ఆ రిపోర్టు సభకు రాకుండా అడ్డుకోండి: హైకోర్టుకు బీఆర్ఎస్
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.
By: Garuda Media | 30 Aug 2025 4:42 PM ISTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు, మేడిగడ్డ, సుందుళ్ల వంటి రిజర్వాయర్లపై చర్చకు అధికార పక్షం రెడీ అయింది. దీనికి సంబంధించి విచారణ చేయించిన పీసీ ఘోష్ నివేదికను కూడా సభలో ప్రవేశ పెట్టనున్నారు.
ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో ఈ నివేదికను సభలో ప్రవేశ పెట్టిచర్చిస్తామన్నారు. ఈ చర్చకు మాజీ సీఎం కేసీఆర్ కూడా రావాలని అన్నారు. అయితే.. గతంలోనే ఈ నివేదికను, కమిషన్‌ను కూడా రద్దు చేయాలని కోరుతూ.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులు.. హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అసలు దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు.. తాము ఎలా స్పందిస్తామని హైకోర్టు దీనిపై విచారణను వాయిదా వేసింది.
మరోవైపు .. శనివారం ప్రారంభమైన సమావేశాల్లో ఈ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టేం దుకు రెడీ అయిందన్న సమాచారంతో హుటాహుటిన ఉదయం 9 గంటలకే.. బీఆర్ ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. రెండుకీలక అంశాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని ఆధారంగా తమకు ఉపశమని కల్పించాలని హరీష్ రావుపేరుతో దాఖలైన పిటిషన్‌లో తెలిపారు.
1) ఈ నివేదికను రద్దు చేయడం.(గతంలోనే పిటిషన్ వేశారు. మరోసారి కూడా అభ్యర్థించారు.)
2) తాజాగా ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో ఈ నివేదికను సభలో ప్రవేశ పెట్టకుండా అడ్డుకోవడం.
ఇది కొత్త విషయం. దీనికి సంబంధించి తాజాగా పిటిషన్‌ను దాఖలు చేయగా.. రిజిస్ట్రీ దీనికి నెంబరు కేటాయించాల్సి ఉంది. ఇది విచారణకు వచ్చే లోపు.. సభలో ప్రభుత్వం నివేదికను ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
