2025: బీఆర్ఎస్‌కు కలిసి వచ్చిందా?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వచ్చిందా? ఈ ఏడాది ఆ పార్టీకి ఏమైనా చెప్పుకోదగిన పరిస్థితులు ఏర్పడ్డాయా? అంటే.. లేదనే సమాధానమే వినిపిస్తుంది.
By: Garuda Media | 27 Dec 2025 10:00 PM ISTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ పార్టీకి 2025 కలిసి వచ్చిందా? ఈ ఏడాది ఆ పార్టీకి ఏమైనా చెప్పుకోదగిన పరిస్థితులు ఏర్పడ్డాయా? అంటే.. లేదనే సమాధానమే వినిపిస్తుంది. అనేక విషయాల్లో పార్టీ ఇరుకున పడింది. ముఖ్యంగా కీలకమైన రెండుకేసులు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను వెంటాడాయి. అదేవిధంగా పార్టీలో ముసలం పుట్టి.. కేసీఆర్ కుమార్తె.. ఆ పార్టీ కీలక నాయకురాలు.. కవిత పార్టీకి, కేసీఆర్ ఇంటికి కూడా దూరమయ్యారు. కంట్లో నలుసుగా కూడా మారిపోయారు. ఇక, రెండు ప్రధాన ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ను పార్టీ చేజార్చుకుంది. పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే ఫర్వాలేదన్నట్టుగా పరువు నిలబెట్టుకుంది.
పార్టీ పరంగా.. చూస్తే.. 2025 బీఆర్ ఎస్‌కు కష్టాలు కౌగిలించుకున్నాయనే చెప్పాలి. పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు 10 మందిలో నలుగురు ఈ ఏడాదే జంప్ చేశారు. మిగిలిన వారు గత ఏడాది వెళ్లిపోయారు. ఇక, వీరిపై న్యాయ పోరాటం కొన సాగుతోంది. ఇక, అన్నింటికన్న పెద్ద దెబ్బ కేసీఆర్ కుమార్తె కవిత రెబల్‌గా మారడం. పార్టీ నుంచి బయటకు రావడంతోపాటు.. పదేళ్ల పాలనపై విచారణ చేయిస్తానని హెచ్చరించడం.. తాను ఎప్పటికైనా సీఎం అయితే.. విచారణ తప్పదని చెప్పడంవంటివి కీలక అంశాలు. అంతేకాదు.. సొంత కుటుంబానికి చెందిన హరీష్‌రావును ఆమె కార్నర్ చేయడం మరోవిశేషం.
వ్యక్తిగతంగా కేసీఆర్ పాలిటిక్స్ విషయానికి వస్తే.. ఆయనకు కూడా ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. కేవలం ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. 2025-26 బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఒకసారి మాత్రమే సభకు వచ్చారు. తర్వాత తన మొహం కూడా అసెంబ్లీకి చూపలేక పోయారు. ఇక, జల వివాదాల నేపథ్యంలో నల్లగొండలో సభకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత.. మళ్లీ కేసీఆర్ ఆచూకీ ప్రజల్లో ఎక్కడా కనిపించలేదు. కేవలం ఫామ్ హౌస్ నుంచే పార్టీని నడిపించారు. అదేసమయంలో సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్‌ను తిరిగి గెలుచుకోవాలని అనుకున్నా.. అది కూడా తెలంగాణ సాధకుడికి సాధ్యపడలేదు.
కేసులు.. ఈవిషయానికి వస్తే.. కేసీఆర్, కేటీఆర్‌లను కేసులు చుట్టుముట్టాయి. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనిఆరోపించిన ప్రభుత్వం వీటిపై విచారణకు సిద్ధమైంది. ఈ క్రమంలో సీపీ ఘోష్ కేసీఆర్‌ను విచారించారు. ఇక, ఫార్ములా -ఈరేస్ వ్యవహారంలో ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని.. అక్రమంగా కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు కేటీఆర్‌ను చుట్టుముట్టాయి. మరోవైపు.. సొంత నేతలు వెళ్లిపోయారు. ఇంకోవైపు ప్రభుత్వం నుంచి బలమైన విమర్శలు కూడా వచ్చాయి. ఎలా చూసుకున్నా.. బీఆర్ ఎస్‌కు 2025 అంత సజావుగా అయితే సాగలేదన్నదివాస్తవం.
