తెల్ల బంగారం మారింది... బంగ్లా విషయంలో భారత్ ను వెనక్కి నెట్టిన బ్రెజిల్!
ఇక భారత్ విషయానికొస్తే 1.4 మిలియన్ బేళ్లను సరఫరా చేసింది. ఇది మార్కెట్ వాటాలో 15% అని నివేదిక తెలిపింది.
By: Raja Ch | 10 Dec 2025 8:30 AM ISTప్రపంచంలోని అతిపెద్ద వస్త్ర మార్కెట్లలో ఒకటైన బంగ్లాదేశ్ లో భారత్ దీర్ఘకాల ఆధిపత్యాన్ని బ్రెజిల్ ముగించిన విషయం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు అతిపెద్ద పత్తి వనరుగా బ్రెజిల్ మారింది. ఈ విషయాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవసాయ శాఖ (యూ.ఎస్.డీ.ఏ) నివేదిక వెల్లడించింది. వాస్తవానికి 2024 - 25 మార్కెటింగ్ సంవత్సరం (ఆగస్టు 24 - జూలై 25) వరకూ బంగ్లాదేశ్ మొత్తం దిగుమతుల్లో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగింది!
అవును... 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో బంగ్లాదేశ్ మొత్తం దిగుమతుల్లో భారీ వాటాతో పత్తి నూలు ప్రధాన సరఫరాదారుగా భారత్ కొనసాగింది! అయితే డిసెంబర్ లో ప్రచురించబడిన యూ.ఎస్.డీ.ఏ. నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్ రికార్డ్ స్థాయిలో 8.28 మిలియన్ బేళ్ల పత్తిని దిగుమతి చేసుకోగా.. వీటిలో బ్రెజిల్ 1.9 మిలియన్ బేళ్లను సరఫరా చేసింది. ఇది మార్కెట్ వాటాలో 25శాతంగా ఉంది!
ఇక భారత్ విషయానికొస్తే 1.4 మిలియన్ బేళ్లను సరఫరా చేసింది. ఇది మార్కెట్ వాటాలో 15% అని నివేదిక తెలిపింది. అయితే ఒక ఏడాది క్రితం మాత్రం భారత్ 1.79 మిలియన్ బేళ్ల సరఫరాతో 23% వాటాతో ఆధిక్యలో ఉండేది. ఇక ఇతర ప్రధాన సరఫరాదారుల్లో అమెరికా వాటా 7% కాగా.. అనేక పశ్చిమ ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా దేశాలు స్వల్ప వాటాను కలిగి ఉన్నాయి.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లో రాజకీయ పాలన మార్పును కూడా యూ.ఎస్.డి.ఏ నివేదిక ప్రస్తావించింది. ఇందులో భాగంగా.. ఆగస్టు 2024లో బంగ్లాలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడీమెడ్ గార్మెంట్ ఉత్పత్తికి ప్రారంభంలో అంతరాలు ఎదురైనప్పటికీ.. పత్తి దిగుమతులు మాత్రం మార్కెటింగ్ ఇయర్ 2025 వరకూ స్థిరంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
కాగా.. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైనిక హెలీకాప్టర్ ఎక్కి భారత్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లక్షలాది మంది నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసం వైపు తరలివచ్చారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే ఉన్నారు! నాటి ఆందోళనల్లో సుమారు 1,400 మంది మరణించారని చెబుతున్నారు.
