బ్రిక్స్ కు వచ్చిందెవరు? రానిదెవరు?
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు బ్రిక్స్ ఎలా మొదలైంది? ఎవరి ఆలోచనలకు ప్రతిరూపం అన్న విషయంలోకి వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూస్తాయి.
By: Garuda Media | 14 Sept 2026 10:04 AM ISTగడిచిన కొద్దిరోజులుగా భారత మీడియాతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు మిస్ కాకుండా కవర్ చేసిన అంశాల్లో ఒకటి ఢిల్లీ వేదికగా జరిగిన పద్దెనిమిదో బ్రిక్స్ సదస్సు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికాకు పెద్దగా నచ్చని వేదికల్లో ఒకటి బ్రిక్స్. అలాంటి సదస్సు ఢిల్లీ వేదికగా జరగుతుండటం.. దానికి చైనా అధ్యక్షుడు సుదీర్ఘ విరామం తర్వాత భారత్ కు రావటం లాంటి ఆసక్తికర అంశాలతో పాటు.. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాల మీద అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు బ్రిక్స్ ఎలా మొదలైంది? ఎవరి ఆలోచనలకు ప్రతిరూపం అన్న విషయంలోకి వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూస్తాయి. బ్రిక్స్ దేశాలకు సంబంధం లేని ఒక ప్రముఖ ఆర్థిక వేత్త మదిలో పుట్టిన ఒక ఆలోచన.. ఈ రోజున ప్రపంచం మొత్తం ఈ కూటమికి చెందిన సదస్సు గురించి ఒక కన్నేసి చూస్తుందంటే.. దాని ప్రాధాన్యత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. అయితే.. బ్రిక్స్ సదస్సుకు సంబంధించిన ఇప్పటికే వందలాది వార్తలు వచ్చాయి. అయితే.. ఏ ప్రముఖ మీడియా సంస్థ ఒక అంశం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసింది లేదు. అదేమంటే.. ఈ సదస్సుకు సభ్య దేశాలు.. భాగస్వామ్య దేశాలకు చెందిన వారిలో ఎవరు వచ్చారు? ఎవరు రాలేదన్నది. ఆ విషయంలో పాటు.. బ్రిక్స్ పుట్టుక.. దాని ఎదుగుదలను ప్రస్తావించి.. అసలు విషయంలోకి వెళ్లిపోదాం.
దాదాపు పాతికేళ్ల క్రితం (2001లో) బ్రిటన్ కు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జిమ్ ఓ నీల్ అనే పెద్ద మనిషి మదిలో పుట్టిన ఒక సరదా ఆలోచనకు ప్రతిరూపం నేటి బ్రిక్స్. అప్పట్లో ఆయన ఆలోచన ఏమంటే.. బ్రెజిల్.. రష్యా.. ఇండియా.. చైనా దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. 2050 నాటికి ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయని. ఇదంతా ఏదో ఆలోచనతో ఆయన సరిపెట్టలేదు. తన ఆలోచనలకు ప్రతిరూపంగా ఆయనో పరిశోధనా పత్రాన్ని తయారు చేశారు. ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో కలిపి బ్రిక్ గా సూత్రీకరించారు. బ్రెజిల్ ‘బి’, రష్యా ‘ఆర్’, ఇండియా ‘ఐ’, చైనా ‘సి’ కలిపి బ్రిక్ (BRIC). ఈ నాలుగు దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తులుగా ఎదుగుతాయని ఆయన అంచనా వేశారు. ఆయన వాదనకు అనుగుణంగా ఆ తర్వాతి రోజుల్లో ఆయా దేశాల ప్రభుత్వాలు దౌత్య వేదికగా మార్చేశాయి.
కట్ చేస్తే.. ఈ నాలుగు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు 2006 సెప్టెంబరులో న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమావేశమయ్యారు. దీనిని ఒక అధికారిక కూటమిగా మార్చాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లే.. మూడేళ్ల అనంతరం 2009లో రష్యాలోని యెకాతెరిన్ బర్గ్ లో మొదటి బ్రిక్ (ఇప్పుడు బ్రిక్స్ అంటున్నారు. అప్పటికి మాత్రం బ్రిక్. అలా ఎందుకో తర్వాత చెప్పుకుందాం) శిఖరాగ్ర సమావేశం జరిగింది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చటం.. ప్రపంచ వ్యాప్తంగా పరస్పర సహకారాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా ఈ తొలి సదస్సును ఏర్పాటు చేశారు. అయితే.. 2010లో ఈ కూటమిలోకి దక్షిణాఫ్రికా వచ్చి చేరింది. దీంతో.. ఆ దేశ మొదటి అక్షరమైన ‘ఎస్’ (సౌతాఫ్రికా) చేరటంలో ఇప్పటి బ్రిక్స్ పేరుకు చేరింది. ఆ తర్వాత మరిన్ని దేశాలు చేరినా.. పేరును మాత్రం మార్చలేదు. 2011లో చైనాలో జరిగిన సదస్సులో సౌతాఫ్రికా మొదటిసారి పాల్గొంది. అలా మొదలైన బ్రిక్స్ ప్రయాణం తాజాగా ఢిల్లీ వేదికగా 20వ సదస్సును నిర్వహించింది. దీనికి బ్రిక్స్ 11 సభ్య దేశాలు.. 10 భాగస్వామ్య దేశాలకు చెందిన వారు హాజరయ్యారు. 11 సభ్య దేశాల్లో 8 దేశాలకు చెందిన అధినేతలు/ప్రధానమంత్రులు హాజరయ్యారు. బ్రెజిల్, సౌదీ అరేబియా, యూఏఈలు మాత్రం తమ అత్యుత్తమ నాయకులకు బదులుగా ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
స్థానిక ఎన్నికల కారణంగా బ్రెజిల్ అధ్యక్షుడు హాజరు కాలేదు. సౌదీ తరఫున విదేశాంగ మంత్రి, యూఏఈ తరఫున అబుదాబి యువరాజు హాజరయ్యారు. ఇక.. పది భాగస్వామ్య దేశాల (బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్ లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం) విషయానికి వస్తే.. మూడు దేశాలకు (కజకిస్తాన్ అధ్యక్షుడు, మలేషియా ప్రధాని, వియత్నాం ప్రధాని) ప్రధాని/అధ్యక్షులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఏడు దేశాలకు చెందిన మంత్రులు, ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాని, దౌత్య ప్రతినిధి స్థాయి వారు హాజరయ్యారు.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. సౌదీ అరేబియాను సభ్యదేశంగా ప్రస్తావిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో అది బ్రిక్స్ లో పూర్తిస్థాయి సభ్యదేశంగా చెప్పటం లేదు. దాని స్థితి మీద స్పష్టత లేదని చెప్పొచ్చు. ఇలాంటి వేళే.. సౌదీ అధినేత బ్రిక్స్ సదస్సుకు హాజరుకాకపోవటాన్ని ఒక ప్రతికూల అంశంగా చూడాల్సిన అవసరం లేదు. యూఏఈ విషయానికి వస్తే.. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరు కాకున్నా.. అబుదాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రావటంతో.. యూఏఈ బ్రిక్స్ సదస్సుకు ప్రాధాన్యత ఇవ్వలేదనటం తప్పే అవుతుంది.
యూఏఈ అధ్యక్షుడు హాజరు కాకున్నా.. ఆయన తరఫున అబుదాబి యువరాజు రావటంతో.. కొరత కాస్త తగ్గిందనే చెప్పాలి. మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సదస్సుకు దూరంగా ఉండటానికి కారణాల్ని ఆయా దేశాలు అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యం.. దీనికి అమెరికా సైనిక సహకారం వేళ.. వారు బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో యుద్దం చేస్తున్న ఇరాన్ ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ బ్రిక్స్ కు రావటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
చివరగా.. మీడియాలో పెద్దగా ఫోకస్ కాని మరో అంశాన్ని ప్రస్తావించి ముగిస్తే బాగుంటుంది. అదేమంటే.. ఇరాన్–యూఏఈల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, అబుదాబి యువరాజు ఖాలెద్ ముఖాముఖిగా భేటీ కావటం చూస్తే.. బ్రిక్స్ సదస్సులో మరో కోణం కనిపిస్తుంది. అంతేకాదు.. ఇరు దేశాలు మధ్యప్రాచ్య యుద్ధంపై సంయమనం పాటించాలన్న సంయుక్త ప్రకటనకు మద్దతు ఇవ్వటం చూస్తే.. విభేదాలున్న దేశాల్ని ఒకే వేదికపైకి తీసుకురావటంలో బ్రిక్స్ పోషిస్తున్న పాత్ర.. ఇంకా ఎలాంటి పరిణామాలకు వేదిక కానుందో? అన్నది కాలమే సమాధానం ఇస్తుంది.
