Begin typing your search above and press return to search.

పాక్ కు ముచ్చెమటలు పట్టేలా బ్రహ్మోస్ రేంజ్ చెప్పిన రక్షణ మంత్రి!

ఆపరేషన్ సిందుర్ తో పాకిస్థాన్ కు చావు తప్పి కన్ను లొట్టబోయిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   18 Oct 2025 6:39 PM IST
పాక్  కు ముచ్చెమటలు పట్టేలా బ్రహ్మోస్ రేంజ్ చెప్పిన రక్షణ మంత్రి!
X

ఆపరేషన్ సిందుర్ తో పాకిస్థాన్ కు చావు తప్పి కన్ను లొట్టబోయిన సంగతి తెలిసిందే. నాడు నాలుగు రోజుల్లో పాక్ కు ముచ్చెమటలు పట్టిన భారత్.. కాళ్ల బేరానికి వచ్చేసరికి సీజ్ ఫైర్ కి అంగీకరించింది. అయినప్పటికీ ఆ యుద్ధంలో తమదే విజయం అంటూ ఆత్మవంచన చేసుకుంటూ కారుకూతలు కూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి నుంచి పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లింది.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే. భారత్ క్షిపణులు ఏకంగా ఇస్లామాబాద్ ను టచ్ చేసిన పరిస్థితి. దీంతో.. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ సైతం కలుగుల్లోకి వెళ్లారనే కథనాలు వచ్చాయి. ఈ సమయంలో ఆ యుద్ధంలో కీలక భూమిక పోషించిన 'బ్రహ్మోస్' గురించి రాజ్ నాథ్ సింగ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌ నవూలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ ను రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ సందర్శించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు. ఇక్కడ తొలివిడత బ్రహ్మోస్‌ క్షిపణులను ఉత్పత్తి చేయగా.. వాటిని కేంద్ర మంత్రి సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే పాక్ కు వార్నింగ్ ఇచ్చారు.

ఇందులో భాగంగా... భారత పొరుగుదేశంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలోనే ఉందని చెప్పిన రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్.. పాకిస్తాన్‌ ను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పిలిచారు. ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ భద్రతకు బ్రహ్మోస్ ఆచరణాత్మకమైనదని నిరూపించబడిందని అన్నారు.

గెలవడం అనేది కేవలం ఒక సంఘటన కాదు కానీ.. అది మనకు అలవాటుగా మారిందని చెప్పిన రాజ్ నాథ్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ అనే ట్రైలర్‌ తోనే పాకిస్తాన్‌ కు భారతదేశం పునర్జన్మనివ్వగలిగితే.. అది ఇంకా ఏమేమి చేయగలదో తాను చెప్పనవసరం లేదని గ్రహించేలా చేసిందని అన్నారు! భారత సాయుధ దళాలకు బ్రహ్మోస్ ఒక ముఖ్యమైన స్తంభంగా మారిందని కొనియాడారు!

ఈ సందర్భంగా... బ్రహ్మోస్ ఏరోస్పేస్ లక్నోలోని సరోజిని నగర్‌ లోని కొత్త ఇంటిగ్రేషన్, టెస్ట్ ఫెసిలిటీ నుండి క్షిపణి వ్యవస్థ మొదటి బ్యాచ్‌ ను విజయవంతంగా తయారు చేసిందని అధికారిక ప్రకటన తెలిపింది. మే 11న ప్రారంభించబడిన ఈ అత్యాధునిక యూనిట్.. క్షిపణి ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఫైనల్ క్వాలిటీ టెస్టింగ్ ల కోసం అన్ని ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది.