Begin typing your search above and press return to search.

మరణానికి ముందు మెదడులో అసలేం జరుగుతుంది.. అధ్యయనంలో విస్తుపోయే నిజాలు!

చనిపోయే ఆ కొన్ని క్షణాల ముందు మన మెదడులో ఏం జరుగుతుంది? మన కళ్ల ముందు జీవితం సినిమా రీల్‌లా కనిపిస్తుందా? అనే సందేహాలకు శాస్త్రవేత్తలు ఇప్పుడు సమాధానం కనుగొన్నారు

By:  Madhu Reddy   |   3 March 2026 11:59 AM IST
మరణానికి ముందు మెదడులో అసలేం జరుగుతుంది.. అధ్యయనంలో విస్తుపోయే నిజాలు!
X

మనిషి పుట్టుక ఎంతటి రహస్యమో, మరణం కూడా అంతకంటే పెద్ద మిస్టరీ. చనిపోయే ఆ కొన్ని క్షణాల ముందు మన మెదడులో ఏం జరుగుతుంది? మన కళ్ల ముందు జీవితం సినిమా రీల్‌లా కనిపిస్తుందా? అనే సందేహాలకు శాస్త్రవేత్తలు ఇప్పుడు సమాధానం కనుగొన్నారు. ఒక వ్యక్తి మరణించే ముప్పై సెకన్ల ముందు మెదడులో జరిగే వింత పరిణామాలను పరిశోధకులు రికార్డ్ చేశారు. ఆ ఆసక్తికరమైన విషయాలు, మరణం అంచున మెదడు పంపే సంకేతాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మరణానికి 30 సెకన్ల ముందు.. మెదడులో మెరిసే జ్ఞాపకాలు:

మరణం సంభవించే సరిగ్గా 30 సెకన్ల ముందు మన మెదడు అత్యంత చురుగ్గా మారుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. లూయిస్ విల్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జెమ్మర్ బృందం, ఒక వృద్ధుడి మెదడు తరంగాలను (EEG) పరిశీలిస్తున్నప్పుడు ఈ అద్భుతాన్ని గమనించారు. ఇక గుండె ఆగిపోవడానికి కొద్ది క్షణాల ముందు, మెదడులో మనం కలలు కనేటప్పుడు లేదా పాత విషయాలను గుర్తు చేసుకునేటప్పుడు వచ్చే 'గామా ఆసిలేషన్స్' వంటి తరంగాలు కనిపించాయి. అంటే, మనిషి ప్రాణం పోయే ముందు తన జీవితంలోని అత్యంత మధురమైన, ముఖ్యమైన సంఘటనలను ఒక్కసారిగా నెమరువేసుకుంటాడని ఈ పరిశోధన చెబుతోంది. మనకు ఇష్టమైన వ్యక్తులు, మనం సాధించిన విజయాలు ఒక వెలుగులా మెదడులో మెరిసిపోతాయన్నమాట.

సైన్స్ ఏం చెబుతోంది? ఎలుకల నుంచి మనుషుల వరకు:

ఇక మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని క్షణాల పాటు నాడీ వ్యవస్థ పని చేస్తూనే ఉంటుంది. ఈ స్థితిలో మెదడు హైపర్-అలెర్ట్ మోడ్‌లోకి వెళ్తుందని పరిశోధకులు గుర్తించారు. నిజానికి 2013లో ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి, కానీ మనుషుల్లో ఇది స్పష్టంగా రికార్డ్ అవ్వడం ఇదే తొలిసారి. ఇక మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా ధ్యానం చేస్తున్నప్పుడు మెదడు ఏ స్థాయిలో అయితే ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటుందో, మరణానికి ముందు కూడా సరిగ్గా అదే తరహా స్పందనలు కనిపిస్తాయి. ఇక దీనిని బట్టి మరణం అనేది కేవలం శరీరం ఆగిపోవడం మాత్రమే కాదు, మెదడు తన యజమానిని పంపించే ముందు ఇచ్చే ఒక గౌరవ వందనం లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.