బీఆర్ఎస్ గేట్లు క్లోజ్ అయినట్లేనా ?
2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విసిరిన గాలానికి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిక్కారు.
By: Garuda Media | 8 Sept 2026 9:13 AM IST2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విసిరిన గాలానికి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిక్కారు. అభివృద్ధి కోసమే అధికార పార్టీ జెండా కప్పుకున్నామని, పనులు జరగాలంటే మార్పు తప్పదని బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలు అన్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం, కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ వివిధ దశలలో ఉంది.
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, దండె విఠల్, ప్రభాకర్ రావు, ఎగ్గె మల్లేశం తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరితో పాటు పలువురు మేయర్లు, కార్పోరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు పార్టీలో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారిన అనంతరం సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం విశేషం.
అయితే విచారణ సంధర్భంగా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, బీఆర్ఎస్ పార్టీకి ప్రతినెలా తమ జీతాల నుండి రూ.5 వేలు చెల్లిస్తున్నామని, అలాంటప్పుడు తాము మారినట్లు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వీరందరి అనర్హత అంశం చట్ట పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉంది. అయితే ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే వారు ఎవరు అన్న చర్చ నడుస్తుంది.
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పి తన పరిధిలో ఉన్న మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకున్నాడు. తాజాగా ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశానికి హాజరు కావడంతో బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లే వారు ఎవరు అన్న చర్చ మొదలయింది.
కాంగ్రెస్ పార్టీలో చేరినా నియోజకవర్గానికి నిధులు రావడం లేదని, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశాడు. దానం నాగేందర్ పలు మార్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి పొగిడాడు. అదే సమయంలో ఏకంగా శాసనసభలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక్కడిని కూడా బయట తిరగనివ్వను అని హెచ్చరించాడు. ఇక మరో ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి ఒకసారి శాసనసభలో కేటీఆర్ ను కలవడం చర్చానీయాంశం అయింది. అయినా ఆ తరువాత అలాంటి ప్రయత్నాలు ఏమీ కనిపించ లేదు.
ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి మినహా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరిని పార్టీలోకి తీసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. పార్టీని కష్టకాలంలో వదిలేసయడం పక్కన పెడితే, పార్టీ మారిన తరువాత వారు పార్టీ మీద, కేసీఆర్ మీద చేసిన విమర్శల నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు. ఈ లెక్కన తిరిగి పార్టీలోకి రావాలను వారికి బీఆర్ఎస్ తరపున గేట్లు క్లోజ్ అయినట్లేనని భావించాలి.
