Begin typing your search above and press return to search.

బ్రిక్స్ తర్వాత గ్లోబల్ పవర్ ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి?

భారత్, చైనా, రష్యాలతో పాటు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.

By:  A.N.Kumar   |   17 Sept 2026 8:13 AM IST
బ్రిక్స్ తర్వాత గ్లోబల్ పవర్ ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి?
X

న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసిన తర్వాత అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులలో ఒక ప్రధానమైన చర్చ ప్రారంభమైంది. ప్రపంచం కేవలం ఒకే ఒక్క అగ్రరాజ్యం అమెరికా లేదా ఒకే కూటమి కేంద్రంగా నడిచే కాలం ముగిసిపోతోందా అనే ప్రశ్న ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. ఈ సదస్సును కేవలం ఒక రొటీన్ రాజకీయ సమావేశంగా కాకుండా గ్లోబల్ సౌత్ దేశాలు తమ ఆర్థిక ప్రాధాన్యతలను.. అంతర్జాతీయ వ్యవస్థలలో మార్పుల అవసరాన్ని నొక్కి చెప్పిన చారిత్రక ఘట్టంగా చూడవలసి ఉంటుంది.

ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో పదకొండు పూర్తి స్థాయి సభ్యదేశాలు ఉన్నాయి. భారత్, చైనా, రష్యాలతో పాటు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ విస్తరణతో ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా ప్రాంతాలకు బలమైన ప్రాతినిధ్యం లభించింది. పాశ్చాత్య మీడియా దీనిని అమెరికా లేదా ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడిన వేదికగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవానికి ఇది ప్రత్యామ్నాయ సమన్వయ వేదిక మాత్రమే. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ సమానత్వాన్ని , ఆర్థిక సంక్షేమాన్ని కోరుకునే ఒక వేదికగా ఇది పనిచేస్తోంది.

ప్రపంచ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఆధిపత్యం చెలాయించిన జీ7 కూటమితో పోలిస్తే బ్రిక్స్ శక్తి సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ జనాభాలో సగానికి దగ్గరగా ఉన్న జనాభాతో పాటు.. ప్రపంచ క్రూడ్ ఆయిల్ ఉత్పాదకతలో అత్యంత కీలకమైన వాటా ప్రస్తుతం బ్రిక్స్ సభ్యదేశాల వద్దే ఉంది. చైనా , భారత్ రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాలు ఈ కూటమిలో ఉన్నాయి. నామినల్ జీడీపీ ప్రాతిపదికన డాలర్ విలువ ప్రకారం ఇప్పటికీ జీ7 ఆర్థిక వ్యవస్థల విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు శక్తి ప్రాతిపదికన అంటే పర్చసింగ్ పవర్ పారిటీ ప్రకారం చూస్తే బ్రిక్స్ కూటమి ఇప్పటికే జీ7ను దాటేసింది.

ఈ కూటమిలో చైనా అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు న్యూఢిల్లీకి రావడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహించే క్రమంలో భారతదేశం తన స్థానాన్ని మరింత బలపరుచుకోగా చైనాకు కూడా ఇది తన దౌత్య మార్గాలను విస్తరించుకోవడానికి దోహదపడింది. అయితే చైనాతో సరిహద్దు వివాదాలు , వాణిజ్య లోటు ఉన్నప్పటికీ బ్రిక్స్ ను కేవలం చైనా లేదా రష్యాల ప్రాపగండా వేదికగా మారకుండా నిరోధించడంలో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది.

భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటోంది. భారత్ బ్రిక్స్ లో క్రియాశీలకంగా ఉంటూనే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ , భద్రత కోసం క్వాడ్ కూటమిలో భాగస్వామిగా ఉంది. పాశ్చాత్య దేశాలతో బలమైన రక్షణ, నూతన సాంకేతిక ఒప్పందాలు కలిగి ఉంటూనే రష్యాతో చారిత్రక మిత్రత్వాన్ని నిలుపుకుంటోంది. అందువల్ల భారత్ చైనా క్యాంప్‌లోకి వెళ్తోందనే ముగింపుకు రావడం సరైనది కాదు. భారత్-చైనా సంబంధాల పురోగతిపైనే బ్రిక్స్ భవిష్యత్ దిశ ఆధారపడి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

డాలర్ ఆధిపత్యం , ప్రత్యామ్నాయ చెల్లింపుల విషయానికి వస్తే, న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రధానంగా స్థానిక కరెన్సీల వాడకానికే ప్రాధాన్యత ఇచ్చింది. సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సొంత కరెన్సీల్లో పూర్తి చేయడం.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థల్లో అనుసంధానత పెంచడంపై ఒప్పందాలు కుదిరాయి. అయితే దీనిని బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీగా భావించలేము ఎందుకంటే అటువంటి కరెన్సీపై ఎటువంటి ఒప్పందం జరగలేదు. ఇది అమెరికన్ డాలర్‌కు తక్షణ ప్రత్యామ్నాయం కానప్పటికీ లావాదేవీల వ్యయాన్ని తగ్గించే ఒక ఆచరణాత్మక విధానం మాత్రమే. స్థానిక కరెన్సీ వాణిజ్యంతో భారత్‌కు రూపాయి ప్రాచుర్యం పెరుగుతున్నప్పటికీ చైనా యువాన్ ప్రభావం పెరగకుండా భారత్ జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ వంటి సంస్థల ద్వారా బ్రిక్స్ ప్రత్యామ్నాయ అభివృద్ధి నిధులను అందుబాటులోకి తెస్తోంది. ఐఎంఎఫ్ లేదా వరల్డ్ బ్యాంక్ మాదిరిగా కఠినమైన రాజకీయ నిబంధనలు లేకుండా స్థానిక కరెన్సీలలో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం దీని ప్రత్యేకత. అయితే బ్రిక్స్ ప్రస్తుత గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌ను పూర్తిగా రద్దు చేసి కొత్త వ్యవస్థను సృష్టించడం లేదు. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ , డబ్ల్యూటీఓ వంటి అంతర్జాతీయ నిర్ణయాధికార సంస్థలలో గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కావాలని మాత్రమే ఒత్తిడి తెస్తోంది.

ప్రస్తుతం అమెరికా వంటి దేశాలు విధిస్తున్న ఏకపక్ష సుంకాలు, ప్రొటెక్షనిజం వల్ల ప్రపంచ వాణిజ్యం విచ్ఛిన్నమవుతోంది. దీనివల్ల బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి మధ్యప్రాచ్య దేశాల చేరికతో ఈ గ్రూపింగ్ కేవలం ఆర్థిక కూటమిగానే కాక, భౌగోళిక-రాజకీయ సమస్యలపై స్పందించే వేదికగా రూపాంతరం చెందుతోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై దౌత్యం, చర్చల ద్వారా శాంతి సాధ్యమని డిక్లరేషన్‌లో స్పష్టం చేశారు.

బ్రిక్స్ లో భారత్-చైనా పోటీ, రష్యా-పాశ్చాత్య దేశాల శత్రుత్వం, సౌదీ-అమెరికా భద్రతా సంబంధాల వంటి తీవ్రమైన అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ప్రయోజనాల కోసం దేశాలు ఏకమై ఒక ప్రకటనను విడుదల చేయగలగడమే ఈ కూటమి విజయం. ప్రపంచం ఏక-ధ్రువ వ్యవస్థ నుంచి బహుళ-ధ్రువ వ్యవస్థ వైపు వేగంగా పయనిస్తోందనడానికి ఇవే ఆధారాలు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క దేశం ప్రపంచాన్ని నియంత్రించలేదని, బహుళ-ధ్రువ వ్యవస్థలోనే ప్రపంచ ఆర్థిక మరియు రాజకీయ సమతుల్యత సాధ్యమవుతుందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.