Begin typing your search above and press return to search.

మోడీ గాలా డిన్నర్ రచ్చలోకి పారిశ్రామికవేత్త ఎంట్రీ

బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని నరేంద్ర మోడీ గాలా డిన్నర్ ను హోస్ట్ చేయటం తెలిసిందే. ఇందులో వడ్డించిన వంటకాల మీద జరుగుతున్న రాజకీయ రచ్చ తెలిసిందే.

By:  Garuda Media   |   15 Sept 2026 1:05 PM IST
మోడీ గాలా డిన్నర్ రచ్చలోకి పారిశ్రామికవేత్త ఎంట్రీ
X

బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని నరేంద్ర మోడీ గాలా డిన్నర్ ను హోస్ట్ చేయటం తెలిసిందే. ఇందులో వడ్డించిన వంటకాల మీద జరుగుతున్న రాజకీయ రచ్చ తెలిసిందే. భారతదేశంలో 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారని.. అయినా పూర్తి శాఖాహారమే వడ్డించిన వైనాన్ని సోషల్ మీడియా పోస్టుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పోస్టు చేయటం.. ఆయన పోస్టుకు కాంగ్రెస్ నేతలు అసలు అర్థాన్ని వెలికి తీయటంతో మొదలైన చర్చ ఇప్పుడు స్థాయి దాటిన పరిస్థితి. అసలు విపక్ష నేతగా ఉండాల్సిన పెద్ద మనిషి మాట్లాడాల్సిన అంశాలేమిటన్న చర్చ ఒకటైతే.. ఈ అంశంపై రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. పారిశ్రామికవేత్తలు సైతం స్పందించటం గమనార్హం.

తాజాగా దిగ్గజ పారిశ్రామికవేత్త కం ఆర్ పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా రియాక్టు అయ్యారు. సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే ఆయన.. తాజాగా గాలా డిన్నర్ పై పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాకాహార వంటలు భారత్ లో ఉన్నాయని.. వాటిని మనం ఎందుకు ప్రదర్శించకూడనీ ప్రశ్నించారు. అంతేకాదు.. డిన్నర్ మెనూలో పేర్కొన్న వంటల వైవిధ్యాన్ని ప్రస్తావించారు.

ఇది సాదాసీదా వెజ్ మెనూ కాదన్న ఆయన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని విశిష్ట వెజ్ మెనూగా పేర్కొన్నారు. గుజరాత్ నుంచి ఖాండ్వి.. అవధ్ నుంచి మష్రూమ్ గలౌటీ.. కశ్మీర్ నుంచి గుచ్చి.. దక్షిణాది నుంచి పోరియల్.. పాత ఢిల్లీకి చెందిన ఫ్రూట్ క్రీమ్.. జిలేబీ లాంటి ఎన్నో అద్భుత వంటకాల్ని చేర్చారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. సదరు విందులో పాల్గొనే అవకాశం తనకు వచ్చి ఉంటే ఎంతో బాగుండేదన్న వ్యాఖ్యను పోస్టు రూపంలో పెట్టారు. నిజానికి ఇదో రాజకీయ రచ్చగా మారిన వేళ.. ఇలాంటి అంశాలపై పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారు స్పందించే కన్నా మౌనంగా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. అసలు విషయం కంటే కొసరు విషయాల మీదే ఎక్కువ చర్చ జరుగుతాయన్న నానుడికి తగ్గట్లు.. బ్రిక్స్ సదస్సు సాధించిందేంటి? భారత్ కలిగిన లాభనష్టాల కంటే కూడా మోడీ గాలా డిన్నర్ మెనూ మీదనే ఎక్కువ చర్చ జరుగుతుండటం విశేషం.