మరో ఇండోర్ ఘటన: ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపించేసింది..
కళ్ల నిండా కోటి ఆశలు... అంగరంగ వైభవంగా జరగబోయే పెళ్లి వేడుక... జీవితాంతం తోడుంటానని నమ్మించిన మనుషులు.
By: A.N.Kumar | 24 Jun 2026 10:41 AM ISTకళ్ల నిండా కోటి ఆశలు... అంగరంగ వైభవంగా జరగబోయే పెళ్లి వేడుక... జీవితాంతం తోడుంటానని నమ్మించిన మనుషులు. కానీ ఆ రంగుల కలల వెనుక ఒక నల్లని కుట్ర దాగి ఉంటుందని.. నమ్ముకున్న ప్రాణాన్నే బలితీసుకుంటుందని ఆ యువకుడు ఊహించలేకపోయాడు. ఒకవైపు కోట్ల రూపాయల ఆస్తి, మరోవైపు విలాసవంతమైన జీవితం వేచి చూస్తున్నా... మనసులోని స్వార్థం, ప్రియుడిపై ఉన్న గుడ్డి ప్రేమ ఓ యువ వ్యాపారవేత్తను కనుమరుగయ్యేలా చేశాయి. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘోరం, సమాజంలో మనుషుల మధ్య నమ్మకం ఎంత ప్రమాదకరంగా మారుతోందో ప్రతిబింబిస్తోంది.
ఆనందం వెనుక దాగిన మృత్యుపాశం
పుణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జీవితం ఎందరికో ఆదర్శం. సియా గోయెల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగినప్పుడు ఆ రెండు కుటుంబాల ఆనందానికి అవధులు లేవు. నవంబర్ 17న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రూ.17 కోట్ల భారీ వ్యయంతో హెలికాప్టర్ల హంగులతో ఒక విలాసవంతమైన ప్యాలెస్‌లో వివాహం జరగాల్సి ఉంది. అందరికీ అది ఒక కలల పెళ్లిలా కనిపించింది. కానీ కేతన్ పాలిట అది మృత్యుపాశంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. సియాకు అప్పటికే మరో యువకుడితో ఉన్న ప్రేమ సంబంధం, ఈ పెళ్లి పట్ల ఆమెకున్న అయిష్టం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకునేలా చేశాయి.
లోయలోకి తోసేసిన ‘ప్రేమ’... ప్రమాదంగా సృష్టించిన నాటకం
పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లిన సియా, అక్కడ తన ప్రియుడితో కలిసి రాక్షసత్వానికి ఒడిగట్టింది. నమ్మకంగా పక్కనే నిల్చున్న కాబోయే భర్తను, ముందస్తు ప్రణాళిక ప్రకారం లోతైన లోయలోకి తోసేసింది. అంతటితో ఆగక "ఫొటోలు తీస్తుండగా బలమైన గాలికి కేతన్ జారి పడ్డాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ నటనకు తెరతీసింది. కానీ పాపం పండింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులను పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. ప్రేమ పేరిట జరిగిన ఈ దారుణ నమ్మకద్రోహం చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.
ప్రశ్నార్థకంగా మారుతున్న బంధాల విలువ
గతంలో మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు తరహాలోనే ఇప్పుడు పుణే ఘటన కూడా సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒకప్పుడు పెళ్లయిన తర్వాత వచ్చే మనస్పర్థల వల్ల నేరాలు జరిగేవి. కానీ ఇప్పుడు వివాహానికి ముందే భాగస్వామిని ఒక అడ్డంకిగా భావించి ప్రాణాలు తీసేంతగా మనుషులు దిగజారిపోతున్నారు.
నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది... కానీ దాచితే అది ప్రాణాంతకమవుతుంది. ఒక సంబంధం ఇష్టం లేనప్పుడు దాన్ని ముందే చెప్పేసి తప్పుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ నిజాలను దాచిపెట్టి, నమ్మకాన్ని నట్టేట ముంచి హత్య వంటి ఘోరానికి పాల్పడటం వల్ల ఇరు కుటుంబాల జీవితాలు శాశ్వతంగా చీకట్లోకి వెళ్లిపోతాయి.
డబ్బుతో అన్నింటినీ కొనవచ్చు కానీ మనసును, నమ్మకాన్ని కొనలేరనే నిజాన్ని ఈ ఘటన నిరూపించింది. ప్రేమ, వివాహం, నమ్మకం అనే పవిత్రమైన పదాల విలువను ఈ దారుణం మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది. ఒకరి స్వార్థం కోసం ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడం.. ఆ కుటుంబానికి ఎప్పటికీ తీరని శోకాన్ని మిగిల్చింది.
