యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్‌పై సంచలన నివేదిక!
యునైటెడ్ కింగ్‌డమ్‌లో గత కొన్ని దశాబ్దాలుగా సంచలనం సృష్టించిన గ్రూమింగ్ గ్యాంగ్స్ వ్యవహారం మరోసారి జాతీయ చర్చకు దారితీసింది.
By: A.N.Kumar | 20 Jun 2026 5:00 PM ISTయునైటెడ్ కింగ్‌డమ్‌లో గత కొన్ని దశాబ్దాలుగా సంచలనం సృష్టించిన గ్రూమింగ్ గ్యాంగ్స్ వ్యవహారం మరోసారి జాతీయ చర్చకు దారితీసింది. ఎంపీ రూపర్ట్ లోవ్ అధ్యక్షతన బాధితుల అనుభవాలు, మీడియా కథనాలు, గత విచారణలు, విజిల్‌బ్లోయర్ల వాంగ్మూలాల ఆధారంగా రూపొందించిన స్వతంత్ర విచారణ నివేదిక తాజాగా వెలువడింది. మొత్తం 219 పేజీల ఈ నివేదికలో బ్రిటన్‌లో దశాబ్దాల పాటు బాలికలపై సంఘటిత లైంగిక దోపిడీ జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేయబడాయి.
నివేదిక ప్రకారం.. చాలా చాలా మంది బాలికలు ఈ నేరాలకు బలైనట్లు అంచనా వేయబడింది. బాధితుల్లో అత్యధికులు శ్వేతజాతికి చెందిన మైనర్ బాలికలేనని.. వారిని మోసం చేసి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి, లైంగికంగా వేధించి కొన్నిసార్లు మానవ అక్రమ రవాణాకు కూడా గురిచేసినట్లు పేర్కొంది. ఈ సంఘటనలు యూకేలోని అనేక ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగాయని నివేదిక వెల్లడించింది.
నిందితుల వివరాలపై కూడా నివేదిక పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూపులుగా జరిగిన చిన్నారుల లైంగిక దోపిడీ కేసుల్లో శిక్ష పడిన వారిలో అధిక శాతం పాకిస్తానీ మూలాలున్న పురుషులేనని నివేదిక పేర్కొంది. అయితే ఈ గణాంకాలు నివేదిక రచయితల విశ్లేషణ ఆధారంగా వెల్లడించబడినవే. ఈ అంశంపై గతంలో కూడా యూకేలో తీవ్ర రాజకీయ, సామాజిక చర్చలు జరిగాయి.
ఈ వ్యవహారంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమని నివేదిక విమర్శించింది. పోలీసులు, స్థానిక కౌన్సిళ్లు, సామాజిక సేవా సంస్థలు, ఆరోగ్య శాఖ, పాఠశాలలు, ప్రాసిక్యూషన్ వ్యవస్థలు అనేక సందర్భాల్లో బాధితుల ఫిర్యాదులను సరిగా పట్టించుకోలేదని ఆరోపించింది. కొన్నిసార్లు బాధితులనే తప్పుబట్టడం, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం, ఆధారాలను సరిగా సేకరించకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
నివేదికలో మరో వివాదాస్పద అంశం మతపరమైన ప్రేరణలపై చేసిన వ్యాఖ్యలు. కొంతమంది నిందితులు తమ చర్యలకు మతపరమైన భావజాలాన్ని ఆధారంగా చూపినట్లు బాధితుల వాంగ్మూలాల్లో పేర్కొన్నప్పటికీ ఈ విశ్లేషణను అందరూ అంగీకరించడం లేదు. విమర్శకులు వ్యక్తుల నేరాలను మొత్తం ఒక మతానికి ఆపాదించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
గతంలో రోదర్‌హామ్, టెల్‌ఫోర్డ్ వంటి ప్రాంతాల్లో జరిగిన అధికారిక విచారణలు కూడా వేలాది మంది బాలికలు లైంగిక దోపిడీకి గురైనట్లు నిర్ధారించాయి. తాజా నివేదిక ఈ ఘటనల పరిమాణం ఇప్పటివరకు భావించిన దానికంటే మరింత పెద్దదిగా ఉండొచ్చని పేర్కొంటూ పూర్తి స్థాయి పారదర్శక విచారణ, బాధ్యులపై కఠిన చర్యలు, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
అయితే ఈ నివేదిక ఒక స్వతంత్ర విచారణ కమిటీ రూపొందించినదే గానీ యూకే ప్రభుత్వ అధికారిక తుది నివేదిక కాదని గుర్తుంచుకోవాలి. ఇందులోని పలు వ్యాఖ్యలు, ముఖ్యంగా మతపరమైన ఉద్దేశాలు, గణాంకాలపై చేసిన విశ్లేషణలు ప్రస్తుతం యూకే రాజకీయాల్లో, సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
