Begin typing your search above and press return to search.

బ్రిక్స్: 45 పేజీలు.. 140 పేరాల ఢిల్లీ డిక్లరేషన్ ‘సారం’ ఇదే

ప్రపంచం ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది. అందరి అంచనాలకు మించి అద్భుతమైన దౌత్య విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.

By:  Garuda Media   |   13 Sept 2026 2:11 PM IST
బ్రిక్స్: 45 పేజీలు.. 140 పేరాల ఢిల్లీ డిక్లరేషన్ ‘సారం’ ఇదే
X

ప్రపంచం ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది. అందరి అంచనాలకు మించి అద్భుతమైన దౌత్య విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. 11 పూర్తిస్థాయి సభ్య దేశాలు.. 10 భాగస్వామ్య దేశాలు.. మొత్తంగా 21 దేశాలు పాల్గొన్న బ్రిక్స్ 2026 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఢిల్లీ వేదికగా భారత్ ఈ సదస్సుకు అతిధ్యాన్ని ఇచ్చింది. వచ్చే ఏడాది చైనా వేదికగా ఈ సదస్సు జరగనుంది. వైరుధ్యమైన దేశాల నడుమ.. ఏకాభిప్రాయాన్ని తీసుకురావటం అంత తేలికైన విషయం కాదు. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూ.. అదే సమయంలో చైనా లాంటి పొరుగుదేశాన్ని డీల్ చేయటం.. ఆహ్లాదవాతావరణంలో కార్యక్రమాన్ని పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే.. అమెరికా మిత్రుడు కన్నెర్ర చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం కత్తి మీద సామే అవుతుంది.

ఓవైపు అమెరికా - ఇరాన్ యుద్ధం జరుగుతున్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ సదస్సుకు హాజరయ్యారు. మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు.. భారత్ కు సహజ మిత్రుడు పుతిన్ కూడా హాజరయ్యారు. అంటే.. యుద్ధాలు చేస్తున్న రెండు దేశాలకు చెందిన అధ్యక్షులు ఒక సదస్సుకు రావటం.. వారు అమెరికాకు శత్రువులుగా ఉండటం.. వారికి అతిధ్యమిచ్చిన భారత్ అగ్రరాజ్యానికి మిత్రుడిగా ఉండటం లాంటి పరిణామాల్ని చూస్తే.. ఈ సదస్సు నిర్వహణ.. విజయవంతంగా పూర్తి చేయటం సర్కస్ విన్యాసానికి ఏ మాత్రం తీసిపోదని చెప్పాలి.

బ్రిక్స్ సదస్సులో అత్యంత కీలకమైన డిక్లరేషన్ కు అందరి ఆమోదం పొందటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బ్రిక్స్ లోని అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ఆమోదించిన ఈ డిక్లరేషన్ ను ఢిల్లీ డిక్లరేషన్ గా వ్యవహరించనున్నారు. మొత్తం 45 పేజీల్లో 140 పేరాల్లో ఉన్న ఈ విస్త్రత ప్రకటనకు సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమోదించాయి. ఇంతకూ 140 పేరాల్లోని అంశాలేంటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ మొత్తం 140 పేరాల్ని కుదించి.. అంశాల వారీగా చూస్తే మొత్తం పది అంశాలుగా కనిపిస్తాయి. ఇది మన వెసులుబాటు కోసం చేసుకుంటున్న విభజన అన్నది మర్చిపోకూడదు.

1. ప్రపంచ పాలన సంస్కరణలు (ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ప్రపంచ దక్షిణానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి)

2. శాంతి, భద్రత, ఉగ్రవాదం (ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సంఘర్షణల పరిష్కారం, సౌర్వభమత్వం)

3. ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచ ఆర్థిక సంస్థలు (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు)

4. వాణిజ్యం.. పెట్టుబడులు (ఏకపక్ష సుంకాలు.. వాణిజ్య అడ్డంకులు.. సప్లై చైన్.. పరస్పర పెట్టుబడులు)

5. సాంకేతిక.. ఏఐ (కృత్రిమ మేధస్సు.. డిజిటల్ పరివర్తన.. సాంకేతిక అంతరాన్ని తగ్గించటం)

6. ఇంధనం.. వాతావరణ మార్పు (ఇంధన భద్రత.. పునరుత్పాదక ఇంధనం.. వాతావరణ ఆర్థిక సాయం)

7. ఆరోగ్యం.. ఆహార భద్రత (ఆరోగ్య సహకారం.. మహమ్మారుల సన్నద్ధత.. ఆహార భద్రత)

8. అభివృద్ధి.. సామాజిక సంక్షేమం (పేదరికం.. ఉపాధి.. మహిళలు.. యువత.. విద్య)

9. ప్రజల మధ్య సంబంధాలు (టూరిజం.. కల్చర్.. క్రీడలు.. విద్యార్థుల మార్పిడి)

10. బ్రిక్స్ సంస్థాగత నిర్మాణం (కొత్త సభ్యులు.. బ్రిక్స్ వ్యవస్థను బలోపేతం చేయటం.. నిరంతర సహకారం)

ఇప్పుడున్న పరిస్థితుల్లో భిన్నధ్రువాలుగా ఉండే దేశాలు ఒక తాటి మీదకు రావటం.. కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లటం మామూలు విషయం కాదు. మొత్తం 140 పేరాల్లో 139, 140 పేరాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకంటే.. 139వ పాయింట్ లో బ్రిక్స్ కు భారత ఛైర్మన్ షిప్ ను అందరూ ప్రశంసిస్తే.. 140 పేరాలో 2027లో బ్రిక్స్ ఛైర్మన్ షిప్ ను చైనాకు అప్పగించేందుకు అందరూ మద్దతు ఇవ్వటం. తాజా సమ్మిట్ లో అందరూ ఒప్పుకునేలా డిక్లరేషన్ చేయటం అంత తేలికైన విషయం కాదు.

ఇక్కడే భారత దౌత్యవేత్తల చతురత కనిపిస్తుంది. అదెలా అంటే.. వేదిక మీద ఉన్న భారత్, చైనా, రష్యా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఈజిప్టు, ఇథోపియా, సౌతాఫ్రికా దేశాల వ్యూహాలు.. వ్యూహాత్మక ప్రయోజనాలు భిన్నమైనవన్నది మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ కు యూఏఈకి అస్సలు పడదు. భారత్ - చైనా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి ప్రయోజనాలు వేరు. భారత్ - రష్యా దేశాల మధ్య సహజ మిత్రత్వం ఉన్నప్పటికి.. మధ్యలో అమెరికా పాత్రను విస్మరించలేం. ఇలా భిన్న ధ్రువాలు ఉన్నప్పటికి ఏకాభిప్రాయానికి రావటమే ఆసక్తికర అంశం.

ఇదెలా సాధ్యమైందన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతికితే ఒక కీలక అంశం కనిపిస్తుంది. అత్యంత వివాదాస్పద అంశాలకు ఒకేలాంటి భాషను వాడకుండా కొన్ని కీలక పదాల్ని తెలివిగా జొప్పించటమే కారణం. సుంకాల ప్రస్తావన తెచ్చారే కానీ యూఎస్ పేరును తెర మీదకు తీసుకురాలేదు. డాలర్ స్థానంలో బ్రిక్స్ కరెన్సీ అనే కన్నా.. స్థానిక కరెన్సీలతో మార్పిడి చేసుకుందామని సున్నితంగా చెప్పటం కనిపిస్తుంది. గ్లోబల్ సౌత్ అజెండాను ప్రపంచానికి చెప్పే క్రమంలో భారత నాయకత్వం బ్రిక్స్ లో పెద్ద సర్కసే చేసింది.

అదెలా అంటారా? చైనాను తక్కువ చేయకుండా.. రష్యాను సంతృప్తి పరుస్తూ.. ఇరాన్ తో మాట్లాడుతూనే.. యూఏఈని ఇబ్బందికి గురి చేయకుండా.. అమెరికాకు ఆగ్రహం కలగకుండా ఉండేలా ప్లాన్ చేయటమే తాజా సక్సెస్ కు అసలు కారణం. మొత్తంగా చూస్తే మోడీ నాయకత్వంలో భారత్ సాధించిన అద్భుత దౌత్య విజయంగా చెప్పాలి. కొందరు ఒప్పుకోరు కానీ బ్రిక్స్ సదస్సు ఇంతలా సక్సెస్ కావటంలో మోడీ పిల్లర్ లా నిలిచారని చెప్పాలి. ఎందుకంటే.. సమకాలీన కాలంలో ఒక భారత దేశ ప్రధాని తన పదవీ కాలంలో చైనా అధ్యక్షుడ్ని దాదాపు 21 సార్లు కలిశారు. వేదికలు ఏవైనా ఇన్నిసార్లు కలవటం.. ఇరు దేశాలకు సంబంధించిన నిర్ణయాత్మక స్థాయిలో ఉండటంతో వ్యక్తిగత నమ్మకాలకు.. స్నేహానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి కొన్నిసార్లు లాభదాయకంగా మారుతుంటాయి. బ్రిక్స్ సదస్సు దీనికి ఒక ఉదాహరణ.

2024 కజాన్ సమావేశం తర్వాత భారత్–చైనా సంబంధాల్లో మెరుగుదల మొదలైంది. తాజా బ్రిక్స్ సదస్సు నాటికి ఒక స్థాయికి చేరుకోవటమే కాదు.. ప్రాశ్చాత్య దేశాలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకు కారణమైంది. నిజానికి.. ఈ సదస్సు బ్రిక్స్ కు మాత్రమే కాదు.. అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాని మోడీ నాయకత్వానికి, భారత దౌత్య సామర్థ్యానికి మరింత గుర్తింపు తీసుకొచ్చే పరిణామంగా మారింది. భిన్నప్రయోజనాలు ఉన్న బ్రిక్స్ సభ్యులను 140 పాయింట్లు ఉన్న పత్రం మీద సంతకం చేయించటం ఆసక్తికర పరిణామం. అదెలా సాధ్యమైంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే పలు అంశాలు కనిపిస్తాయి.

ఢిల్లీ డిక్లరేషన్ లో ప్రపంచ పాలనా సంస్కరణలకు సంబంధించిన కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణకు వాయిదా వేయకూడదని.. నిర్దిష్ట కాలపరిమితలో స్పష్టమైన ఫలితాలు ఉండాలన్న వాదనను భారత్ బలంగా వినిపించింది. ఐఎంఎఫ్.. ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల్లో ఇప్పటి ఆర్థిక వ్యవహారాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలన్న వాదనను భారత్ వినిపించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా తోడ్పడుతున్న దేశాలకు నిర్ణయాత్మక స్థానాలు రావాలన్న మాటతో పాటు.. ప్రపంచ దక్షిణ దేశాల ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించటం కీలక అంశం.

ఇప్పటివరకు పశ్చిమ దేశాల నియమాలను పాటించే దక్షిణ దేశాలుగా కాకుండా.. నియమాలు రూపొందించే స్థాయికి ఎదగాలని.. ఆ దిశగా గుర్తింపు లభించాలన్న ఆకాంక్ష భారత్ నోటి నుంచి రావటం ముఖ్యమైన అంశం. బ్రిక్స్ దేశాల మధ్య నావికులకు అత్యవసర సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన భారత్ నుంచి వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన ప్రతిపాదనగా చెబుతున్నారు. బ్రిక్స్ సదస్సు లో తీసుకున్న నిర్ణయాల అమలు అంశాన్ని పరిశీలించే వ్యవస్థ అవసరాన్ని భారత్ సూచన చేసింది. దీన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. బ్రిక్స్ భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్ ను భారత్ సిద్ధం చేసినట్లైంది.

బ్రిక్స్ ఢిల్లీ సదస్సు విజయవంతం కావటానికి మరో కీలక అంశం కూడా ఉంది. చైనా.. రష్యా ప్రాధాన్యతలను తగ్గించకుండా జాగ్రత్తలు తీసుకోవటం. ప్రాశ్చత్య అధిపత్యం తగ్గటం.. బహుళధ్రువ ప్రపంచం..ప్రపంచ దక్షిణానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వటం.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంస్కరణ.. వాణిజ్య రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకత.. ఏకపక్ష ఆంక్షలకు వ్యతిరేకత.. స్థానిక కరెన్సీ వినియోగం (డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించటం)లాంటివి ఉన్నాయి. అదే సమయంలో రష్యాకు సానుకూల అంశాలు ఉండటంతో.. బ్రిక్స్ సదస్సు సక్సెస్ అయ్యింది.

కొన్ని విశ్లేషణలను పరిశీలించినప్పుడు.. 140 పేరాలను భారత్, చైనా ప్రయోజనాల కోణంలో విడివిడిగా అంచనా వేస్తే ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తుంది. ఇవేమీ అధికారిక లెక్కలు కావు. పలు విశ్లేషణలు.. అంచనాల్ని పరిశీలించి చూస్తే.. ఒకే అంశం భారత్‌కూ, చైనాకూ అనుకూలంగా ఉండే సందర్భాలు ఉన్నాయి. భారత ప్రయోజనాలకు స్పష్టంగా అనుకూలంగా ఉన్న అంశాలు గణనీయంగా ఉండగా.. చైనా ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న అంశాలు కూడా తక్కువేమీ కావు. అదే సమయంలో.. ఇరు దేశాలకూ కొంతమేర అనుకూలంగా ఉండే అంశాలు, ప్రతికూల ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి. ఇరు దేశాలకూ దాదాపు తటస్థంగా ఉండే అంశాలకు కొదవలేదు. మొత్తంగా చూస్తే.. ఢిల్లీ డిక్లరేషన్ ఏ ఒక్క దేశ ప్రయోజనాల కోసం రూపొందిన పత్రం కాదని.. పరస్పర ప్రయోజనాలను సర్దుబాటు చేసుకుంటూ ఏకాభిప్రాయానికి వచ్చిన పత్రంగా చూడాల్సి ఉంటుంది.

ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా భారత్ కు బాగా లాభం చేకూరే కీలక అంశం.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు. ఇది భారత్ కు ఒక పెద్ద విజయం. ఎందుకంటే.. తాజా డిక్లరేషన్ లో భారత్, బ్రెజిల్ కు అంతర్జాతీయ వ్యవస్థలో పెద్ద పాత్ర ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు. దీనికి చైనా ఓకే చెప్పటమే అసలు విజయం. ఎందుకంటే.. చైనా మాత్రమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్విత సభ్య దేశం ఆసియాకు చెందిన చైనా మాత్రమే ఉంది. ఇప్పటికే పలుమార్లు భారత్ కు భద్రతా మండలిలో చోటు కల్పించాలన్న చర్చ వచ్చినా.. చైనా బహిరంగంగా తన సానుకూలతను వ్యక్తం చేయలేదు. తాజాగా అది సాధ్యమైంది. పహల్గామ్ ఉగ్రదాడిని చైనా ఖండించింది. పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు కానీ.. ఉగ్రవాదంపై ఎలాంటి సమర్థన ఉండకూడదని స్పష్టం చేసింది. భారతదేశ నాయకత్వంలో బ్రిక్స్ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం ముందుకు వెళ్లటంలో భారతదేశ పాత్ర కీలకమని ప్రత్యేకంగా అభినందించటం భారత్ కు ఘన విజయంగా చెప్పాలి.

మరి.. చైనాకు లాభం కలిగించిన అంశాల విషయానికి వస్తే.. ఏకపక్ష ఆంక్షలకు వ్యతిరేకం (సుంకాల వడ్డన)గా పేర్కొనటం.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుమతి లేని ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు.. ద్వితీయ ఆంక్షలను డిక్లరేషన్ తీవ్రంగా వ్యతిరేకించటం చైనాకు లాభం చేకూరుస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచం కూడా చైనాకు లాభాన్ని తీసుకొచ్చేదే. అమెరికా ఆధిపత్యం ఉన్న ఏకధ్రువ వ్యవస్థకు బదులుగా అనేక శక్తి కేంద్రాలుండే ప్రపంచాన్ని డిక్లరేషన్ పేర్కొంది.గ్లోబల్ సౌత్ కు పెద్దపీట వేయటం.. బ్రిక్స్ దేశాల స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు.. సరిహద్దు చెల్లింపు వ్యవస్థల అనుసంధానం డిక్లరేషన్ లో ప్రస్తావించటం చైనాకు.. రష్యాకు మేలు కలిగించేవి. మొత్తంగా చూస్తే.. ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని విజయవంతంగా పూర్తి చేయటమే బ్రిక్స్ 2026 సదస్సు సూపర్ సక్సెస్ కు కారణంగా చెప్పొచ్చు.