Begin typing your search above and press return to search.

దోమలకు దోమలతోనే చెక్.. బ్రెజిల్ కొత్త అస్త్రం

బ్రెజిల్ లో ప్రపంచంలోనే అత్యధికంగా డెంగ్యూ కేసులు ఉన్నాయి. దాదాపు 10 కేసుల్లో ఒక కేసు బ్రెజిల్ లోనే నమోదవుతోంది.

By:  A.N.Kumar   |   12 Dec 2025 5:00 AM IST
దోమలకు దోమలతోనే చెక్.. బ్రెజిల్ కొత్త అస్త్రం
X

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. ఇప్పుడు ఎన్నో రోగాలకు కారణం అవుతున్న దోమలను దోమలతోనే చెక్ పెట్టే కొత్త అస్త్రాన్ని బ్రెజిల్ కనుగొన్నది.. ఈ అద్భుతంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ, జికా, చికున్ గున్యా వంటి వ్యాధులపై పోరాటంలో బ్రెజిల్ దేశం ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి దోమలనే ఉపయోగిస్తోంది. ఈ వినూత్న వ్యూహం ఇప్పటికే అనేక బ్రెజిలియన్ నగరాల్లో అద్భుతమైన ఫలితాలను అందించింది.

దోమలు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సమస్య

యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రకారం.. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి. ఏటా సుమారు 700 మిలియన్ల మంది జికా వైరస్, డెంగ్యూ, మలేరియా, పసుపు జ్వరం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో చాలా వరకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. వాతావరణ మార్పులు, పెరిగిన ప్రపంచ ప్రయాణాలు కారణంగా దోమల నివాసస్థలం విస్తరిస్తోంది. అయితే క్రిమిసంహారక మందులు టీకాలు ఈ వ్యాధులను పూర్తిగా అరికట్టలేకపోతున్నాయి. అందుకే బ్రెజిల్ వంటి దేశాలకు కొత్త పరిష్కారాలు అవసరం అయ్యాయి.

బెజ్రిల్ అస్త్రం వొల్బిటో దో బ్రసిల్

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై పోరాటంలో బ్రెజిల్ 2025 జులైలో భారీ ముందడుగు వేసింది. వొల్బాకియా బ్యాక్టీరియా ను మోసుకెల్లే ఎడెస్ ఈజిప్టి దోమలను ఉత్పత్తి చేయడానికి అంకితమైన ప్రపంచంలోనే అతిపెద్ద కొత్త బయోఫ్యాక్టరీని కురిటిబా నగరంలో ప్రారంభించింది. దీనికి వొల్బిటో దో బ్రసిల్ అని పేరు పెట్టారు. వొల్బాకియా అనేది సహజంగా చాలా కీటకాలలో కనిపించే ఒక బ్యాక్టీరియా.. కానీ ఏడెస్ ఈజిప్టి దోమల్లో సాధారణంగా ఉండదు. శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇది డెంగ్యూ, జికా, చికున్ గున్యా వంటి వైరల్ లను దోమ శరీరంలో పెరగకుండా నిరోధిస్తుందని కనుగొన్నారు.దోమ జీవితం యథావిధంగా ఉంటుంది కానీ వైరస్ ను వ్యాప్తిని దోమ చేయలేదు. ఈ వొల్బాకియా దోమలు సహజసిద్దమైన దోమలతో సంపర్కం జరిపినప్పుడు కాలక్రమేణా స్థానిక దోమల జనాభాలో ఎక్కువభాగం వొల్బాకియాను కలిగి ఉంటుంది. కఠినమైన రసాయనాలు లేకుండా కేవలం ప్రకృతి ఆధారిత , దీర్ఘకాలిక విధానంతో ప్రజలలో సంక్రమణ రేటు తగ్గుతుంది. ఇది సురక్షితమైనది.. పర్యావరణ అనుకూలమైనది.

బ్రెజిల్ లో ప్రపంచంలోనే అత్యధికంగా డెంగ్యూ కేసులు ఉన్నాయి. దాదాపు 10 కేసుల్లో ఒక కేసు బ్రెజిల్ లోనే నమోదవుతోంది. 2024 అత్యంత దారుణమైన సంవత్సరంగా నిలిచింది. 10 మిలియన్ల కంటే ఎక్కువ కేసులు , 6297 మరణాలు నమోదయ్యాయి.

వొల్బిటో దో బ్రసిల్ ప్రారంభం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రపంచ పోరాటంలో ఒక ముఖ్యమైన మలుపు. భారీ సంఖ్యలో వొల్బాకియా దోమలను విడుదల చేయగల సామర్థ్యంతో బ్రెజిల్ మిలియన్ల మంది ప్రజలను రక్షించడానికి బాగా సిద్ధంగా ఉంది. నిపుణులు బ్రెజిల్ ఈ విధానాన్ని ఇతర దేశాలు అనుసరించడానికి ఒక నమూనాగా చూస్తున్నారు.