బాబు కావాలి.. బాబు రావాలి.. బలంగా కోరుకుంటున్న బీఆర్ఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీతోపాటు అమరావతికి బులెట్ రైలు, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది.
By: Tupaki Political Desk | 30 Sept 2025 8:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లోకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును లాగాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబును బూచిగా చూపడమే ఏకైక మార్గం.. అదే పాశుపతాస్త్రంగా పనికివస్తుందని భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధనకు.. ఆ తర్వాత రెండు సార్లు అధికారంలోకి రావడానికి చంద్రబాబును వాడుకున్న గులాబీ పార్టీ.. ఇప్పుడు కూడా మరో వ్యూహం లేకుండా ‘చంద్రబాబు’ను మధ్యలోకి తీసుకువచ్చి లాభపడాలని భావిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ వాదనను సమర్థించుకునేందుకు తాజాగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీతోపాటు అమరావతికి బులెట్ రైలు, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంగా పాలకపక్షం తీసుకున్న విధాన నిర్ణయాలను వ్యతిరేకించడం, విమర్శలు గుప్పించడం బీఆర్ఎస్ పార్టీ హక్కుగా చెబుతున్నా.. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా టార్గెట్ చేయడమే చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అభివర్ణిస్తూ ఇద్దరూ లేని ఫ్యూచర్ సిటీ, కట్టని అమరావతిపై ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. అయితే ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి విమర్శలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, ఏపీలో శరవేగంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమైనవిగా అనుమానిస్తున్నారు.
‘కట్టని అమరావతి’ అంటూ జగదీష్ రెడ్డి చేసిన విమర్శ టీడీపీని రెచ్చగొట్టడానికే అన్న సందేహాన్ని రేకెత్తిస్తోంది. జగదీష్ రెడ్డికి కౌంటరుగా టీడీపీ రంగంలోకి దిగితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతుందని బీఆర్ఎస్ విమర్శల దాడి చేసి రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం కావొచ్చని అంటున్నారు. దీనివల్ల తెలంగాణలో తమ పార్టీ ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల ద్రుష్టిని మళ్లించి, మళ్లీ తెలంగాణ వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నారని, ఆయన పెద్దరికం ఏంటని ప్రజలలో సమసిపోయిన భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్లాన్ కూడా ఉండి ఉండవచ్చని పరిశీలకులకు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అవినీతి జరిగిందని విచారణ కమిషన్లు నియమిస్తూ అరెస్టు చేయిస్తామని బెదిరిస్తుండగా, బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక తెలంగాణ భావోద్వేగం సమసిపోవడం, గత పదేళ్లలో చోటుచేసుకున్న వ్యవహారాల వల్ల బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహం గందరగోళంగా కనిపిస్తోందని అంటున్నారు. దీంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అయితే తమకు సరైన రాజకీయ అస్త్రం లభించినట్లేనని బీఆర్ఎస్ నేతలు కాచుకుకూర్చున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ సారి తెలంగాణ రాజకీయాలపై ఆచితూచి అడుగు లేస్తున్నారు.
ఏపీలో బీజేపీతో పొత్తు, కేంద్రంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణకు వచ్చేసరికి స్థానిక బీజేపీ నేతలతో అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ కూడా చంద్రబాబు జోక్యాన్ని కోరుకోవడం లేదు. దీనికి కారణం బీఆర్ఎస్ కు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకూడదనే ఆలోచనే అంటున్నారు. ఇదే సమయంలో తనకు అత్యంత సన్నిహితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చే పరిస్థితి కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
