130 అడుగుల ఎత్తు నుండి 21 ఏళ్ల అమ్మాయి దుర్మరణం.. వంతెన పై నుంచీ!
అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటేనే ప్రాణాలతో చెలగాటం అని చెప్పాలి. సరైన భద్రతా ప్రమాణాలు తీసుకోకపోతే అవి ఎంత ప్రమాదకరంగా మారుతాయో తెలిపే ఒక అత్యంత దారుణమైన ఘటన బ్రెజిల్‌లో జరిగింది.
By: Madhu Reddy | 14 Jun 2026 4:52 PM ISTఅడ్వెంచర్ స్పోర్ట్స్ అంటేనే ప్రాణాలతో చెలగాటం అని చెప్పాలి. సరైన భద్రతా ప్రమాణాలు తీసుకోకపోతే అవి ఎంత ప్రమాదకరంగా మారుతాయో తెలిపే ఒక అత్యంత దారుణమైన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. బంజీ జంప్ (రోప్ జంప్) చేయడానికి సిద్ధమైన 21 ఏళ్ల యువతిని, నిర్వాహకులు కనీసం సేఫ్టీ రోప్ కట్టకుండానే వంతెన పైనుంచి కిందకు తోసేశారు. దాంతో ఆమె 130 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం:
బ్రెజిల్‌లోని లైమీరా నగరంలో ఉన్న ఒక బ్రిడ్జ్ వద్ద మరియా ఎదువార్డా అనే యువతి బంజీ జంప్ చేయడానికి వెళ్ళింది. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన స్పోర్ట్స్ లవర్. అయితే, జంప్ చేయించే క్రమంలో అక్కడి సిబ్బంది దారుణమైన పొరపాటు చేశారు. ఆమె శరీరానికి ప్రధానమైన సేఫ్టీ తాడును సరిగ్గా అమర్చకుండానే, ప్లాట్‌ఫారమ్ నుంచి వదిలేశారు.
గాల్లోంచి చూస్తుండగానే దారుణం:
ఆమె వంతెన పైనుంచి దూకిన మరుక్షణమే అక్కడున్న వాళ్లకు అసలు విషయం అర్థమైంది. తాడు కిందనే ఊడిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు "అయ్యో తాడు.. తాడు కట్టలేదు!" అని గట్టిగా అరిచారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. సుమారు 40 మీటర్ల (130 అడుగులు) ఎత్తు నుంచి ఆమె అత్యంత వేగంగా కింద పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఫైటర్లు, డాక్టర్లు అక్కడికి చేరుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
అడవిలోకి పారిపోయిన కేటుగాళ్లు:
ఈ ఘోర ప్రమాదాన్ని చూసి భయపడిపోయిన ఈవెంట్ ఆర్గనైజర్లు బాధితురాలిని కాపాడటం మానేసి, అక్కడి నుంచి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే మిలిటరీ పోలీసులు హెలికాప్టర్ సహాయంతో రంగంలోకి దిగి గాలించి, వారిని పట్టుకున్నారు. ఇక ఈ ఘోర నిర్లక్ష్యానికి కారణమైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అడ్వెంచర్ ఆటలపై పెరిగిపోతున్న ఆందోళన:
ఈ హృదయ విదారక ఘటన ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహణపై పెద్ద చర్చకు దారితీసింది. కేవలం డబ్బుల కోసం ఎలాంటి అనుమతులు, కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన ఆటలను నిర్వహించడం వల్లే ఇలాంటి ప్రాణాలు పోతున్నాయని జనాలు మండిపడుతున్నారు.
ఇక సరదా కోసం చేసే ఇలాంటి సాహసాలు ఒక్కోసారి జీవితాన్నే ముగించేస్తాయి. నిర్వాహకుల చిన్న పొరపాటు ఒక యువతి ప్రాణాన్ని బలితీసుకుంది. అందుకే ఇలాంటి అడ్వెంచర్ గేమ్స్ ఆడేటప్పుడు కేవలం థ్రిల్ కోసం కాకుండా, అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయో ఒకటికి రెండుసార్లు చూసుకోవడం ప్రాణాలకే రక్షణ.
