Begin typing your search above and press return to search.

బొత్సపై అల్లుడు శ్రీను కినుక?! జడ్పీ చైర్మన్ పీఠంపై ఫ్యామిలీలో లొల్లి

అయితే ఇక్కడే కుటుంబంలోని మరికొందరు ఇబ్బంది పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   1 Sept 2026 12:27 PM IST
బొత్సపై అల్లుడు శ్రీను కినుక?! జడ్పీ చైర్మన్ పీఠంపై ఫ్యామిలీలో లొల్లి
X

ఉత్తరాంధ్రలో వైసీపీ రాజకీయాలను శాసిస్తున్న సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు సొంత ఇంట్లోనే కుంపటి రాజుకుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. విజయనగరం జడ్పీ చైర్మనుగా తన కుమార్తె పోటీ చేస్తుందంటూ బొత్స చేసిన ప్రకటనను సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారనేది ఆ ప్రచారం సారంశమని చెబుతున్నారు. బొత్స ప్రకటన పట్ల ప్రస్తుత జడ్పీ చైర్మన్, బొత్సకు స్వయాన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అసంతృప్తికి లోనవుతున్నారని అంటున్నారు. తనతో మాట మాత్రం చెప్పకుండా బొత్స చేసిన ప్రకటనను జడ్పీ చైర్మన్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అయితీ ఈ వాదనను బొత్స అనుచరులు కొట్టి పడేస్తున్నారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన మామ బొత్స మాట జవదాటరని అంటున్నారు. మేనల్లుడిని ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతోనే బొత్స ఉన్నారని, అందుకే తన కుమార్తెను జడ్పీ బరిలో దింపాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

సీనియర్ నేత బొత్స తన కుమారుడు, కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇక్కడే కుటుంబంలోని మరికొందరు ఇబ్బంది పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానంగా సీనియర్ బొత్సకు నీడలా పనిచేసిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులో ఈ ఆవేదన మరింత ఎక్కువగా ఉందని బొత్స సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఈ కారణంగానే జడ్పీ చైర్మన్ తన ఆవేదనను మామ బొత్సకు తెలియజేయాలనే ఉద్దేశంతో కొంతకాలంగా బొత్స పర్యటనలకు దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులే ఈ ప్రచారం సృష్టించారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని బొత్స అనుచరులు చెబుతున్నారు.

ఎందుకీ ప్రచారం?

బొత్స నీడలో రాజకీయం చేసిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లాలో తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రధానంగా బొత్స తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే బొత్స ఏమనుకున్నారో కానీ, జడ్పీ చైర్మనును పక్క జిల్లాలోని భీమిలి నియోజకవర్గ ఇంచార్జిగా పంపారు. ఈ నియామకంపై ఆయన నొచ్చుకున్నారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. కానీ, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆదేశాలతోనే విజయనగరం జడ్పీ చైర్మన్ ను భీమిలి ఇంచార్జిగా నియమించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బొత్సతోపాటు జడ్పీ చైర్మనుకు అధినేతతో సాన్నిహిత్యం ఉందని, ఆయన సేవలకు గుర్తింపునివ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి దింపాలని అధినేత ఆలోచించారని, అందుకే ఆయనకు భీమిలి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

అసంతృప్తి నిజమేనా?

అయితే సిట్టింగు చైర్మనుగా ఉన్న తనను కాదని తన మేనమామ చేసిన ప్రకటనతో మజ్జి శ్రీనివాసరావు షాక్ తిన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలా అని ఆయన ఇంతవరకు బొత్సను విమర్శించినట్లుగా, వ్యతిరేకించినట్లుగా ఎక్కడా బయటపడలేదు. బొత్స పర్యటనకు దూరంగా ఉంటున్నారనే ఏకైక కారణంతోనే సోషల్ మీడియాలో బొత్స ప్రత్యర్థులు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.