేస్తే జనాలలో కాంగ్రెస్ గురించి చెబితే అద్భుత విజయం సొంతం అవుతుందని అన్నారు.

చరమగీతమే :

ఒకే ఒక్క ఉప ఎన్నికతో గులాబీ పార్టీకి చరమ గీతం పాడబోతున్నామని తుమ్మల అంటున్నారు. బీఆర్ఎస్ ని రాజకీయంగా సమాధి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురి అయింది అని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ ఎస్ పాలన అంటే అవినీతి అణచివేత అని ఆయన ఫైర్ అయ్యారు మళ్ళీ అలాంటి పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చేది లేదని కూడా అన్నారు.

తప్పుడు వార్తలే :

బీఆర్ఎస్ తప్పుడు వార్తలను వండి వారుస్తోందని వాటిని ఎవరూ నమ్మరాదని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణాను అప్పుల కుప్పగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ చేసింది అని ఆయన విమర్శించారు. ఆ వడ్డీల భారం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మోపారని ఆయన అన్నారు. అయినా సరే సంక్షేమం ఎక్కడా ఆపకుండా తాము పనిచేస్తున్నామని అన్నారు. రానున్న మూడేళ్ళే కాదు మరో అయిదేళ్ళూ కాంగ్రెస్ పార్టీనే జనాలు ఎన్నుకుంటారని బీఆర్ఎస్ వి ఆశలే తప్ప జరిగేది లేదని జనాలు ఆ పార్టీని నెగ్గించేది లేదని మంత్రి ధీమాగా చెప్పారు.

ఉప ఎన్నిక కొలమానమా :

మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ లో గెలుపు ఉత్సాహం కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉంది. సమర్ధుడైన అభ్యర్ధినే బరిలోకి దించారు. సాధారణంగా ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకే ఉప ఎన్నికల్లో పట్టం కడతారు. మరీ తారస్థాయిలో వ్యతిరేకత వస్తే తప్ప అదే జరుగుతుంది. ఇంకో వైపు చూస్తే గట్టిగా రెండేళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి పాలనను జనాలు చూశారు. అందువల్ల ఇంకా చేయాల్సింది ఉంది, జనాలకు ఆ ఆశలు అలాగే ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ గెలవవచ్చు అనుకున్నా బీఆర్ఎస్ కి ఇవే చివరి ఎన్నికలు ఇక్కడితో శాశ్వతంగా క్లోజ్ అంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు. ఉప ఎన్నికలే ప్రమాణం అయితే అక్కడ గెలిచిన పార్టీలు అసలు ఎన్నికల్లో ఓటమి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.