ప్రపంచ నేతల ‘కడుపు నింపేలా’ భారత్ ‘అతిథి దేవోభవ’ రుచి!
అదే భారతీయ ఆహార సంస్కృతి. ప్రపంచ దేశాల నేతలకు భారత్ తన దౌత్య శక్తిని మాత్రమే కాదు.. తన వంటింటి వైవిధ్యాన్ని కూడా పరిచయం చేస్తోంది.
By: A.N.Kumar | 11 Sept 2026 9:50 PM ISTఅంతర్జాతీయ వేదికలపై దేశాల మధ్య జరిగే చర్చలు సాధారణంగా రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, భద్రత, వాణిజ్యం చుట్టూనే తిరుగుతాయి. కానీ ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మరో అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే భారతీయ ఆహార సంస్కృతి. ప్రపంచ దేశాల నేతలకు భారత్ తన దౌత్య శక్తిని మాత్రమే కాదు.. తన వంటింటి వైవిధ్యాన్ని కూడా పరిచయం చేస్తోంది.
భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ.. విదేశీ ప్రతినిధుల కోసం ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లు ప్రత్యేక మెనూలను సిద్ధం చేశాయి. ఒక్కో వంటకం వెనుక ఒక్కో ప్రాంతపు చరిత్ర, సంప్రదాయం, వంట విధానం ఉండేలా చెఫ్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈసారి బ్రిక్స్ విందు ఒక సాధారణ అధికారిక భోజనం కాకుండా.. భారతదేశపు పాక పర్యటనలా మారుతోంది.
ఒక ప్లేట్‌లో ఆరు ప్రాంతాలు
ప్రపంచ నేతలకు భారతీయ రుచులను పరిచయం చేసేందుకు ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్ ప్రత్యేకంగా ‘ట్రెడిషన్ టు టేబుల్’ అనే కాన్సెప్ట్‌ను రూపొందించింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయ చిరుతిళ్లను ఒకే మెనూలోకి తీసుకొచ్చింది.
కాశ్మీర్ నుంచి మసాలా వాల్‌నట్స్, పాత ఢిల్లీ నుంచి పిండి జీడిపప్పు, రాజస్థాన్ నుంచి మినీ కచోరీలు, బెంగాల్ నుంచి కుచో నిమ్కి, మహారాష్ట్ర నుంచి భాకర్వాడి, తమిళనాడు నుంచి మురుక్కు.. ఇలా ఆరు ప్రాంతాల రుచులు విదేశీ అతిథుల టేబుల్‌పై దర్శనమివ్వనున్నాయి. ఇక్కడ ప్రత్యేకత కేవలం వంటకాల పేర్లలో లేదు. ప్రతి ప్రాంతానికి చెందిన రుచి, పదార్థాలు, తయారీ విధానం, స్థానిక సంప్రదాయాన్ని విదేశీ అతిథులు అనుభవించేలా మెనూను రూపొందించడం విశేషం.
అమ్మ చేతి వంట స్ఫూర్తితో..
తాజ్ చెఫ్స్ రూపొందించిన ఈ ప్రత్యేక మెనూలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. కొన్ని వంటకాల వెనుక చెఫ్స్ తమ తల్లుల వంటల నుంచి పొందిన స్ఫూర్తి ఉంది. అంటే ప్రపంచ స్థాయి నాయకుల కోసం సిద్ధమవుతున్న ఈ విందులో అత్యాధునిక హోటల్ కిచెన్‌తో పాటు భారతీయ కుటుంబ వంటింటి జ్ఞాపకాలు కూడా భాగమవుతున్నాయి. అందుకే ఈ విందును కేవలం ఆహారంగా కాకుండా.. భారతీయ ఆతిథ్యానికి ప్రతీకగా చూడొచ్చు.
లలిత్ మెనూలో లక్నో నుంచి జపాన్ వరకు..
మరోవైపు ది లలిత్ హోటల్ కూడా బ్రిక్స్ ప్రతినిధుల కోసం ప్రత్యేక వంటకాలతో సిద్ధమైంది. భారతీయ పాక సంప్రదాయానికి చెందిన గలౌటి కబాబ్‌లు, తందూరి రోటీలు, చిరుధాన్యాలతో రూపొందించిన వంటకాలు మెనూలో చోటు చేసుకున్నాయి. అంతేకాదు.. భారతీయ రుచులకు అంతర్జాతీయ ఫ్లేవర్లను జోడిస్తూ చెఫ్ ప్రత్యేకంగా కొన్ని వంటకాలను ఎంపిక చేశారు. మిసో పేస్ట్‌తో వండిన వంకాయ, తక్కువ మంటపై సిద్ధం చేసిన చైనీస్ క్యాబేజీ, అంబర్ సాస్‌తో కూడిన జపనీస్ తరహా కిడ్నీ బీన్స్ వంటి వంటకాలు కూడా ఈ మెనూలో భాగమయ్యాయి. ఇలా చూస్తే లలిత్ మెనూ భారతీయ సంప్రదాయ రుచులతో పాటు ఆసియా పాక సంస్కృతుల కలయికను కూడా ప్రతిబింబిస్తోంది.
దౌత్యానికి మరో రూపం.. డిన్నర్ టేబుల్!
అంతర్జాతీయ సదస్సుల్లో విందులు కేవలం భోజన కార్యక్రమాలు కావు. ఒక దేశం తన సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం కూడా. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ అదే అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు.. పాత ఢిల్లీ నుంచి రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్ర వరకు.. భారతదేశంలోని భిన్న ప్రాంతాల రుచులను ప్రపంచ నేతల ముందుంచడం ద్వారా ‘ఒకే దేశం.. ఎన్నో రుచులు’ అనే భారతీయ ప్రత్యేకతను చూపిస్తోంది. ఇక గలౌటి కబాబ్‌ల నుంచి మురుక్కు వరకు, భాకర్వాడి నుంచి మినీ కచోరీల వరకు.. ఈ విందులో కనిపించే ప్రతి రుచి భారతదేశంలోని ఒక ప్రాంతానికి ప్రతినిధిగా నిలవనుంది.
అందుకే ఈసారి బ్రిక్స్ సదస్సులో చర్చలు ముగిసిన తర్వాత ప్రపంచ నేతలు గుర్తుంచుకునేది కేవలం దౌత్య నిర్ణయాలు మాత్రమే కాకపోవచ్చు. భారత్ ఇచ్చిన ఆతిథ్యం.. ఆ టేబుల్‌పై వడ్డించిన దేశీ రుచులు కూడా కావచ్చు. ‘అతిథి దేవోభవ’ అనే భారతీయ భావనకు.. ఈ బ్రిక్స్ విందులు మరో రుచికరమైన నిర్వచనంగా నిలుస్తున్నాయి.
