యూఎస్ డాలర్ కు ఇలా చెక్ పెట్టబోతున్నారా.. ఏమిటీ బ్రిక్స్+ కరెన్సీ!
అవును... ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూఎస్ డాలర్ ఆధిపత్యం చెలాయిస్తుందనే సంగతి తెలిసిందే. ఇది మొత్తం కరెన్సీ వ్యాపారంలో సుమారు 89 శాతం వాటా కలిగి ఉంది.
By: Raja Ch | 23 Jan 2026 1:00 AM ISTఅమెరికా ఆధిపత్యానికి ఏ విధంగా చెక్ పెడదామా అని చైనా, రష్యా నిత్యం ఆలోచిస్తాయనే సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో.. తమపై పెత్తన చేయకుండా అమెరికాను ఎప్పటికప్పుడు కట్టడి చేసే దిశగా మిగిలిన దేశాలు ఆలోచిస్తుంటుందని అంటారు!! ఈ క్రమంలోనే.. బ్రిక్స్ సభ్య దేశాలు.. అమెరికా డాలర్ ప్రత్యామ్నాయంగా 'యూనిట్' అని పిలువబడే కరెన్సీని సృష్టించే ఆలోచనలు చేశాయి. దీంతో.. అసలు ఏమిటీ కరెన్సీ, ఎలా పని చేస్తుంది, ఏయే దేశాలు ఇందులో ఉన్నాయి.. ఇది సాధ్యమేనా.. మొదలైన విషయాలు ఆసక్తిగా మారాయి.
అవును... ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూఎస్ డాలర్ ఆధిపత్యం చెలాయిస్తుందనే సంగతి తెలిసిందే. ఇది మొత్తం కరెన్సీ వ్యాపారంలో సుమారు 89 శాతం వాటా కలిగి ఉంది. ఈ క్రమంలో... సాంప్రదాయకంగా సుమారు 100 శాతం చమురు వ్యాపారం అమెరికా డాలర్లలోనే నిర్వహించబడుతుండగా.. 2023లో చమురు వ్యాపారంలో ఐదవ వంతు మాత్రం యూఎస్ డాలర్ కాని కరెన్సీలను ఉపయోగించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో 2024 బ్రిక్స్ సమిట్ లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నుంచి ఓ ఆసక్తికర విషయం వెలువడింది.
ఇందులో భాగంగా... ఆ సమ్మిట్ పుతిన్ వేదికపై కనిపించినప్పుడు, బ్రిక్స్ బ్యాంకు నోటు నమూనాగా కనిపించే దానిని పట్టుకుని కనిపించారు. దీంతో... యూఎస్ డాలర్ ఆధిపత్యం నుండి వైదొలగడం నిజంగా తారాస్థాయికి చేరుకుంది. అయితే, త్వరలోనే ఆయన వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా స్పష్టతతో కూడిన వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా... తాము డాలర్ ను తిరస్కరించడం లేదని.. దానితో పోరాడడం లేదని.. కానీ వారు మమ్మల్ని దానితో పని చేయనివ్వకపోయినప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల కోసం వెతకాలి కదా అన్నారు!
అయితే... 2025లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో మరోసారి ఈ కొత్త కరెన్సీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతల నుంచి ఏమైనా హింట్ వస్తుందా అని అంతా భావించారు. కానీ.. ఈ సమ్మిట్ కు పుతిన్ తో పాటుచైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ హాజరు కాలేదు. దీంతో.. బ్రిక్స్ కరెన్సీపై చర్చ సైలంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఢిల్లీలో జరగబోయే ఈ సమ్మిట్ లో కొత్త కరెన్సీపై ఎలాంటి చర్చ జరగనుందనేది ఆసక్తిగా మారింది.!
మార్చి 2025లో లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. డాలర్ ను భర్తీ చేయడానికి తమ వైపు నుండి ఎటువంటి విధానం లేదని తాను భావిస్తున్నానని.. రిజర్వ్ కరెన్సీగా డాలర్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూలమని.. ప్రస్తుతం ప్రపంచంలో మనం కోరుకునేది మరింత ఆర్థిక స్థిరత్వమని.. దీనిపై ఏకీకృత బ్రిక్స్ స్థానం ఉందని తాను అనుకోనని.. బ్రిక్స్ సభ్యులు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నందున ఈ విషయంపై చాలా విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
కాగా... తొలుత 'బ్రిక్' లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు సభ్యులుగా ఉండగా.. 2010లో సౌతాఫ్రికా కూడా చేరిన తర్వాత ఇది కాస్తా 'బ్రిక్స్' అయ్యింది. ఈ క్రమంలో 2023 లో జరిగిన సమ్మిట్ లో మరో ఆరు దేశాలు (ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) బ్రిక్స్ సభ్యులుగా చేరడానికి ఆహ్వానించబడ్డాయి. దీంతో ఇప్పుడు దీన్ని 'బ్రిక్స్+' అని అంటున్నారు! వారు తమ సొంత ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరుచుకుంటూ.. అమెరికా డాలర్, యూరోలపై ప్రపంచవ్యాప్తంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు!
