బొత్సను ఫుల్ గా టార్గెట్ చేస్తున్నారా ?
విజయవాడలో జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల వస్తే ఆమెను ఆహ్వానించారు బొత్స.
By: Satya P | 15 Sept 2025 9:36 AM ISTబొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్. వైసీపీలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన వారు ప్రస్తుతం శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. అయితే బొత్స దీనికంటే ముందు కాంగ్రెస్ లో ఏళ్ళ తరబడి నాయకుడిగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. వైఎస్సార్ కి అత్యంత ఆప్తుడు గా మెలిగారు. ఒక దశలో సీఎం పోస్టుకు ఆయన పేరు ప్రతిపాదన స్థాయి దాకా వచ్చింది అంటే బొత్స బిగ్ లీడర్ అని వేరేగా చెప్పాల్సిన పని అయితే లేదు.
మర్యాదకు పోతే :
బొత్స అందరితోనూ బాగా ఉంటారు. అన్ని పార్టీల నేతలతో ఆయన ఎంతో కలివిడిగా ఉంటారు. రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అన్నది ఆయన స్వభావంగా ఉంటుంది. వైసీపీలో చూస్తే అలా లేదు. ఆ పార్టీ సింగిల్ గానే ఉంటుంది. ఎవరితో పొత్తులు ఉండవు. ఏ నాయకుడితోనూ పెద్దగా టచ్ లో ఉండరని కూడా అంటారు కానీ బొత్స మాత్రం అధికార పక్షం వైపు వారు అయినా లేక సాటి విపక్ష నేతలు అయినా నవ్వుతూ పలకరిస్తారు. ఇపుడు అదే పాపం అయిందా అన్న చర్చ వస్తోంది.
షర్మిలను ఆహ్వానించి :
విజయవాడలో జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల వస్తే ఆమెను ఆహ్వానించారు బొత్స. అయితే షర్మిల వర్సెస్ జగన్ అన్నట్లుగా ఏపీలో పాలిటిక్స్ సాగుతోంది. పైపెచ్చు వైసీపీ దారుణంగా ఓటమికి అంతే కాదు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకపోవడానికి షర్మిల పీసీసీ చీఫ్ గా చేసిన తీవ్ర విమర్శలు కూడా కారణం అని ఆ పార్టీ నేతలు భావిస్తారు ఇక సోషల్ మీడియాలో అయితే షర్మిలకు గట్టిగానే కౌంటర్లు వేస్తూంటారు. ఇపుడు బొత్స ఆమెతో కలసి నవ్వుతూ మాట్లాడడంతో బొత్స మీద కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అభిమానులు అంతా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.
నెగిటివ్ కామెంట్స్ తో :
వైఎస్ షర్మిలతో బొత్స అలా ఎందుకు వ్యవహరించారు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టింగులతో క్వశ్చన్ లు వేస్తున్నారు. దీంతో బొత్స ఇరుకునపడినట్లు అయింది అని అంటున్నారు. ఇది ఆయన సహజ స్వభావం అని అందులో వేరే ఉద్దేశ్యాలు ఆంతర్యాలు ఏమీ ఉండవని ఆయనను ఎరిగిన వారు అంటున్నారు. అయితే వైసీపీలో మాత్రం దీని మీద చర్చ సాగుతోంది. జగన్ ని వైసీపీని దారుణంగా విమర్శించిన షర్మిల బొత్సకు ఎలా మంచిగా కనిపిస్తున్నారు అని కూడా అంటున్నారు మొత్తానికి బొత్స ఏడు పదులకు చేరువలో ఉన్న ఈ వయసులో ఈ తరహాలో సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తోంది అని అంటున్నారు.
